Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఅంతరంగంమానవత్వమా మేలుకో…

మానవత్వమా మేలుకో…

- Advertisement -

‘మాయమై పోతున్నడమ్మా… మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడూ… మానవత్వం ఉన్నవాడు’ అన్నాడు ఓ కవి. నేటి పరిస్థితులకు కవి మాటలు సరిగ్గా సరిపోతాయి. మనిషి సంఘజీవి. నలుగురితో కలిసి మెలసి బతకాలి. ఆ నలుగురి ఆనందాన్ని బాధలను పంచుకోవాలి. అప్పుడే మనం మనుషులమవుతాం. కానీ నేడు పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మనిషిలో మానవత్వం క్షీణించి పోతుంది. దయ, ప్రేమ, జాతి అనేవి మచ్చుకైనా కనబడకుండా పోతున్నాయి. ఓర్పు, సహనం లాంటివి మసకబారిపోతున్నాయి.
ఏదైనా అనుకున్న వెంటనే జరిగిపోవాలనే కోరిక ఎక్కువైపోయింది. కోరుకున్నది ఏం చేసైనా దక్కించుకోవాలనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. అనుకున్నది దక్కనప్పుడు మనసును అదుపు చేసుకోవడం మరిచిపోయారు. ఎదుటి వారిని హింసించి అయినా అది పొందాలనే క్రూరత్వం కనబడుతుంది. అది అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, అన్న, తమ్ముడు, భర్త, స్నేహితులు, బయటివారు ఎవరైనా సరే హింసకు పాల్పడుతున్నారు. భార్యలను చంపుతున్న భర్తలు, భర్తలను చంపుతున్న భార్యలు, కన్నబిడ్డలను చంపుతున్న తల్లులు ఎక్కువైపోతున్నారు. సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని తల్లిదండ్రులపై దాడులు చేస్తున్న పిల్లల్ని సైతం చూస్తున్నాం. ఇలా బంధాలకు అసలు విలువే లేకుండా పోతుంది.

అసలు ఇలాంటి ప్రవర్తన మనుషుల్లో ఎందుకు పెరుగుతుంది. వారిని ఎవరు ప్రేరేపిస్తున్నారు అన్నదే ఇప్పుడు మనం వేసుకోవల్సిన ప్రశ్న. ఈ ప్రపంచీ కరణ యుగంలో ప్రతీది సరుకుగా మారిపోయింది. బంధాలన్నీ డబ్బు కోసమే అన్నట్టు మారిపోయాయి. ఎవరి సుఖం వాళ్లు చూసుకుంటున్నారు. ప్రేమ, అప్యాయత, అనురాగం స్థానంలో ద్వేషం, అసూయ పెరిగిపోయాయి. ఈ మార్కెట్‌ మనుషులను ఇలా తయారు చేస్తుంది. మార్కెట్టే మనుషులను శాసిస్తుంది. నిజం మాట్లాడుకోవాలంటే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మనుషుల ఆలోచనా ధోరణులను మార్చేస్తున్నారు. అక్కడ మానవత్వం, విలువలు, బంధాలు అనే వాటికి విలువే లేకుండా పోతుంది. ఎవరి స్వార్థం వారు చూసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
ఈ విధంగా నేడు సమాజంలో పెరుగుతున్న హింస, అన్యాయాలు, స్వార్థం, కరుణ లేకపోవడం చూస్తే మనిషిలో మానవత్వం క్షీణిస్తోందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఓర్పు, సహనం అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. చిన్న కారణాలకే మనుషులు ఒకరినొకరు చంపుకోవడం, ఇతరుల బాధలను చూసి కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అలా అని సమాజం మొత్తం ఇలాగే ఉందని ఆవేదన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే వారికి కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. కరోనా కాలంలో ఇలాంటి వారిని మనం ఎందరినో చూశాము. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని వారి ముక్కూ మొహం తెలియకపోయినా ఆదుకుంటున్నారు. కానీ కొందరు కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇదే బాధపడాల్సిన విషయం.

అందుకే మనుషుల్లో తగ్గిపోతున్న మానవతా విలువలను మేల్కొలిపేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మానవత్వం లేని మనిషి లేదా సమాజం నిలబడదని గుర్తించాలి. విలువల కంటే మానవ విలువలే ముఖ్యమనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మనం సంఘ జీవులం అనేది ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. క్షణికమైన కోరికల కోసం ఆవేశంతో ప్రియమైన బంధాలను దూరం చేసుకుంటే జీవితంలో మిగిలేది శూన్యమే అని తెలుసుకోవాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad