– రైతులు ఇబ్బంది పడొద్దు
– ఆధునీకతతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ
– ఏరియల్ లైడార్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
– వ్యవసాయ శాఖతో సమన్వయం అవసరం : సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వానాకాలం పంటలకు సమద్ధిగా నీరందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అటు వానాకాలం ఇటు యాసంగి పంటలకు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేసి అద్భుత ఫలితాలు సాధించిందన్నారు. వ్యవసాయశాఖతో నీటిపారుదల శాఖా అధికారులు సమన్వయం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించి యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఖరీఫ్ పంటకు నీటి విడుదలతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ, నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో శనివారం మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యాదాస్‌నాథ్‌్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్సీలు అంజాద్ హుస్సేన్ , శ్రీనివాస్, రమేష్‌బాబు తదితరులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల సీఈలు, ఎస్‌ఈలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడూతూ వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్‌మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలుచేయాలని ఆదేశించారు. సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. నీటి విడుదల విషయమై నీటిపారుదల శాఖా మొత్తం దష్టి కేంద్రీకరించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వర్షాకాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే ఎదురయ్యే పరిణామాల పట్ల ముందస్తు బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాన ఆనకట్టలతో పాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు సన్నద్ధం కావాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలంలో అతిభారీ వర్షాలకు గండ్లు పడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తులు వస్తే తక్షణమే నష్టనివారణ చర్యలకు అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. సుమారు 10 కిలో మీటర్ల దూరం సొరంగమార్గం పనులు పూర్తి చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సొరంగం పనుల్లో అపారమైన అనుభవం కలిగిన మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ హర్బల్‌సింగ్‌ను నీటిపారుదల శాఖకు గౌరవ సలహాదారుగా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆయన సాంకేతిక అనుభవంతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గంతో పాటు ఇతర సొరంగాలను పూర్తి చేసేందుకు దోహదపడతారని ఆయన చెప్పారు.
వానాకాలం పంటలకు నీటివిడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES