మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మున్సిపల్ కార్మికులకు నెలకు 26వేలు కనీస వేతనం ఇవ్వాలని , ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమీషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 128 మున్సిపాలిటీలలో సుమారు 65 వేల మంది కార్మికులు శానిటేషన్ మరియు ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు నెలకు 21000/-, ఇతర అలివేన్సులు 05 వేలు మొత్తం కలిపి 26,000/- చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో నెలకు 19వేలు ఇస్తూ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో కేవలం 15,600/- మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికులను సత్కరిస్తూ, శాలువాలు కప్పి పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు తప్ప, జీతాలు పెంచడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు నెలకు 26 వేలకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ డ్రైవర్లకు మేడే కానుక 1000 రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రమాద ఇన్సూరెన్స్ 20 లక్షలు, అంత్యక్రియల ఖర్చు 20వేలు ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ పథకాన్ని ప్రవేటు ఆసుపత్రులకు అనుసంధానం చేయాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న రక్షణ పరికరాలైన గ్లౌజులు, షూస్, టార్చ్ లైట్స్, ఆఫ్రాన్స్, మాస్కులు, సబ్బులు, నూనెలను అవుట్సోర్సింగ్ కార్మికులకు వెంటనే ఇవ్వాలన్నారు. ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి, నేరుగా మున్సిపల్ శాఖ నుండి వేతనాలు ఇవ్వాలన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిచో త్వరలోనే యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే.రాజేశ్వర్, కిరణ్, ఎన్.రవికుమార్, కే.శివకుమార్, నాగరాజు, శంకరయ్య, గంగాధర్, శాంతికుమార్, శ్రీధర్, సైదులు, యాదమ్మ , లక్ష్మి, శైలజ, సుజాత, నీల, నవనాథ్, రాజు, హనుమంతు, నరేష్, నవీన్, వెంకటి లక్ష్మీ, సుశీల మమత, రమేష్, ప్రశాంత్, లక్ష్మి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



