Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఏరోస్పేస్‌'లో మనమే గ్లోబల్‌ లీడర్‌

‘ఏరోస్పేస్‌’లో మనమే గ్లోబల్‌ లీడర్‌

- Advertisement -

దానికోసం ప్రత్యేక ‘ఎకోసిస్టం’ ఏర్పాటు
ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

‘ఏరోస్పేస్‌’ రంగంలో తెలంగాణ గ్లోబల్‌ లీడర్‌గా ఎదుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. దానికోసం భవిష్యత్‌ ప్రణాళికలతో ప్రత్యేక ‘ఎకోసిస్టం’ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏరోస్పేస్‌రంగంలో పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), అడ్వాన్స్‌డ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, సర్టిఫికేషన్‌ అండ్‌ కాంప్లియెన్స్‌ విభాగాలను అనుసంధానిస్తేనే గ్లోబల్‌లీడర్‌గా ఎదుగుతామనే స్పష్టత ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు. ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ‘ఏరోస్పేస్‌ రంగంలో వస్తున్న మార్పులు- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, స్థిరీకరణ’ అనే అంశంపై నిర్వహించిన జాతీయసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏరోస్పేస్‌’ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదనీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అది దేశ వ్యూహాత్మక శక్తి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ రంగంలో ఒకప్పుడు యూఎస్‌, రష్యా, ఐరోపా దేశాలే ఆధిపత్యం చెలాయించేవనీ, ఇప్పుడు వాటికి ధీటుగా ‘గ్లోబల్‌ సప్లరు చైన్‌’లో మన దేశం ప్రధాన భూమిక పోషిస్తున్నదని వివరించారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారని తెలిపారు. మెకిన్సే నివేదిక ప్రకారం ల్యాబ్‌ల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా వాణిజ్య ఉత్పత్తికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటైన పలు ఏరోస్పేస్‌ సంస్థలు, నివేదికలను ప్రస్తావించారు. వచ్చే 20 ఏండ్లలో 42వేల కొత్త ఎయిర్‌ క్ట్రాఫ్ట్స్‌ అవసరం ఉంటుందని బోయింగ్‌, ఎయిర్‌బస్‌ సంస్థలు అంచనా వేశాయన్నారు. ఈ డిమాండ్‌ను హైదరాబాద్‌ అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు. డ్రోన్లు, రీయూజబుల్‌ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్‌, 3డీ ప్రింటింగ్‌, అడ్వాన్డ్స్‌ మెటీరియల్స్‌ వంటి పలు ఉత్పత్తులు ఏరోస్పేస్‌ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నదంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏరోస్పేస్‌ రంగంలో విశేష సేవలు అందించిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిటి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే సారస్వత్‌, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌) డాక్టర్‌ ఎన్‌ కలైసెల్వి, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, డాక్టర్‌ సోమనాథ్‌, రాజబాబు, డాక్టర్‌ శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -