పరిశ్రమ ప్రతినిధులను నిలదీసిన రైతులు
– తహసీల్దార్‌కు అన్నదాతల ఫిర్యాదు
– నీటిని పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ – చౌటకూర్
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రమైన చౌటకూర్ గ్రామ శివారులో గల గణపతి డిస్ట్రిలరీ పరిశ్రమ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ జలాలను చెరువు కుంటల్లోకి వదులుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, రైతులు బుధవారం పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించారు. వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో ఉన్న గణవతి షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి మొలాసిస్‌ను చౌటకూర్ డిస్ట్రిలరీ పరిశ్రమకు తరలిస్తారు. ఇక్కడ లిక్కర్, ఇతర మద్యం తయారీకి ఈ స్పిరిట్‌ను వినియోగిస్తారు. పరిశ్రమలో మొలాసిస్‌ను పెద్దఎత్తున నిల్వ చేశారు. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిని ఆసరగా చేసుకున్న పరిశ్రమ యాజమాన్యం రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వరద ప్రవాహంలో మొలాసిస్ వ్యర్థాలను వదులుతోంది. దీంతో పరిశ్రమ సమీపంలోని కోమటి చెరువు, ఈదుల కుంటల్లోకి ప్రవహించే మంచి నీరంతా కలుషితమవుతున్నది. వర్షాలు కురుస్తుండటంతో రహస్యంగా రాత్రి వేళల్లో వ్యర్థ జలాలను వదులుతుండటంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై రైతులు తహసీల్దార్ అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. కలుషిత వ్యర్థ జలాలను పరిశీలించి నివేదిక అందజేయాలని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) ప్రమోద్‌కు తహసీల్దార్ సూచించడంతో ఆయన బుధవారం పరిశ్రమ వద్ద కలుషిత నీటిని పరిశీలించారు. పరిశ్రమ లోపలి నుంచి వ్యర్థ జలాలు బయటకు వస్తుండటాన్ని పరిశీలించిన ఆర్‌ఐ ప్రమోద్ నివేదిక తయారు చేసి తహసీల్దార్‌కు అందజేశారు.
చెరువు కుంటల్లోకి వ్యర్థ జలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES