తుది దశకు ప్రత్యేక డిస్కం ప్రణాళికలు
బ్యాటరీ ఎనర్జీ సిస్టంకు ప్రాధాన్యత : తెలంగాణ స్టేట్ ఎనర్జీ ఫైనాన్స్ కాన్ఫరెన్స్‌లో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీల కోసం ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక డిస్కం ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ చెప్పారు. పీపుల్స్ మోనిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ (పీఎమ్‌జీఈఆర్), సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అక్కౌంటబిలిటీ (సీఎఫ్‌ఏ), సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), రూరల్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ (ఆర్‌ఆర్‌డీఎస్), ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఎనర్జీ ఫైనాన్స్ కాన్ఫరెన్స్-2025 జరిగింది. దీనిలో ‘తెలంగాణ ఎనర్జీ ల్యాండ్‌స్కేప్-పాలసీ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్’ అంశంపై ముఖ్యఅతిధిగా హాజరైన నవీన్‌మిట్టల్ ప్రారంభ కీలకోపన్యాసం చేశారు. సమీప భవిష్యత్‌లో థర్మల్ విద్యుత్‌ను పూర్తిగా నిలుపుదల చేయలేమన్నారు. బొగ్గు తవ్వకం పరిశ్రమపై సింగరేణి వంటి సంస్థలో 70వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం సాధ్యం కాదనీ, అందువల్ల పునరుత్పాదక ఇంధనాన్ని ప్రత్యామ్నాయంగానే చూడగలమన్నారు. దానిలో భాగంగానే 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 10వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ సిస్టంకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం సోలార్ పవర్‌ను తక్కువ ధరకే వినియోగించుకోవచ్చన్నారు. విండ్, హైడల్ పవర్ రాష్ట్రంలో పరిమితంగానే ఉందనీ, న్యూక్లియర్ పవర్ ప్రత్యామ్నాయంగా ఉన్నా, దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. అంతర్జాతీయంగా తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నదనీ, దానికి సంబంధించిన సాంకేతికతలో అనేక మార్పులు వస్తున్నాయని వివరించారు. పీఎమ్‌జీఈఆర్ సభ్యులు, ప్రభుత్వ విధానాల విశ్లేషకులు డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు, ఉత్పత్తి, వినియోగం, పర్యావరణం, సామాజిక బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధన ప్రణాళికలకు రూపకల్పన జరగాలని చెప్పారు. కార్యక్రమానికి సెస్ డైరెక్టర్ డాక్టర్ రేవతి ఎల్లంకి అధ్యక్షత వహించారు.
అనంతరం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ-2025పై మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజరుమిశ్రా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (దక్షిణ భారతదేశం) మీడియా అడ్వయిజర్ చంద్రశేఖరరెడ్డి, ప్రయాస్ సభ్యులు ఎన్ శ్రీకుమార్ మాట్లాడారు. దీనికి సెస్ ప్రొఫెసర్ డాక్టర్ జీనా టీ శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. ‘కన్వెన్షనల్ ఎనర్జీ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ అండ్ హైడ్రో ఎనర్జీ ల్యాండ్‌స్కేప్ ఇన్ తెలంగాణ’ అంశంపై సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎమ్ వేణుగోపాలరావు మాట్లాడారు. ఇదే అంశంపై పర్యావరణవేత్త సాగర్ ధార, ఐఐటీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ ఏముల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనికి నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఏపీఎమ్) సభ్యులు మీరా సంఘమిత్ర అధ్యక్షత వహించారు. అనంతరం చెత్త నుంచి విద్యుదుత్పత్తి అంశంపై పలువురు నిపుణులు మాట్లాడారు. కార్యక్రమంలో పీఎమ్‌జీఈఆర్ సభ్యులు, విద్యుత్‌రంగ నిపుణులు ఎమ్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.