”నేను భగభగమని మండిపోకపోతే
నువ్వు కణకణమని తగులబడకపోతే
మనం జ్వలన జ్వాలలం కాకపోతే
ఈ చీకటి తొలగి వెలుగులెలా వస్తాయి?”
టర్కిష్ మహాకవి నాజిమ్ రాసిన ఈ కవితా పాదాలు ఏ సందర్భంలోనివైనా.. వర్తమానంలో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి. పౌరసమాజాన్ని హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తం కాకపోతే అది మన ప్రజాస్వామ్యానికే మహా ప్రమాదం. ఇప్పుడు మన అడవుల్లో ఉదయాలు పక్షుల కిలకిలారావాలతో మొదలుకావడం లేదు. తుపాకుల మోతలతో తెల్లారుతున్నాయి. తాజాగా మాడ్వీ హిడ్మాతో సహా ఆరుగురు మావోయి స్టుల ‘ఎన్‌కౌంటర్’ కూడా మారేడుమిల్లిలో అదే దృశ్యాన్ని ఆవిష్కరించింది. హిడ్మా తల్లి పుంజితో పాటు అసంఖ్యాకులైన ఆదివాసీ తల్లుల దు:ఖం నేడు అరణ్యమంతటా ప్రతిధ్వనిస్తోంది. సహజ న్యాయ సూత్రాలను, రాజ్యాంగ ధర్మాలనే కాదు, ప్రజల జీవించే హక్కును సైతం ”ఎన్‌కౌంటర్ న్యాయం” అనే అత్యంత భయంకరమైన చీకటి ఆవహిస్తున్నది. ఇలాంటి సందర్భంలో పౌరసమాజం మౌనంగా ఉంటే ఈ చీకటి ఎలా తొలగిపోతుంది? ఈ క్రూరమైన హత్యాకాండను ప్రశ్నించకపోతే మన మౌనమే ఆ అంధకారానికి హామీ అవుతుంది.
నేడు ఎన్‌కౌంటర్‌ల ప్రక్రియ ఒక ప్రమాదకర మైన పరంపరగా సాగుతోంది. మావోయిస్టుల పేరుతో, ఆధారాల లేమితో, విచారణ లేకుండానే ‘తీర్పులు’ అమలు చేయబడుతున్నాయి. ప్రభుత్వం మావోయిస్టుల హింసను అరికట్టాలను కుంటే అందుకు ప్రతిహింసను అప్రకటితంగా చట్టబద్ధం చేయడం ఎలా సమంజసం? అసలు ఈ సమస్య ఎందుకు పుడుతోంది? అందుకు మూలకారణాలు ఏమిటి? దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక అసమానతలు, నిరుద్యోగం, దారిద్య్రం, గిరిజన హక్కుల నిర్లక్ష్యం, భూమి, అడవి, నీటి మీద న్యాయమైన భాగస్వామ్యం లేకపోవడం, అభివృద్ధి పేరుతో సాగుతున్న స్థాన చలనం, జీవన విధ్వంసం ఇవన్నీ కలిసి కదా ఈ సమస్యకు మూలకారణాలు? వీటిని విస్మరించి, సామాజిక సమస్యలను ‘శాంతి భద్రతల సమస్య’గా మార్చి బుల్లెట్లతో ప్రత్యుత్తరం ఇవ్వడం పరిష్కారమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ప్రశ్నించేవారిని దోషులుగా ముద్రించి ఎన్‌కౌంటర్‌లలో చంపేస్తే చీకటి మరింత గాఢమవుతుంది.
వారు మావోయిస్టులైనా, ప్రతిపక్ష ఉద్యమకారులైనా, సాధారణ పౌరులైనా చట్టం అందరికీ ఒకటే. దీన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు. రాజ్యానికైతే అసలేలేదు. కానీ జరుగుతున్నదేమిటి?ఈ ఎన్‌కౌంటర్ సంస్కృతిలో మొదట హత్యకు గురవుతున్నది చట్టమూ న్యాయమే కదా! విచారణకు ముందు ఎవరూ దోషులు కాదని న్యాయం చెబుతోంది. కానీ విచారణే అవసరం లేదని ఎన్‌కౌంటర్ చెబుతోంది! అరెస్టు, విచారణ, రుజువులు. న్యాయస్థానం తీర్పులు తప్పనిసరని చట్టం అంటుంటే… ఒక్క బుల్లెట్ చాలని ఎన్‌కౌంటర్ అంటోంది! రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కునిస్తే.. రాజ్యం ఆ హక్కుకే దిక్కు లేకుండా చేస్తోంది. విచారణ లేకుండా శిక్ష విధించరాదన్న న్యాయసూత్రం, న్యాయస్థానం ముందు తన వాదన వినిపించే పౌరహక్కు ఎన్‌కౌంటర్‌ల ముసుగులో నిత్యం ఉల్లంఘనకు గురవుతున్నాయి. అదుపులోకి తీసుకుని విచారణ జరిపే అవకాశముండి కూడా కిరాతకంగా కాల్చి చంపడం, ఎన్‌కౌంటర్ అనే కట్టుకథలు అల్లడం షరామామూలుగా మారిపోయింది.
ఏ సమస్యకైనా చర్చలు ఒక పరిష్కార మార్గమనే సహజ సూత్రాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదు. చర్చలు సమస్య మూలాలకు అద్దం పడతాయి. పరిష్కారానికి దారులు వేస్తాయి. కానీ అద్దంలో తమ వైఫల్యాలను చూసుకోవడానికి ఏ ప్రభుత్వమైనా ఎందుకు ఇష్టపడుతుంది! తమ హింసను న్యాయబద్ధం చేయడానికి చర్చలు అడ్డుపడతాయని ఈ ప్రభుత్వాలకు బాగా తెలుసు. అందుకే వాటికి దారులు మూసి, హింసకు ద్వారాలు తెరుస్తున్నాయి. చర్చలకు అవకాశమివ్వకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమే అవుతుంది. ఇప్పుడు అడవుల్లో నెత్తురు పారించడం వెనుక ఈ సర్కారుకు మరో ఉద్దేశం కూడా ఉందనే విమర్శలున్నాయి. అరణ్యాల అడుగున దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్‌లకు కట్ట బెట్టే కుట్ర ఉన్నదనే అభిప్రాయాలున్నాయి. వీటిని కొట్టిపారేయలేం.
లేదంటే నిరాయుధులూ, అమాయకులూ అయిన ఆదివాసులను సైతం భయబ్రాంతులకు గురిచేసి అడవుల నుంచి తరిమేయడ మెందుకు? దేశ సంపదగా నిలవాల్సిన అరుదైన భూఖనిజాలు, సహజ వనరులను ”అభివృద్ధి” ముసుగులో ప్రయివేటు కంపెనీల ధనదాహానికి ధారాదత్తం చేయడానికి కాదా? అడవికి రక్షణగా నిలిచే ఆదివాసీలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. అందుకే ”ఈ ‘అభివృద్ధి యుద్ధం’ వెనుక ఉన్న అసలు లక్ష్యం ప్రజల భద్రత కాదు. వనరుల స్వాధీనమే” అన్న అభిప్రాయాలూ రోజురోజుకు బలపడుతు న్నాయి. చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను ‘శాంతి భద్రత ల’ పేరుతో మిలటరైజ్ చేయడం, అసలు ప్రశ్నలను మట్టిలో పాతిపెట్టి, ఆ మట్టినే వేల కోట్ల లాభాలకు అమ్మేందుకు పూను కోవడం వంటి దోపిడీ చర్యలను ఏ న్యాయమూ సమర్ధించదు. రాజ్యాంగ నియమాలూ అంగీకరించవు. అందుకే వాటన్నిటినీ కాలరాస్తూ ఈ దోపిడీకి కావలసిన నిశ్శబ్దాన్ని ”ఎన్‌కౌంటర్”ల ద్వారా తయారుచేస్తోంది రాజ్యం. కవి నాజిమ్ చెప్పినట్టు ఈ నిశ్శబ్దాన్ని బద్ధలు కొట్టకపోతే చీకటి తొలగి వెలుగులెలా వస్తాయి? పౌరసమాజం ఆలోచించాలి.
హింసరచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



