తెలంగాణలో నాణ్యమైన ఆటగాళ్లను తీర్చిదిద్దుతాం
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అభిమానుల్లో అద్భుత ఆదరణ
హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
వాలీబాల్ గ్రామీణ క్రీడ. తెలంగాణలో ప్రతిభావంతులకు ఎటువంటి కొదవ లేదు. కానీ ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా మనోళ్లను తీర్చిదిద్దేందుకు సరైన వేదిక లేదు. తెలంగాణలో వాలీబాల్ క్రీడను అభివృద్ది చేయటంతో పాటు రాష్ట్రంలో నాణ్యమైన వాలీబాల్ ఆటగాళ్లను తయారు చేయటమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ‘బ్లాక్‌హాక్స్ వాలీబాల్ అకాడమీ’ ఏర్పాటు చేస్తానని హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని, ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సభ్యులు అభిషేక్ రెడ్డి కంకణాల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ముందుకొస్తే.. బ్లాక్‌హాక్స్ తరఫున అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రతిభకు మెరుగులు దిద్దుతామని అభిషేక్ రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్‌కు గొప్ప ఆదరణ ఉంది. ప్రొఫెషనల్ స్థాయిలో సత్తా చాటేందుకు గ్రామీణ ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలు, మార్గదర్శనం కొరవడింది. ఈ పరిస్థితుల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సిద్ధంగా ఉన్నామని అభిషేక్ రెడ్డి కంకణాల అన్నారు. అక్టోబర్ 2 నుంచి 26 వరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో విజయవంతంగా సాగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ప్రదర్శన, ప్రైమ్ వాలీబాల్ లీగ్ పురోగతిపై అభిషేక్ రెడ్డి కంకణాల చెప్పిన విషయాలు ఆ మాటల్లోనే..
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మనోళ్లు ఆడాలి :
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో తెలంగాణ నుంచి ఒక్క ఆటగాడు లేకపోవటం అసంతృప్తిగా అనిపించింది. బ్లాక్‌హాక్స్ జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ఆటగాడైనా ఉండాలనే ఆలోచనతో గట్టి ప్రయత్నమే చేశాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ట్రయల్స్ నిర్వహించాం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు కనిపించలేదు. అందుకే ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణతో సరిపెట్టకుండా.. రాష్ట్రంలో వాలీబాల్‌ను అభివృద్ది చేయాలనే సంకల్పంతో ఉన్నాం. వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం, కార్పోరేట్ సంస్థల మద్దతు ఆశిస్తున్నాం. బహుళ జాతి సంస్థలు వాలీబాల్ ఆదరణను ప్రత్యక్షంగా స్టేడియంలో చూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేంద్రాల్లో కలిసొచ్చే భాగస్వామ్యుల పేరిట మినీ కోర్టులు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. బ్లాక్‌హాక్స్ శిక్షణ బృందం ట్రయల్స్ నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అంతిమంగా హైదరాబాద్‌లో బ్లాక్‌హాక్స్ అకాడమీలో ప్రతిభావంతులను అంతర్జాతీయ కోచ్‌ల శిక్షణ సారథ్యంలో ప్రపంచశ్రేణి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతామని అభిషేక్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ సహకారం బాగుంది :
ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాల్గో సీజన్ పూర్తిగా హైదరాబాద్‌లోనే జరిగింది. పీవీఎల్ విజయవంతంగా నిర్వహించటంలో ప్రభుత్వ సహకారం బాగుంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగు సీజన్లలో ఏకంగా మూడు సార్లు హైదరాబాద్‌లోనే నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి లీగ్‌ల నిర్వహణకు ఇక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇండోర్ స్టేడియం, ఆటగాళ్ల సాధనకు యూసుఫ్‌గూడలో మరో ఇండోర్ స్టేడియం అందుబాటులో ఉన్నాయి. స్టేడియం చుట్టుపక్కలే మంచి హోటల్స్, ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా స్టేడియానికి చేరుకునే వెసులుబాటు హైదరాబాద్‌ను గ్లోబల్ స్పోర్ట్స్‌కు సెంటర్‌గా నిలుపుతున్నాయి. అభిమానులు సైతం వాలీబాల్‌ను, ఆటగాళ్లను గొప్పగా ఆదరిస్తున్నారు. వాలీబాల్ ఆటగాళ్లకు నాలుగు సీజన్లలోనే అద్భుత గుర్తింపు లభించిందని అభిషేక్ రెడ్డి తెలిపారు.
ఓటమికి ఒత్తిడి ఓ కారణం :
నాలుగు సీజన్లలోనే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అభిమానుల ఆదరణ గణనీయంగా మెరుగైంది. టెలివిజన్ వీక్షణలు, ఆన్‌లైన్ వీక్షణలు ఈ ఏడాది గొప్పగా నమోదయ్యాయి. టెలివిజన్, ఆన్‌లైన్‌లో చూసే అభిమానులతో పాటు నేరుగా స్టేడియానికి వచ్చి వరల్డ్‌క్లాస్ వాలీబాల్ పోటీని ఆస్వాదించాలనే అభిమానులు ఎక్కువయ్యారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి అభిమానులు ప్రైమ్ వాలీబాల్ పోటీలను చూసేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వచ్చారు. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు అభిమానులు ఎంతో మద్దతుగా నిలిచారు. స్టేడియంలో అభిమానుల మద్దతు, స్టార్స్‌తో కూడిన జట్టుపై భారీ అంచనాలు అంతిమంగా ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేసిందని అనుకుంటున్నాం. సీజన్‌ను బ్లాక్‌హాక్స్ మెరుగ్గా మొదలెట్టినా.. ఆ తర్వాత ఒత్తిడితో విజయాలను వదిలేశారు. గత మూడు సీజన్లతో పోల్చితే ఈ ఏడాది పది జట్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. సెమీస్‌కు చేరిన, చేరని జట్ల మధ్య వ్యత్యాసం ఒక్క పాయింట్ మాత్రమే. బ్లాక్‌హాక్స్ ఓటమిని జట్టులో సమీక్షించి, వచ్చే సీజన్‌లో టైటిల్ సాధించటమే లక్ష్యంగా బలంగా పుంజుకుంటామని అభిషేక్ రెడ్డి కంకణాల అన్నారు.
హైదరాబాద్‌లో వాలీబాల్ అకాడమీ
- Advertisement -
- Advertisement -



