Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -

జీపీవో, ప్రయివేట్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకం అందులో భాగమే
ధరణి అక్రమాల వల్లే గత ప్రభుత్వం ఓడిపోయింది
భూసర్వేలో నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేండి : సర్వేయర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
3,456 మందికి నియామక పత్రాలు అందజేత


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన 3,456 మంది ప్రయివేట్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుల కాలం నుంచి నేటి వరకు భూమి మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగాయనీ, అదే భూమి సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. ”తెలంగాణలో ప్రతీ పోరాటం భూమి చుట్టూనే జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాటి సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమురం భీం, ఇస్నూర్‌ దొరల ఆక్రమణ నుంచి తన భూమిని విడిపించుకునేందుకు వీరోచిత పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మలే మనకు ఆదర్శం. భూమిని కన్న తల్లిలా మనమంతా భావిస్తాం.

భూ యజమానుల హక్కులను కాపాడి, భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నాం. మీరు తప్పు చేస్తే మీకే కాదు.. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుంది అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతగా పనిచేయండి” అని వారికి సీఎం దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని వ్యాఖ్యానించారు. ”భూ ఆక్రమాలు, అవినీతి వల్ల ఓ ఎంఆర్వోను పెట్రోల్‌ పోసి తగుల బెట్టిన ఘటనలను చోటు చేసుకున్నాయి. ధరణి భూతాన్ని పెంచి పోషించి భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న గత పాలకులను ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. అధికారంలోకి వచ్చాక ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి రాగానే ధరణి నుంచి విముక్తి కల్పించాం” అని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణలో భూ హక్కులు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు.

సీలింగ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చి జాగీర్దార్ల వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాల భూమిని పంచామని సీఎం పేర్కొన్నారు. ”పదేండ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన బీఆర్‌ఎస్‌ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. 15 సంవత్సరాల పాటు గూప్‌-1 నియామకాలను చేపట్టలేదు. తాము అదికారం చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చాం. త్వరలో గూప్‌-3, గూప్‌-4 ఉద్యోగాలను భర్తీ చేస్తాం” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యమని చ్పెప్పారు. ఆ దిశగా ముందుకెళ్లేందుకు నిబద్దతతో పని చేయాలని సీఎం వారికి సూచించారు.

ప్రజల కోసం పనిచేయండి : మంత్రి పొంగులేటి
ప్రయివేట్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజల కోసం పని చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. సాదా బైనామాలు, ఇతర భూ సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 9.80 లక్షల దరఖాస్తులను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. నిబద్దతతో పని చేస్తామని ఈసందర్భంగా సర్వేయర్లతో పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్‌, నాగరాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -