Wednesday, October 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఓట్‌ చోరీ

ఓట్‌ చోరీ

- Advertisement -

”ఆయనకేం పనీ పాటా లేదు!” అన్నాడు రమేష్‌ పొద్దున్నే వాట్సాప్‌ వార్తలు చదువుతూ. ”ఎవరికండీ!” భర్తకి ఛాయి అందిస్తూ అడిగింది వాణి. ”ఇంకెవరు? బంగారు స్పూన్‌ నోట్లో పెట్టుకుని పుట్టిన యువరాజుగారు, రాహుల్‌గాంధీ!” అన్నాడు రమేష్‌. ”ఏమిట్రా.. పొద్దున్నే రాహుల్‌గాంధీ మీద పడ్దావు?” అంటూ వచ్చాడు రాజు. ”లేకపోతే ఏమిట్రా అస్తమానం ఎన్నికల సంఘాన్ని తిట్టడం, దేశాన్ని ఇతర దేశాల ముందు అవమానించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు! అవున్లే ఇటలీ సంతానం కదా! మన దేశం మీద భక్తి ఎందుకుంటుందీ!” అన్నాడు రమేష్‌. ”ఆగాగు! ఇంతకూ రాహుల్‌గాంధీ చేసిన నేరమేమిటో ముందు చెప్పు! ఆ తర్వాత దేశద్రోహి ముద్ర వేద్దువుగాని!” అన్నాడు రాజు. ”కొత్తగా చెప్పేదేముందీ! రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను రోజూ తిట్టడమే ఆయన పని. ఇంత పెద్ద దేశంలో సమర్థవంతంగా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తే ఎలా? ఓట్ల చోరీ జరిగిందని ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతున్నాడు! ఓట్ల దొంగతనం జరిగితే ఆయన ఎలా గెలిచేవాడు? కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు ఎలా పెరిగేవి?” అన్నాడు రమేష్‌. ”రాజ్యాంగ సంస్థలు విమర్శలకు అతీతం కావు! కోర్టుల తీర్పులతో సహా దేనిమీదనైనా సరే తమ అభిప్రాయాలు చెప్పే భావ ప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించింది కదా!” అన్నాడు రాజు.

”భావ ప్రకటనా స్వేచ్ఛ వేరు! ఆరోపణలు వేరు! ఎన్నికల సంఘం మీద ఆరోపణలే చేస్తున్నాడు కదా! కానీ అదే ఆరోపణలపై ప్రమాణపత్రం సమర్పించమంటే రాహుల్‌గాంధీ పారిపోతున్నాడు! ఆరోపణలు నిజమేనని నమ్మకం ఉంటే ప్రమాణం చేయటానికెందుకు భయం?” అడిగాడు రమేష్‌. ”నీవు చెప్పింది నిజమే! ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి! ఈ దేశపు పార్లమెం టులో ప్రతిపక్ష నాయకుడు! అంతేకాదు, తాను చేస్తున్న ప్రతి ఆరోపణలకు సాక్ష్యం చూపుతు న్నాడు. ప్రతి ఓటరు లిస్టులో మొదటి నెంబరు గల ఓటు గల్లంతు అవుతున్నది. ఈ రాష్ట్రంలోని ఓటు తీసేయ మంటూ మరో రాష్ట్రంలోని వ్యక్తి ఫిర్యాదు చేస్తాడు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తేమో నేను ఫిర్యాదు చేయ లేదు! నాకేం తెలియదు బాబోరు అంటున్నాడు. ఫిర్యాదు చేసిన ఫోన్‌నెంబర్లు ఎవరివో తెలియదు. ఓటీపీ ఎట్లా వస్తున్నాయో! ఎవరికీ వస్తున్నాయో అంతా యోగమాయ! ఇదంతా గందరగోళంగా లేదా?” అడిగాడు రాజు.

”ఇందులో గందరగోళమేముంది? నీవు చెప్పిన ఆలింద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచింది కదా! ఓట్‌ చోరీ జరిగితే కాంగ్రెస్‌ ఎలా గెలిచేది?” ప్రశ్నించాడు రమేష్‌ గొప్ప లాజిక్‌ క్వశ్చన్‌ అడిగానని తనలో తనే మురిసిపోతూ. ”కాంగ్రెస్‌ గెలిస్తే ఓట్ల చోరీ జరగనట్లు కాదు! ఓడినంత మాత్రాన ఓట్‌ చోరీ జరిగినట్లూ కాదు! ఇలాంటి చర్చ పెట్టి అసలు విషయాన్ని ఎన్నికల సంఘం, మీరూ కలిసి ఏమార్చుతున్నారు!” అన్నాడు రాజు. ”ఆసలు విషయం ఏమిటి?” అన్నాడు రమేష్‌. ”ఓటర్లకు సంబంధం లేకుండానే కొన్ని ఓట్లు ఓటరు లిస్టులో నుండి తీసేయటం లేదా! కలపటానికి ఒక వ్యవస్థీకృత ప్రయత్నం చేస్తున్నారు! అలాంటి ప్రయత్నాన్ని ఎన్నికల సంఘం ఉద్దేశ్య పూర్వకంగానే అనుమతి ఇస్తున్నది!” అన్నాడు రాజు. ”ఎన్నికల్లో గెలవలేని వారు ఇలాంటి మాటలే చెబుతారు! నీవు చెప్పిందే నిజమైతే, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బెంగాల్లో రాష్ట్రాల్లో ఓట్ల చోరీ ఎందుకు జరగటం లేదు! ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల ఆయా పార్టీలు ఓట్ల చోరీ చేయించాయా? అక్కడున్న ఎన్నికల అధికారులే ఈ ఓట్ల చోరీ చేశారా?” అడిగాడు రమేష్‌.

”ఓట్ల చోరీ ఎక్కడ జరిగినా తప్పే! ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఎన్నికల్లో అవకతవకలు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుంది! ఎదురుదాడి చేస్తే సమస్య పక్కదారి పట్టదు! ఓటరు లిస్టులోని అవకతవకలు, ఎన్నికల్లో జరిగే అక్రమాలకు ఎన్నికలే సంఘమే బాధ్యత వహించాలి! ఓట్లు చోరీ చేస్తున్న వారెవరో తెల్పాల్సిన ఎన్నికల సంఘం ఆ పనిచేయకుండా ఎదురుదాడి చేస్తే ఎలా?” అన్నాడు రాజు. ”అంటే ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తుందా?” అడిగాడు రమేష్‌. ”అవును ఎన్నికల సంఘం కమిషనర్ల వైఖరి అలాగే ఉంది?” అన్నాడు రాజు. ”ఎన్నికల సంఘం కమిషన్‌ రాజ్యాంగబద్ధమైన సంస్థ! దానికి పక్షపాతం ఎందుకుంటుంది?” ప్రశ్నించాడు రమేష్‌. ”ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగబద్ధమైనదే! కాని కమిషన్‌ సభ్యుల ఎన్నికే రాజ్యాంగ బద్ధంగా లేదు! గతంలో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో ప్రధాని, ప్రతిపక్షనాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్రమంత్రి ఉండేలా చట్టసవరణ చేసింది! అంటే ముగ్గురిలో ఇద్దరు అధికారపార్టీ ప్రతి నిధులే ఉంటారు. అలాంటి కమిటీ నియమించిన కమిషనర్లు ఇలాగే ఉంటారు!” అన్నాడు రాజు.

”రాహుల్‌ గాంధీ ఇప్పటిదాకా చెప్పింది ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే! మరి దేశమంతా ఓట్ల చోరీ జరిగిందని గ్యారంటీ ఏమిటి?” ప్రశ్నించాడు రమేష్‌. ”నిజమే! దేశమంతా ఓట్ల చోరీ జరగలేదనే గ్యారంటీ ఇవ్వాల్సిందీ ఎన్నికల కమిషనే! ఎందు కంటే ఎన్నికలు నిర్వహించిందీ ఎన్నికల కమిషనే! రాహుల్‌గాంధీ పరిశోధించిన రెండు నియోజక వర్గాలలో గుర్తించిన విషయాలను వెలుగులోకి తెచ్చాడు. వాటిపై ఎన్నికల సంఘం సరైన రీతిలో స్పందించటం లేదు! అది సరేగాని ఆ మధ్య మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదా! ఏమైంది?” అడిగాడు రాజు. ”మన ఇండ్లల్లో ఏముంటాయి? పాపం దొంగలకు విలువైన వస్తువులు ఏమీ దొరకలేదు! అయినా సరే ఇంటి చుట్టూ, లోపలా సీసీ కెమెరాలు పెట్టించాను. బ్రహ్మాండమైన పిక్చర్‌ క్వాలిటీ ఉంది! ముసుగు వేసుకున్న దొంగలనైనా గుర్తించొచ్చు! చూడు!” అంటూ సీసీ టీవీలోని దృశ్యాలు చూపాడు రాజు.

”మీ ఇంట్లో ఇప్పటికీ విలువైన వస్తువులు ఏమీ లేవు కదా! మరి సీసీ టీవీ కెమెరాలు ఎందుకు పెట్టించావు?” అడిగాడు రవి. ”అమ్మమ్మ! ఎంతమాట ఇంట్లో విలువైన వస్తువులు లేనంత మాత్రాన దొంగలకు వదిలేస్తామా? దొంగతనానికి వచ్చిన దొంగలు ఎవరో తెలవద్దా! దొంగలను గుర్తించటానికి, మళ్లీ దొంగతనం చేయ కుండా ఈ ఏర్పాట్లు చేశాను!” అన్నాడు రమేష్‌. రాజు చిన్నగా నవ్వాడు.
”ఎందుకు నవ్వుతున్నావు?” అడిగాడు రమేష్‌. ”నీ ఇంట్లో దొంగతనం జరిగినా, విలువైన వస్తువులు ఏమీ లేవు. కాబట్టి నష్టమేమీ జరగలేదు! అయినా సరే దొంగలను గుర్తించటానికి సీసీ కెమెరాలు పెట్టించావు! ఎన్నికల కమిషన్‌ ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయటంలేదు! ఓట్ల చోరీ అయ్యిందని, రుజువులు చూపిస్తుంటే, దానిపై విచారణ చేయ టానికి సీఐడీ, లాంటి ప్రభుత్వ విచారణ సంస్థలు సమాచారం అడుగుతుంటే, ఎన్నికల కమిషన్‌ వాటికి ఎందుకు సహకరించ టంలేదు! పోనీ ఎన్నికల కమిషనే దీనిపై స్వయంగా దర్యాప్తు చేస్తానని చెప్ప టం లేదు! అంటే ఓట్ల చోరీకి ఎన్నికల కమిషన్‌లోని కొందరు మహానుభావులే పాల్పడుతున్నారని స్పష్టం అవుతున్నది! గతంలో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునేవారు! ఈ ఎన్నికల కమిషన్‌ పుణ్యమా అన్నీ బీజేపీ ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటున్నది!” అన్నాడు రాజు.

ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -