Monday, July 14, 2025
E-PAPER
Homeకరీంనగర్బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

బీసీల రిజర్వేషన్ల కోసమే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా 
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ది ద్వంద్వ వైఖరి: మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – కరీంనగర్ 
: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని, ఈ దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్‌లో స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకొని కుల సర్వే నిర్వహించిందని తెలిపారు.

కోర్టు ఆదేశాలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో న్యాయమూర్తుల సలహాలు తీసుకొని, ప్రామాణిక సర్వే ఆధారంగా శాసనసభలో తీర్మానం చేశామన్నారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి గవర్నర్‌కు, అక్కడి నుండి రాష్ట్రపతికి పంపినట్లు వివరించారు.

బీజేపీపై మండిపడ్డ మంత్రి..

బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ బీసీ రిజర్వేషన్లపై అసహనం వ్యక్తం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. బీసీల రిజర్వేషన్ల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలను గత 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నామని, ఈ విషయంలో బీజేపీ నిధులు ఆపిందని ఆరోపించారు. బలహీన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న అభిప్రాయాలు ఏమిటని ప్రశ్నించారు.

రిజర్వేషన్లను కాపాడడానికి తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడినట్లుగానే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను కూడా సాధించుకుంటామని  స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే, వారి పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ మాటలు వదిలిపెట్టి, రాష్ట్రపతి దగ్గరకు తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.

బీసీ ముఖ్యమంత్రిపై బీజేపీకి సవాల్

“మండల్ కమిషన్ తీసుకొస్తే కమండల్ కమిషన్ తెచ్చారు” అంటూ బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే బీజేపీ, బీసీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించి కేసీఆర్ తాబేదార్ కిషన్ రెడ్డిని నియమించిందని ఆరోపించారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు కాకుండా వేరే వారికి ఇచ్చారని, అయితే కుల గణన ద్వారానే ఐదు ఎమ్మెల్సీలు బలహీన వర్గాలకు వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీ కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిసి ఢిల్లీకి వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలపై విమర్శలు…

బీఆర్ఎస్ లో ఉన్న బలహీన వర్గాల నేతలు తమ పార్టీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రతిపక్ష పదవికి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అర్హులు కారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు రిజర్వేషన్లు అడ్డుపడితే, తెలంగాణ బలహీన వర్గాలు ఐక్యమై ఈ రిజర్వేషన్లు జారిపోకుండా కాపాడుకునే బాధ్యత బీసీ మేధావులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలదేనని  అన్నారు. తాము ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉన్నామని, తాము పంపిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉందని, దానిని ఆమోదింపజేయాలని కోరారు. శాసనసభ రన్నింగ్‌లో లేనప్పుడు ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ తెచ్చే హక్కు ఉంటుందని, రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుకు, ఆర్డినెన్స్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీయే బీసీలకు చాంపియన్….

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీయే చాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ లు “ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ”లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ నేతలు న్యాయపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బరాబర్‌గా అమలు చేస్తామని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలు పెరుగుతారని ధీమా వ్యక్తం చేశారు.

“బీజేపీలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి . నీకు పదవులు వస్తున్నాయి. బీసీలకు అన్యాయం చేయడానికి నీకు జాతీయ అధ్యక్ష పదవి ఇస్తానన్నా వెళ్లకండి” అంటూ బీజేపీ బీసీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు అయితే అన్ని రాష్ట్రాల్లో అమలవుతాయని పేర్కొన్నారు. తెలంగాణ కుల గణన విప్లవాత్మక నిర్ణయమని స్వయాన వారణాసి ప్రజా ప్రతినిధి, ఆర్ఎస్ఎస్ నేత అన్నారని గుర్తు చేశారు. తమ పార్టీలోని స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ వారు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానిని స్వాగతిస్తున్నారని తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, తాము చేస్తున్న ప్రక్రియ తెలంగాణ సమాజానికి దిక్సూచిగా మారుతుందని చెప్పారు.

బీసీ నేతలకు అభ్యర్థన

దురాలోచన ఉన్న బుద్ధులు మారాలని అమ్మవారిని వేడుకుంటూ, 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు కావాలని ఆకాంక్షించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఆర్ కృష్ణయ్య, లక్ష్మణ్ వంటి బీసీ నేతలను ఉద్దేశించి, “మీరు బీసీ బిడ్డలు. బీసీలకు అన్యాయం చేయకుండా చూడండి. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడకండి. ఫ్యూడలిస్ట్ సిద్ధాంతాలతో అడ్డుపడకండి” అని అభ్యర్థించారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి ప్రధాన మంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రాష్ట్రపతిని ఉద్దేశించి “మేము అభ్యర్థిస్తున్నాం, రాష్ట్రపతి ని మీరు రిజర్వేషన్ క్యాటగిరీ తల్లి. గవర్నర్  పంపిన చట్టాన్ని ఆమోదించండి తల్లి” అని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాలు వద్దని, ఎంపీరికల్ డేటా సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోసం 50 శాతం కోటా ఎత్తేసినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కోటా ఎందుకు ఎత్తేయరని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్నారో గమనించాలని కోరారు.

మహిళా రిజర్వేషన్లపై వ్యాఖ్యలు..

రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని, అది తమ బలహీనత కాదని, అభ్యర్థన అని అన్నారు. మహిళా కోటా గురించి మాట్లాడుతూ.. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. మహిళల పట్ల అలా మాట్లాడడం సరైంది కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు” అని పేర్కొన్నారు. దాడులు చేయడం సరైంది కాదని, మహిళల పట్ల అలా మాట్లాడడం సరైంది కాదన్నారు. తాము దాడులు చేయడం లేదని, తమ బీసీ రిజర్వేషన్లపై విజ్ఞప్తి చేస్తున్నామని, అభ్యర్థిస్తున్నామని తెలిపారు. తమ 42 శాతం రిజర్వేషన్ల కోసం ఎవరూ అడ్డం పడవద్దని విజ్ఞప్తి చేస్తూ, బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -