మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి
కిన్నెరసాని పరవళ్లు
తాలిపేరు ఏడు గేట్ల ద్వారా దిగువకు నీరు
ఏజెన్సీ వ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ముంపు మండలాలకు నిలిచిపోతున్న రాకపోకలు
నవతెలంగాణ- విలేకరులు
వారం రోజులుగా ఎగువ ప్రాంతం లో భారీ వర్షాలతోపాటు రాష్ట్రంలో ముసురు కమ్మేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు జల కళ సంతరించుకోగా.. వాగులు, చెరువులు అలుగు పోస్తున్నా యి. పొలాల్లో చెరువులను తలపించేలా వరద నీరు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా గోదావరి ఉధృతం గా పారుతోంది. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతుండగా.. తాలిపేరు ఏడు గేట్ల ద్వారా దిగువకు నీరు పారుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో అధికారులు గేట్లు ఎత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ ఉగ్రరూపాన్ని దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. శనివారం అర్ధరాత్రికి 40 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయంకల్లా 43 అడుగులకు చేరుకొని మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిన్నెరసాని పొంగి ప్రవహించడంతోపాటు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ముంపు మండలాలకు వరద ముంపు
కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎట్టపాక మండలాలకు వరద ముంపు ముంచుకొస్తుంది. గోదావరి ప్రమాదకరంగా ప్రవహించడంతోపాటు శబరి కూడా ఎదురుపోటు వేయడంతో కూనవరం మండలంలోని అనేక లోతట్టు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపో యాయి. ముంపు ప్రాంత ప్రజలను కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధికారులు అప్రమత్తం చేశారు. వీఆర్‌పురం మండలంలోని అనేక గ్రామాలు ముంపుకు గురవుతుండగా.. పాపికొండల విహారయాత్రను గత వారమే అధికారులు నిలిపేశారు. పోలవరం కాపర్ డ్యామ్ ప్రభావంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ముంపు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో ముంపు మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695.150 అడుగులకు చేరింది. దాంతో అధికారులు గేట్లను ఎత్తారు.
సింగూర్‌కు వరద ఉధృతి
సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 19.669 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. న్యాల్‌కల్ మండలంలోని చినిగేపల్లి చెరువు అలుగు పారింది. రాయికోడ్‌లో గొర్మిలవాగు పొంగిపొర్లుతోంది. దీంతో గ్రామానికి వెళ్లే వంతెన సగం కొట్టుకుపోయింది. చౌటకూర్ మండలంలోని సరాపల్లి గ్రామ శివారులో మంజీరాపై నిర్మించిన చెక్ డ్యాం నిండి పొర్లుతోంది. జహీరాబాద్ మండలంలోని నారింజ డ్యామ్, జాడి మల్కాపూర్ పరిధిలోని ఎత్తిపోతల పథకాల వద్ద వరద ఉధృతిని అధికారులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటి పరిధిలో రెండు ఇండ్లు, సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలో రెండు ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి.
పోచారం ప్రాజెక్టుపై చిగురిస్తున్న ఆశలు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిమట్టం ఇదివరకు ఐదు అడుగులు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 13 అడుగులకు చేరుకుంది. లింగంపేట్ మండలంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 1625 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.321 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. గాంధారి మండలం పోతంగల్ కుర్దు- నాగ్లూర్ శివారులోని పొలాలకు 30 మంది రైతులు వరి నాట్లు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇండ్లకు వెళ్లేందుకు వారంతా ఆ ప్రాంతంలోని కాటేవాడి వాగును దాటుతుండగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. మూడు గంటల తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో అంతా గుంపుగా వాగు దాటారు. సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో రాజగుండ వాగు దాటుతుండగా 15 మంది విద్యార్థులు అందులో చిక్కుకోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు.
రోడ్లపై గుంతల్లో నాట్లు
రంగారెడ్డి జిల్లా కందుకూరు, శంకర్‌పల్లి రోడ్లపై గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్గింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో రోడ్లపై గ్రామస్తులు నాట్లు వేసి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 1,179 చెరువులు, కుంటల్లో వరద చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి కాలనీలు మడుగులను తలపిస్తున్నాయి.
జూరాల 9 గేట్ల ద్వారా దిగువకు నీరు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరప్రదాయిని జూరాల 9గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఐదు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 75వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 72,445 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.460 మీటర్ల వద్ద నీరు ఉంది. ఏజెన్సీ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వర్షాలకు భూపాలపల్లి కాకతీయ ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిచెర్ల, కాపురం బ్లాక్-1లో బొగ్గు ఉత్పత్తి బంద్ అయింది. మలహర్‌రావు మండలంలో గాలివాన బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీకి భారీగా వరద వస్తోంది. గోదావరి వద్ద నీటిమట్టం 8.300 అడుగులకు చేరుకుంది.
నిండుకుండలా మారిన ట్యాంక్‌బండ్
హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలతోపాటు ట్యాంక్ బండ్‌కు వరద పోటెత్తింది. ప్రస్తుతం హియామత్‌సాగర్ జలాశయానికి 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, శనివారం సాయంత్రానికి 1761.40 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి సైతం వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జలాశయానికి 150 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు కాగా, శనివారం రాత్రికల్లా 1782.80 అడుగులకు చేరింది. ట్యాంక్ బండ్‌లోకి 791 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 792 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులకు జలకళ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES