Tuesday, May 13, 2025
Homeఅంతరంగంయుద్ధం

యుద్ధం

- Advertisement -

నేడు భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధం అనే అంశం సామాన్య ప్రజల్లో భయాందోళలను సృష్టిస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
యుద్ధం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వేల జీవితాలు తలకిందులవుతాయి. వేల సంఖ్యలో అమాయక ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చిన్నారులు అల్లాడుతుంటారు. భర్తను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి మరికొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి ఇంకొందరు.. ఇలా వారి అందమైన జీవితంలో అంధకారం అలుముకుంటుంది. ఇలాంటి అభాగ్యులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హృదయ విదారక సంఘటనలు, సంఘర్షణలు వెలుగు చూస్తాయి.
నేడు భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధం అనే అంశం సామాన్య ప్రజల్లో భయాందోళలను సృష్టిస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మన తెలుగు సైనికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచివేస్తామంటూ పాలకులు ఆడుతున్న ఈ పాచికలాటలో ఇంకా ఎన్ని ప్రాణాలు బలికానున్నాయో! ఎంత మంది తల్లులకు కడుపుకోత మిగలనుందో! ఎంత మంది పిల్లలు అనాథలు కానున్నారో! ఎంత మంది మహిళలు తమ భాగస్వాములను కోల్పోనున్నారో! అందుకే ‘యుద్ధం గెలిచినవాడి కంటే యుద్ధాన్ని ఆపినవాడు గొప్పవాడు’ అంటారు. ఎందుకంటే యుద్ధం వల్ల ఒక వ్యక్తిపై ఆధిపత్యం సాధించవచ్చు. ఒక ప్రాంతం మీద పెత్తనం చెలాయించవచ్చు. ఒక దేశాన్ని శాసించవచ్చు. ప్రతికారం కారం తీర్చుకోవచ్చు. కానీ దీని వెనుక జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని భర్తీ చేయడం కష్టం.
ఇటీవల మన కండ్ల ముందే జరిగిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని చూశాము. అది మిగిల్చిన మరణకాండను అనుభవించాము. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై అఘాయిత్యాలకు చిరునామాగా నిలిచింది. యుద్ధంలో సుమారు మూడు లక్షల మందికి పైగా రష్యన్‌ సైనికులు మరణించారని ఉక్రెయిన్‌ చెప్పింది. సుమారు పదివేల మందికి పైగా పౌరులు మరణించారని అంచనా. వీరిలో ఆరు వందల మందికి పైగా చిన్నారులున్నారు. పది వేలకు పైగా సామాన్యులు గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్‌ దేశం విడిచి శరణార్థులుగా వెళ్లిన వారు డెబ్భై లక్షలకు పైగానే ఉన్నారు. ఈ యుద్ధం కనసాగుతుండగానే ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలై వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మూడు వేలకుపైగానే ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఈ యుద్ధాల వల్ల కుటుంబానికి ఆసరగా ఉన్న వ్యక్తులు చనిపోతే వారికి జీవితాంతం ఇబ్బందులే ఎదురవుతాయి. లక్షలాది మందిని నిరాశ్రయులయ్యారు. అనాథలుగా మారుతున్నారు. ఇప్పటికీ గాజా ప్రజల ఆకలి కేకలు విని ప్రపంచం ఆవేదన చెందుతోంది.
ఏ రెండు దేశాల మధ్యనైనా సున్నితమైన అంశాలే యుద్ధానికి దారితీస్తాయి. అలాంటి అంశాలపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. యుద్ధానికి దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రయత్నించవచ్చు. కానీ మన దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. పాలకులే ప్రజలను రెచ్చగొట్టే వ్యవహారం కనిపిస్తుంది. ఏది ఏమైనా యుద్ధం జరగాల్సిందే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితులను నివారించాలి. యుద్ధాన్ని ఆపడం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు. ఆయా దేశాల ప్రజలకు శాంతిని, స్వేచ్ఛను పంచవచ్చు. అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -