Thursday, January 8, 2026
E-PAPER
Homeజిల్లాలుఆగమాగంగా ఓటర్ల జాబితా

ఆగమాగంగా ఓటర్ల జాబితా

- Advertisement -

ఇల్లు ఒక వార్డులోఓటు మరో వార్డులో

ఓటర్లలో గందరగోళం

ఆశాస్త్రీయ పద్ధతిలో ఓట్ల విభజన

ఉద్యోగుల అవగాహన రాహిత్యం

లబోదిబోమంటున్న ప్రజలు

అయోమయంలో మాజీ కౌన్సిలర్లుఆశావహులు

మార్చాలంటూ 500 దరఖాస్తులు

నవతెలంగాణసూర్యాపేట

జిల్లాలో వార్డుల వారిగా ఉన్న ఓటర్ల జాబితా ఆగమాగంగా ఉంది. అదేవిధంగా ఓటర్ల భౌగోళిక సరిహద్దులు అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజల ఓట్లు తారుమారు అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో వేగం పెరగడంతో జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ఓటర్ల విభజన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేపట్టారు. ఇది గాక ఎస్సీ, ఎస్టీ, బిసి జనాభా వివరాల గుర్తింపు కూడా పూర్తి చేశారు.

ఏ వార్డులో వార్డులలో ఎంతమంది జనాభా ఉన్నదనే దానిపై లెక్కలు తేల్చారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపున ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం హడావుడి సృష్టించడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ కలెక్టర్లు ఉరుకులు పరుగులు పెడుతూ వార్డుల ఓట్లు జాబితా విభజనలో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో చూస్తే సూర్యాపేట జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 26 వేల 695గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మున్సిపాలిటీ వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ 52,205 మంది పురుష ఓటర్లు, 56,679 మంది మహిళా ఓటర్లు ఉండగా, 13 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,08,897గా నమోదైంది.

అదేవిధంగా కోదాడ మున్సిపాలిటీలో 28,560 మంది పురుష ఓటర్లు, 30,031 మంది మహిళా ఓటర్లు, 10 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, మొత్తం ఓటర్లు 58,601గా ఉన్నారు.మిర్యాలగూడ మున్సిపాలిటీలో 14,257 మంది పురుష ఓటర్లు, 15,731 మంది మహిళా ఓటర్లు, 8 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కలిపి మొత్తం ఓటర్లు 29,996గా ఉన్నారు.తిరుమలగిరి మున్సిపాలిటీలో 7,638 మంది పురుష ఓటర్లు, 7,817 మంది మహిళా ఓటర్లు ఉండగా, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు లేరు. మొత్తం ఓటర్ల సంఖ్య 15,455గా ఉంది.

నేరేడుచర్ల మున్సిపాలిటీలో 6,629 మంది పురుష ఓటర్లు, 7,116 మంది మహిళా ఓటర్లు, ఒక ట్రాన్స్‌జెండర్ ఓటరు ఉండగా, మొత్తం ఓటర్లు 13,746గా నమోదయ్యారు.ఈ ఐదు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల కంటే అధికంగా ఉండటం గమనార్హం. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఓటర్ల గణాంకాలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి.విలీన గ్రామాలను కలుపుకొని వార్డుల భౌగోళిక సరిహద్దులను నిర్ణయిస్తూ గతంలోనే వార్డులను విభజించిన విషయం తెల్సిందే. దీంతో గతంలో ఉన్న వార్డుల కంటే అదనంగా కలుపుకొని మొత్తంగా 141 వార్డులకు పేరిగిన విషయం విధితమే. అదేవిధంగా జిల్లాలో మొత్తంగా 2 లక్షల 26 వేల 695 మంది ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే వార్డుల వారిగా ఓట్ల జాబితా విభజనలో పారదర్శకత లోపించిందనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే జిల్లా లో గల అన్ని మున్సిపాలిటీలలో ఓటర్ల లిస్ట్ ను ప్రదర్శించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గుర్తింపు జాబితాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో మాత్రం విభజన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు నెలకొన్నాయి. ప్రధానంగా గతంలో నిలువగా ఉన్న వార్డులను అడ్డంగా చేసుకుంటూ భౌగోళిక సరిహద్దులను సవరిస్తూ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఓట్ల విభజన చేపట్టారు. ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు ఎన్నికల సంఘం అధికారులను వెనక నుండి తరుముతున్న నేపద్యంలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తూ జనాభా వివరాలను సేకరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే వార్డుల విభజన చేస్తున్న సమయంలో కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. ఇంకొందరి ఓట్లు వారు ఉంటున్న వార్డుకి నాలుగైదు వార్డుల తర్వాత ఓటు నమోదు అయివుంది. ఈ రకంగా వార్డులో ఓట్ల విభజనలో పారదర్శకత లోపించడం తో ఆయా వార్డుల ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రధానంగా ఉన్న వార్డులో గతంలో ఓటు ఉండగా ప్రస్తుతం వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ బిల్లు కలెక్టర్లు వార్డుల బొండరిలను గుర్తించడంలో విఫలం కావడంతో ఓటు ఉంటున్న వార్డులో కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న వార్డు లోకి ఓటు వెళ్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో నివాసం ఉండటం ఒక వార్డులో ఓటు మరో వార్డు కి బదిలీ కావడంతో మెజారిటీ వార్డుల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో తమ ఓట్ల మార్పిడి తో ఆందోళన చెందుతున్న ప్రజలు తాజా మాజీ కౌన్సిలర్లు, పోటీ చేసే ఆశావహులు, మున్సిపల్ కేంద్రాల వద్దకు పరుగులు పెట్టి తమ ఓట్ల విషయమై చర్చిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని అఫ్జల్ రైస్ మిల్ సమీపంలో ఉన్న 24 వ వార్డులోని దాదాపుగా 250 ఓట్లు ప్రక్కనే ఉన్న 25 వ వార్డులోకి వెళ్లాయి. 25 వ వార్డులోని 100 ఓట్ల వరకు 26 వ వార్డులోని జాబితాలోకి వెళ్లాయి. కాగా ఇక్కడి మరో వార్డులోని దాదాపుగా 1500 ఓట్లు ఇతర వార్డులోకి వెళ్లడంతో వారంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క వార్డుకు సంబంధించినది కాదు…14,15,16,17,19,24,25,26, 27,28,29,30,31,32,33,34,35, మెజార్టీ వార్డుల్లో ఓట్లన్ని తారుమారు అయి ఓట్లన్ని గంపగుత్తగా ఇతర వార్డుల్లోకి వెళ్లాయి.

ఓట్ల మార్పిడితో ఆయా ప్రాంతాల ప్రజలు మున్సిపాలిటీ వద్ద గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా ఒక మాజీ కౌన్సిలర్ కుటుంబానికి చెందిన ఓట్లు నాలుగు దిక్కులలో గల నాలుగు వార్డులలోకి వెళ్లాయి. దీంతో వారంతా కూడా గొల్లు మంటున్నారు. మరికొంత మంది మాజీ కౌన్సిలర్ల లకు పోటీ చేసేందుకు వీలు లేకపోవడంతో సందిగ్దంలో పడ్డారు. ఈ విధంగా వార్డులలో ఓటర్ల విభజన జరగడంతో ప్రజలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ఓటర్ల లిస్టులో తమ పేర్లను వెతుక్కుంటున్నారు. జాబితాలో ఫోటోతో పాటు ఇంటి నెంబర్ లేకపోవడంతో ఇక్కడే గంటలకొద్దీ అన్ని వార్డుల లిస్టులను పరిశీలిస్తూ ఉన్నారు. మరి కొంత మంది మాత్రం ఓట్లు గల్లంతు తో పాటు ఇతర వార్డు లోకి ఓట్లు వెళ్లడంతో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడంతో తప్పులు దొర్లినట్లు విమర్శలు వచ్చిపడుతున్నాయి.

ఇప్పటికే దాదాపుగా ఒక్క సూర్యాపేట మున్సిపాలిటీలో 500 మంది తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ కు దరఖాస్తులు చేసుకున్నారు.ఇదిలావుండగా తమకు అనుకూలమైన ప్రజల ఓట్లు ఇతర వార్డులోకి జంపు కావడంతో తాజా మాజీ కౌన్సిలర్లతో పాటు పోటీచేసే ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. వార్డులలో ఓటర్ల విభజన విషయంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా ఏకపక్షంగా వార్డులలో ఓటర్ల జాబితా ను ఇష్టానుసారంగా చేశారనే విమర్శలు బహిరంగంగా నెలకొన్నాయి. ఈ ఓట్ల విభజనతో వార్డుల స్వరూపం మారిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. ఒక వార్డులో ఇల్లు, మరొక వార్డులో ఓట్లు ఉండటం వలన రానున్న రోజులలో ప్రభుత్వ పథకాలు మంజూరు కావడం, పంపిణీ కావడం లాంటి విషయాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగ కొసమెరుపు ఏమి అంటే ఆఖరికి పొలిటికల్ లీడర్ల సహకారం తీసుకొని ఓటర్ లిస్ట్ తయారు చేయమని జిల్లా కలెక్టర్ సమావేశంలో చెప్పడం అధికారుల పాలనకు నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా కొంత మంది మాత్రం ఫైనల్ నోటిఫికేషన్ లో సరిగా ఓట్లు రాకపోతే కోర్ట్ కు పోయే ఆలోచనాలో వున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వార్డులలో జరిగిన ఓట్ల విభజనలో జరిగిన లోటుపాట్లతో పాటు గల్లంతైన ఓట్లు, ఇతర వార్డులోకి ఓట్లు మారడంపై చర్యలు తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో ఓట్ల విభజన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -