Friday, December 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమేమే నెంబర్‌1

మేమే నెంబర్‌1

- Advertisement -

66 శాతం పంచాయతీలు మావే
ప్రజల ఆశీర్వాదానికి ధన్యవాదాలు
మా బాధ్యత మరింత పెరిగింది
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం
బీఆర్‌ఎస్‌, బీజేపీ ‘కూటమి’కి 33 శాతం స్థానాలే
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్‌దే తుది నిర్ణయం
ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్లొచ్చు
కేటీఆర్‌కు హరీశ్‌రావు భయం పట్టుకుంది
బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని మార్చాలని హరీశ్‌రావు టీం సోషల్‌ మీడియాలో ప్రచారం : సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 66 శాతం స్థానాల్ని కైవసం చేసుకున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. 94 శాసనసభ నియోజవర్గాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్‌ అత్యధిక ఫలితాలు సాధించిందని వివరించారు. అశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు, కష్టపడి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ధనసరి అనసూయ సీతక్క, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా గ్రామ పంచాయతీల్లో పార్టీలు సాధించిన వివరాలను సీఎం మీడియాకు విడుదల చేశారు.

రాష్ట్రంలోని 12,702 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ 7,527 మంది, కాంగ్రెస్‌ రెబల్స్‌ 808 మంది నెగ్గారనీ, మొత్తంగా తమ పార్టీ 8,335 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించి 66 శాతం సీట్లను గెలుచుకుందని విశ్లేషించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీచేసి 33 శాతం స్థానాలు సాధించాయని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు 1 శాతం ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయనీ, ప్రజలు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారనీ, ఇది ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. అలాగే కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని గుర్తుచేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ 66 శాతం, బీఆర్‌ఎస్‌-బీజేపీ కూటమి 33 శాతానికే పరిమితం అవుతాయని జోస్యం చెప్పారు.

రెండేండ్ల పాలనలో పేదలకు అందించిన సన్నబియ్యం, ఉచిత కరెంటు, సన్న వడ్లకు బోనస్‌, రూ.500కే సిలిండర్‌, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన వంటి అనేక పథకాలకు ప్రజలు మద్దతు ఇచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను అందించామన్నారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించామనీ, హౌదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఈ ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరు, విధానాన్ని మార్చి గ్రామీణ ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదనీ, కడుపులో మూసీలో కాలుష్యం కంటే ఎక్కువ విషం పెట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

కేటీఆర్‌కు హరీశ్‌రావు భయం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఫెయిల్యూర్‌ అయ్యారని హరీశ్‌రావు టీం నాయకత్వ మార్పును డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నదనీ, కేటీఆర్‌కు కాంగ్రెస్‌ కంటే కూడా ఇప్పుడు హరీశ్‌రావు భయమే పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరనీ, ఈ విషయాన్ని గజ్వేల్‌ ప్రజలు గుర్తించి, అక్కడ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపించారని తెలిపారు.

నీటి లెక్కలపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి
కృష్ణా, గోదావరి నదీజలాలపై చర్చ కోసం ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్‌ స్పీకర్‌కు లేఖ రాస్తే, ఆయన కోరుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేండ్ల బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం జరిగిందని అభిప్రాయపడ్డారు. దీన్ని ఆధారాలతో సహా అసెంబ్లీలో నిరూపిస్తామన్నారు.

అసెంబ్లీలో చర్చించాకే..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలపై 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళతామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.

కోర్టుకు వెళ్లొచ్చు
బీఆర్‌ఎస్‌ పరిస్థితి సంతలో పిల్లల్ని అమ్ముకునే వారి కంటే దారుణంగా తయారైందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదరికంతో పిల్లల్ని అమ్ముకుంటున్నారంటే అర్థం ఉందనీ, కానీ కొందరు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్తుంటే, మీరు మా పిల్లలే కాదని వాళ్లే వాదించుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పదే పదే తాము 37 మంది సభ్యులం ఉన్నామనీ, ఆ ప్రకారమే సమయం ఇవ్వాలని అసెంబ్లీలో స్పీకర్‌ను కోరిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ స్పీకర్‌ ఏ పార్టీకి ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో స్పష్టంగా బులెటిన్‌ విడుదల చేస్తారనీ, అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహణ కోసం ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపించబడుతున్న వారి జీతాల్లోంచి ప్రతినెలా రూ.5వేలు కట్‌ చేసుకుంటున్నారనీ చెప్పారు. రాజకీయంగా ఇంత నికృష్ట పరిస్థితి ఎవరికన్నా వస్తుందా? అని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -