అమెరికా నిర్ణయం
చిన్నారుల వైద్య చికిత్సకు విఘాతమంటున్న సహాయ గ్రూపులు
వాషింగ్టన్ : గాజా నుంచి వచ్చే వారికి విజిటర్ వీసాల జారీని అమెరికా నిలిపివేసింది. పూర్తి స్థాయిలో, కూలంకషంగా పరిశీలన జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాలస్తీనా శరణార్థుల గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన పోస్టులపై మితవాదులు తీవ్రంగా స్పందించారు. ఆ వెంటనే అమెరికా విదేశాంగ శాఖ వీసాల జారీ నిలిపివేతపై నిర్ణయం తీసుకుంది. గాజాకు చెందిన శరణార్థులుగా చెప్పుకుంటున్న వారు ఈ నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్ మీదుగా అమెరికాలో ప్రవేశించారని మితవాది, ట్రంప్ సన్నిహితుడు లారా రూమర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇస్లామిక్ వలసదారులను అమెరికాలోకి ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. పాలస్తీనియన్లు మిస్సౌరీలో కూడా ప్రవేశిస్తున్నారని తెలిపారు.
అమెరికాలో గాజా శరణార్థుల ప్రవేశంపై విచారణ జరుపుతానని రిపబ్లికన్ సభ్యుడు చిప్ రారు తెలిపారు. ఈ ప్రవేశాలు దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తాయని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా అథారిటీ పర్యాటక పత్రాలు ఉన్న 640 మందికి మేలో అమెరికా వీసాలు మంజూరు చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. బీ1, బీ2 వీసాలు ఉన్న పాలస్తీనియన్లు అమెరికాలో వైద్య చికిత్స పొందవచ్చు. వీసాల జారీ నిలిపివేత నిర్ణయాన్ని సహాయక గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన, అమానుషమైన నిర్ణయమని విమర్శించాయి. కొత్తగా విధించిన ఆంక్షల కారణంగా అమెరికాలో అత్యవసర వైద్య చికిత్స పొందాలని అనుకుంటున్న చిన్నారులు ఇబ్బందులు పడతారని పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్ (పీసీఆర్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘గాజా యుద్ధంలో గాయపడిన, తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారులకు ప్రాణరక్షణ చికిత్స అందించడానికి వారిని అమెరికాకు తీసుకుపోయే అవకాశం లేకుండా పోతుంది’ అని హెచ్చరించింది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పీసీఆర్‌సీ డైరెక్టర్ తారెక్ హైలత్ అమెరికాను కోరారు. వీసాల జారీ నిలిపివేత చిన్నారుల ప్రాథమిక మానవ హక్కులకు భంగకరమని ఆయన చెప్పారు. అమెరికన్-ఇస్లామిక్ సంబంధాల మండలి (సీఏఐఆర్) కూడా అమెరికా చర్యను తప్పుపట్టింది. గాజాపై ఇజ్రాయిల్ దాడులను ముమ్మరం చేస్తున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గాజా వాసులకు వీసాల జారీ నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES