బూటు విసిరిన ఘటనపై తొలిసారి స్పందించిన జస్టిస్ గవాయ్
ఇక అది మర్చిపోయిన అధ్యాయమంటూ వ్యాఖ్యలు
భిన్నంగా స్పందించిన జస్టిస్ భుయాన్
న్యూఢిల్లీ : ఈ వారం ప్రారంభంలో సుప్రీంకోర్టులో తనపై బూటు విసిరిన ఘటనపై మొదటిసారిగా ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ గురువారం స్పందించారు. ఆ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. అయితే ఇప్పుడు అది ‘మరిచిపోయిన అధ్యాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 6వ తేదీన జస్టిస్ గవాయ్, జస్టిస్ చంద్రన్‌తో కలిసి వుండగా, ఓపెన్ కోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.వనశక్తి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో మే 16న ఇచ్చిన తీర్పును సమీక్షించి, సవరణలు చేయాలని కోరుతున్న పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వాన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్ విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ”సోమవారం జరిగిన ఆ ఘటనతో నా సోదరుడు జస్టిస్ చంద్రన్, నేను బిత్తరపోయాం. …మా వరకు అది మర్చిపోయిన అధ్యాయం.” అని సీజేఐ చెప్పారు. కాగా నిందితుడు, న్యాయవాది రాకేష్ కిషోర్ పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జస్టిస్ భుయాన్ భిన్నంగా స్పందించారు. ”దీనిపై నా అభిప్రాయాలు నాకున్నాయి. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి. ఇదేమీ చిన్న విషయం కాదు, జోక్ అంతకంటే కాదు.” అని భుయాన్ అన్నారు. ”నేను తర్వాత క్షమాపణ చెప్పను, ఇది సంస్థకు అవమానం” అని ఆయన పేర్కొన్నారు.
”న్యాయమూర్తులుగా ఇన్నేండ్లలో మేం, ఇతరులకు సమర్థనీయంగా లేనివి, నచ్చనివి చాలా చేస్తుంటాం. కానీ అంతమాత్రాన మేం ఏం చేశామో దానిపై మా అభిప్రాయాలు మార్చుకోం?” అని పేర్కొన్నారు.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. పూర్తిగా క్షమించరాని పని అని వ్యాఖ్యానించారు. అయితే నేరస్తుడిని వదిలివేయడం ద్వారా సీజేఐ ఔదార్యంగా వ్యవహరించారంటూ శ్లాఘించారు. ఆ సంఘటన తర్వాత న్యాయవాది రాకేష్ కిషోర్ (71)ను కాసేపు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆయనపై అభియోగాలేవీ మోపవద్దని సిజెఐ, కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించడంతో ఆ వెంటనే వదిలిపెట్టేశారు. సంఘటన అనంతరం గవాయ్ మీడియాతో మాట్లాడుతూ, తనను గానీ, తన డెస్క్‌ను గానీ ఏదీ తగల్లేదన్నారు. కేవలం శబ్దం మాత్రమే వినబడింది. బహుశా ఆ బూటు ఏదో టేబుల్‌నో లేదా మరోదాన్నో గుద్దుకుని పడిపోయి వుంటుంది. సీజేఐ గవాయ్ మీదకు విసిరేశాను అంటూ ఆ వ్యక్తి మాట్లాడింది మాత్రమే నేను విన్నాను.” అని చెప్పారు. ‘ఇదేమీ పట్టించుకోవద్దు, దీని వల్ల నా దృష్టి పక్కకు మరల్లేదు, మీరు కూడా దృష్టి మరల్చుకోకుండా ఈ విచారణతో ముందుకు సాగాలి’ అని ఆ సమయంలో వాదనలు వినిపిస్తున్న లాయర్‌తో చెప్పినట్లు గవాయ్ చెప్పారు. కోర్టు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదంటూ ఆ తర్వాత కిషోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది.