సవరణకు నోచుకోని కనీస వేతనాల జీవోలు 15 ఏండ్లుగా ఇదే దుస్థితి
పనికి తగ్గ జీతం ఇవ్వని యాజమాన్యాలు
‘ధరాఘాతం’తో కార్మికుల విలవిల
‘షాహి’ పరిశ్రమే ప్రత్యక్ష ఉదాహరణ
కమిటీలు..నివేదికలు..వేతనాలు సవరించాలంటూ పదేపదే సూచించినా పాలకులకు తలకెక్కటం లేదు. గత బీఆర్‌ఎస్ పాలకులు, నేటి కాంగ్రెస్ పాలకులూ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి కనీస వేతనాల జీవోలను సవరించకుండా జాప్యం చేస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. యాజమాన్యాలు, పాలకులు ఆడుతున్న ఆటలో కార్మికులే సమిధులవుతున్నారు. యజమానులు లాభాల మీద లాభాలు పోగేసుకుంటూ కరోడ్‌పతులవుతుంటే..చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. వారం రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న హైదరాబాద్ నాచారంలోని షాహి ఎక్స్‌పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలోని మహిళా కార్మికుల ఆవేదనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కనీస వేతనాల జీవోను 15 ఏండ్లుగా (చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2012లో సవరించారు) ప్రభుత్వం సవరించలేదు. ఆ సాకుతో జీతాలు పెంచకుండా యాజమాన్యాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయి. షాహి పరిశ్రమ వద్ద ఆందోళన నేపథ్యంలో…’ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోనే ప్రామాణికంగా తీసుకుని వేతనాలు చెల్లిస్తున్నాం, ఇందులో మా తప్పేం లేదు…’ అంటూ యాజమాన్యాలు చెబుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్మికులు అందుకుంటున్న జీతం ఏ పాటిదో కూడా దీన్నిబట్టి విదితమవుతున్నది. ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. పిల్లల విద్య, వైద్యం, ఇత్యాది అవసరాలు అదే మోతాదులో పెరిగాయి. కానీ జీతాలు మాత్రం యధాతథంగా ఉన్నాయి. దీంతో కార్మికులు తమ కుటుంబాలను సాకటం కష్టంగా మారింది.
అనివార్యంగా ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క షాహి పరిశ్రమలోని కార్మికుల పరిస్థితే కాదు..రాష్ట్రంలోని 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లోని 1.20 కోట్ల మంది దుస్థితి ఇది. వీరికి కనీస వేతన చట్టం- 1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి వేతనాలను పెంచాలి. ఆ మేరకు కనీస వేతన జీవోలను సవరించాలి. కానీ 2006-2012 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సంబంధిత జీవోను సవరించటం గమనార్హం. ఆ తర్వాత సవరణ సంగతినే పాలకులు మర్చిపోయారు. దీంతో గత 15 ఏండ్లుగా యాజమాన్యాలకు రూ.వేల కోట్లు మిగిలే విధంగా ప్రభుత్వాలే దోహదపడ్డాయి. ప్రస్తుత ధరల ప్రకారం రూ.26 వేల కనీస వేతనాన్ని నిర్ణయించకపోవటంతో కార్మికులు విపరీతమైన శ్రమ దోపిడీకి గురవుతున్నారని పలువురు ట్రేడ్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రామిక మహిళలంటే ఇంత చులకనా? : ఎస్వీ రమ, శ్రామిక మహిళా సమన్వయ కమిటి కన్వీనర్
‘ప్రభుత్వానికి శ్రామిక మహిళలంటే ఇంత చులకన ఎందుకు? షాహి కంపెనీలో పని చేస్తున్న వారు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు. చేసిన పనికి తగిన వేతనం అడుగుతున్నారు. వారం రోజులుగా చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. యాజమాన్యం మొండిగా మాట్లాడుతున్నది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వారికి వేతనాలు పెంచాలి. సమ్మె విరమింపజేయాలి…’
తక్షణం జోక్యం చేసుకోవాలి : ఎస్ బాలరాజు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘షాహి పరిశ్రమ కార్మికులు చేపట్టిన ఆందోళన న్యాయమైంది. వారు రూ.11 వేలతో ఎలా బతుకుతారు? ప్రభుత్వం ఆలోచించాలి. తక్షణం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ తక్షణం వారికి జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.. ఆ మేరకు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలి…’
ఎలా బతుకుతారు? ఎస్‌ఎల్ పద్మ టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘చాలీచాలని వేతనాలతో కార్మికులు ఎలా బతుకుతారు? ఎమ్మెల్యేలు, ఎంపీల వేతనం పెరుగుతున్నప్పుడు కార్మికులకు మాత్రం ఎందుకు జీతాలు పెరగకూడదు. ఆ మేరకు జీవోలను ఎందుకు సవరించకూడదు. తక్షణమే వాటిని సవరించి, న్యాయం చేయాలి…’
వేతనాలు పెంచాలి : ఎం శ్రీనివాస్ ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘షాహి కంపెనీ కార్మికులకు వేతనాలు పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వారు జీవించాలంటే..కనీసంగా రూ.26 వేలు పెంచాలి. వారిపై వేధింపులు, పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలి. ఏండ్ల తరబడి పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా యాజమాన్యం వారి శ్రమను దోచుకుంటుంది. ఇప్పుడు కడుపుకాలి వారు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ మేరకు వేతనాలు పెంచాలి…’
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
‘రాష్ట్రంలో కనీస వేతన జీవోలను ఇన్నేండ్ల నుంచి సవరించకపోవటం దారుణం. ఇది యజమానులకు కొమ్ముకాయటమే. ఈ విషయంలో షాహి పరిశ్రమ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ. 11 వేల వేతనంతో వారు ఎట్లా బతుకుతారు? పాలకులకు, యాజమాన్యానికి ఆ మాత్రం సోయిలేదా? ఆ వేతనంతో వాళ్లను బతికి చూపమనండి? కార్మికులంటే అంత అలుసా? వారిది న్యాయమైన డిమాండ్. పెరుగుతున్న ధరల ప్రకారం వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. ఆ మేరకు జీవోలను సవరించాలి…’ -పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



