మైదానం చుట్టూ పాతిన రంగు రంగుల జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఓ చివర స్టేజి, మైదానం నిండా మైకులు ఉన్నాయి. ఇక కొద్దిసేపటిలో సభ ప్రారంభం కానున్నది. సభకు వచ్చిన వాళ్లకు కుర్చీలు ఏర్పాటు చేస్తే బాగుండేది కానీ మన వాళ్లకు కుర్చీల్లో కూర్చునే ట్రైనింగ్ లేదు కనుక కింద కూర్చోక తప్పదు అన్నాడు సమావేశకర్త.
మైదానం నిండా నల్లనీ, తెల్లవీ, గోధుమ రంగువీ, కొన్ని రంగులు కలిసినవీ, చుక్కలున్నవీ, పెద్ద చెవులు వేలాడేసేవీ, పొట్టి తోకలవీ, పొడుగు తోకలవీ, నిలబెట్టిన తోకలవీ, చుట్టచుట్టిన తోకలవీ గుంపులు గుంపులుగా గుండ్రాలు గుండ్రంగా ఒక్క చోట చేరి ముచ్చట్లాడుకుంటున్నవి. ముఖ్యఅతిథి అంత ఎత్తు వుంది. నడకలో హుందాతనం వున్నది. స్టేజి మీదకి చెంగున ఎగిరి నిలబడ్డది. దాన్ని గౌరవంగా తోలుకు వచ్చినవి. స్టేజిమీద ఆ పక్కా ఈ పక్కా సర్దుకు నిలబడ్డవి.
సభలో గుసగుసలు వినిపించసాగినవి. వీధుల్లో తిరిగే మనకు ఈ జాతి కుక్క ముఖ్య అతిథేమిటి వింతగాకపోతే అందో పొట్టి చెవుల కుక్క.
అది జర్మన్ షెపర్డ్‌కి చెందిందే కావచ్చుగాని పెంచుకున్న వాళ్లు తమ వల్ల కాదని వదిలేస్తే మన మాదిరిగానే వీధులు పట్టుకు తిరుగుతున్నది. మనలో కలిసిపోయింది. కనుక మనవాడే అన్నది మరో పొడుగుతోక కుక్క. ష్.. అరవకండి. ప్రస్తుతం మనం వున్న క్లిష్ట పరిస్థితుల్లో ఐక్యంగా వుండడం అవసరం. జాతి బేధాలు మరచిపోదాం. లేకలేక మనమంతా ఇలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన మనుగడకు సంబంధించిన కీలక సమావేశం. అందువల్ల తోకలు కాళ్ల సందున దాచుకుని బుద్ధిగా కూచుందాం అన్నది ఓ నల్లమచ్చల తెల్ల కుక్క.
స్టేజి మీద నుంచి సమావేశ కర్త నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. రోజంతా మొరుగుతూనే వుండే మనం కాసేపయినా నిశ్శబ్దంగా వుండి మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం అని మైకులో బిగ్గరగా కేకెయ్యడంతో సభకు వచ్చిన వాళ్లంతా జాతి కుక్కలూ, ట్రెయిన్డ్ కుక్కలూ కాకపోయినా, ఎంతో క్రమశిక్షణగా కూచున్నాయి.
మిత్ర కుక్కల్లారా! కుక్క మిత్రులారా! మీరంతా నా మాట విని బుద్ధిగా కూచున్నందుకు చాలా సంతోషం. ఇదే విధంగా సభ పూర్తయ్యే వరకూ కూర్చుంటారని ఆశిస్తున్నాం. మీకు తెలిసే వుండవచ్చు. ఇటీవల ఒక సినిమా మొదటిరోజు చూడటానికి వచ్చిన జనం తోపులాటలో ఒక మహిళ ప్రాణం పోయింది. ఆమె వెంట వచ్చిన బాబు ఇంకా కోలుకోలేదు. కుంభ మేళా కుమ్ములాటలో, క్రికెట్టు స్టేడియం తన్నులాటలో ఎంతోమంది ఊపిరులు వదిలేశారు. అలాంటి దుర్ఘటనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోండి. లేకపోతే కుక్కచావు చస్తారు. ఇప్పుడు మన ముఖ్యఅతిథి, గొప్ప జాతి వాడైనా మనలాంటి బడుగు వీధి జీవుల కోసం మనం భవిష్యత్తును ఎలా సరిదిద్దుకోవాలో వివరించడం కోసం వచ్చాడు. ఆయన సందేశం వినండి, లైక్ చేయండి, ఫాలో చెయ్యండి అంటూ మైకు ముఖ్య అతిథికి అందించాడు సమావేశకర్త.
ముఖ్య అతిథి సందేశం ఆరంభించాడు. ప్రియ గ్రామ సింహాల్లారా! మనను అందరూ వీధి కుక్కలని అవమానిస్తారు, కానీ మన ఆత్మగౌరవం అభిమానం తెలియవచ్చే పేరు గ్రామ సింహం. మనం కుక్కలం కాదు సింహాలం, గ్రామ సింహాలం. చరిత్రలో మనకెంతో పేరు ప్రఖ్యాతులున్నవి. గ్రామాలలో దొంగతనాలు జరగకుండా కాపాడిన ఘనమైన చరిత్ర వున్నందు వల్ల మనని గ్రామసింహాలు అనేవారు. కాని ఇప్పుడు వీధి కుక్కలు అంటున్నారు. అందుకు మనలోని కొందరు కారణం అని చెప్పడానికి విచారిస్తున్నాను. దొంగల్ని చూసి మొరగాల్సిన మనవాళ్లు కాలినడకన వెళ్లే వాళ్లని, బైక్‌లమీద బుర్రుమనే వాళ్లని చూసి మొరుగుతున్నారు. ఇది కరెక్టు కాదు. మనం ఒక ఉద్దేశ్యం కోసం ఒక ఆదర్శం కోసం మొరగాలి కానీ, ఊరికే తిన్నది అరగక కాదు. మనలో కొంతమంది మరీ క్రూరంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పళ్లు తీపరం పుట్టి, ఒళ్లు కొవ్వెక్కి పిల్లల్ని, వృద్ధుల్ని కరుస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల మనజాతి నశించిపోయే ప్రమాదం వున్నది. ఇప్పటికే అడవులను మాయం చేసి ఎన్నో వన్యప్రాణుల జాతులనే లేకుండా చేసిన మనిషి మన ఈ వింత చేష్టలను, వికారపు పనులను సహించడు. రోడ్డు ప్రమాదాల్లో అనుకోకుండా కుక్క చావు చచ్చే మనల్ని ఈమనుషులు ఊళ్లోనుంచి తరిమేయవచ్చు, మూకుమ్మడిగా చంపేయవచ్చు. కోర్టువారి పుణ్యమా అని ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం. జంతు ప్రేమికుల ధర్మమా అని తోకలు ఇంకా ఊపగలుగుతున్నాం. మన ప్రవర్తన మారాలి. విశ్వాసానికి మారు పేరన్న మన పేరు నిలబెట్టుకోవాలి మనం’ అని ఉపన్యాసం ముగించాడు ముఖ్య అతిథి.
ఇళ్లల్లో పెంచుకునే జాతి కుక్కలకు కావలసినంత తిండి, చలికి ఎండకూ తట్టుకోవడానికి సదుపాయాలూ ఉంటాయి కనుక జాతి కుక్కలకు ఇప్పట్లో ప్రమాదం లేదు. కానీ వీధికుక్కలమైన మనం ఈ మధ్య పిచ్చిపిచ్చిగా, పొగరుబోతులంగా ప్రవర్తిస్తున్నాం. మనుషులతో మనకు వున్న అనుబంధాన్ని మరచిపోతున్నాం. మన ప్రవర్తన మార్చుకుని వారి ప్రేమను తిరిగి పొందుదాం. మన చిరకాలపు స్నేహాన్ని పునరుద్దరించుకుందాం. రాబిస్ ఇంజక్షన్లు చెయ్యడానికి, వేసక్టమీ ఆపరేషన్లు చెయ్యడానికి మన సంపూర్ణ సహకారాన్ని అందిద్దాం. మనకు షెల్టర్లు నిర్మించాలని కోర్టు అన్నది కాని ఏడు వేల కోట్ల మందిమైన మనకు షెడ్లు నిర్మించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అసలే అప్పుల్లో వున్న ప్రభుత్వాల మీద భారం వేయలేం. వీధివీధికీ అన్నపూర్ణ క్యాంటీన్‌లా ఓ చోట ఏర్పాటు చేసి ఇంత ముద్ద పడేస్తే తిని, ఇళ్ల ముందు కాపలాగా వుందాం కానీ మనల్ని మనుషులు శత్రువులుగా భావించే అవకాశం ఇవ్వవద్దు. గుంపులుగా తిరగడం మానేసిమనకు మనమే 144 సెక్షన్ విధించుకుని వీధులనీ, ఇళ్లనీ పంచుకుని మంచి పేరు తెచ్చుకుందాం. అర్థమైందా? అందరికీ సమ్మతమేనా? అనరిచాడు సమావేశకర్త.
సభకు వచ్చిన కుక్కలన్నీ తోకలు పైకి ఎత్తి గ్రామసింహాల ప్రవర్తన మారాలి! మనుషులతో స్నేహంగా ఉండాలి! అని కేకలు పెట్టాయి.
- చింతపట్ల సుదర్శన్
9299809212