Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజలాశయాల ఆక్రమణలతో నీటి సంక్షోభం

జలాశయాల ఆక్రమణలతో నీటి సంక్షోభం

- Advertisement -

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జేఎన్‌టీయూహెచ్‌లో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ

వేగవంతమైన పట్టణీకరణతో జలవనరులపై ఒత్తిడి పెరిగిందని, జలాశయాల ఆక్రమణలు, కాలుష్యం నీటి సంక్షోభానికి దారితీస్తున్నాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో ప్రపంచ నీటి దినోత్సవం-2026 వేడుకలు సోమవారం ‘జలం మరియు లింగ సమానత్వం’ ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగనాథ్‌ మాట్లాడుతూ.. భూమి విలువ పెరగడం కారణంగా ఆక్రమణలు ఎక్కువయ్యాయని, దాదాపు 16 శాతం జలాశయాలు ఆక్రమణకు గురయ్యాయని వివరించారు. ఇలాంటి ధోరణులు జలవనరులకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయన్నారు. బఫర్‌ జోన్లు, సరస్సుల సరిహద్దులు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యవసరమన్నారు. సహజ వనరుల నిర్వహణలో చురుకైన విధానాలు అవలంబించడం కాలానుగుణ అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేయడంలో చూపిన నిబద్ధతను ఆయన అభినందించారు. భూమి చాలా విలువైన వనరు అని, ఇది సాధారణంగా శక్తివంతమైన వ్యక్తుల నియంత్రణలో ఉంటుందని, అందువల్ల భూ నిర్వహణకు తీసుకునే ఏ చర్యకైనా ప్రతిఘటన ఎదురవుతుందని తెలిపారు.
వైస్‌-చాన్సలర్‌ డా. టి.కిషన్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జలం-లింగ సమానత్వం’ అంశం ప్రస్తుత కాలానికి కీలకమని, జల నిర్వహణలో మహిళల పాత్రను పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏఐ ఆధారిత జల పరిపాలనపై చర్చలు నిర్వహించడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఎస్సీ శాస్త్రవేత్త డా. పి.మంజుశ్రీ ‘ఏఐ ఆధారిత భూ పరిశీలన’పై ఉపన్యాసం ఇవ్వగా, అనంతరం నిపుణులతో ప్యానెల్‌ చర్చ జరిగింది. కార్యక్రమాన్ని యూసీఈఎస్టీహెచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -