– కరీబియన్ దీవుల్లో రవి టీమ్
– నెదర్లాండ్స్‌లో సర్వర్లు
– వివరాలు తెలిపిన సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐబొమ్మ పైరసీ, సైట్ నిర్వహణ, పైరసీ పిన్ కింగ్ రవిని హైదరాబాద్ ఎలా రప్పించారు, ఎలా పట్టుకున్నారు అనేదానిపై సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు తెలిపారు. సినిమా పైరసీ ద్వారా రవి ఏ విధంగా డబ్బు సంపాదించాడు అనేదానిపై మంగళవారం పోలీసులు వివరించారు. అతని స్నేహితుడు నిఖిల్ ద్వారా రవిని ట్రాప్ చేశామని అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఐబొమ్మ, బప్పమ్ పోస్టర్లను నిఖిల్ తయారు చేసేవాడని వెల్లడించారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా రవి డబ్బు సంపాదించాడని, రవి భార్యను తాము సంప్రదించలేదని, రవి భార్య ఇచ్చిన సమాచారంతో అతడిని పట్టుకున్నాం అనేది అబద్ధమని శ్రీనివాస్ తెలిపారు. మరికొన్ని పైరసీ వెబ్ సైట్లు నడుస్తూనే ఉన్నాయని, వాటి నిర్వాహకులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రవి టీమ్ అంతా కరీబియన్ దీవుల్లో ఉండగా, సర్వర్లన్నీ నెదర్లాండ్స్‌లో ఉన్నాయన్నారు.
బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బులు యాడ్‌బుల్ కంపెనీకి తరలించాడని, ప్రతి వారం ఓ దేశానికి ప్రయాణించే వాడని, రూ.80 లక్షలు పెట్టి సెయింట్ కిట్స్ పౌరసత్వం కూడా కొన్నాడన్నారు. రవికి కాన్ఫిడెన్స్ ఎక్కువని, ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడని తెలిపారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా రూ.20 కోట్ల వరకు సంపాదించాడని చెప్పారు. మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను కూడా పట్టుకుంటామని శ్రీనివాస్ చెప్పారు. ఆన్‌లైన్‌లో గెట్టింగ్ అప్ అనే యాప్ ఉందని, హోస్టింగ్ సైట్‌కి సంబంధించి సైబర్ ఇన్‌స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టారని, దానికి స్పంచింది రవి ఇది ఎవరిది అని అడిగారన్నారు. అప్పటివరకు తమకు ఐబొమ్మ రవి అని తెలియదని, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మమ్మల్ని అడగడంతో తమకు డౌట్ వచ్చిందన్నారు. రవి భార్య కానీ రవి బంధువులు కానీ ఎవరూ తమకు కాంటాక్ట్‌లో లేరన్నారు. రవి గురించి సమాచారం వేరే రకంగా వచ్చిందని, నెల రోజుల నుంచి అన్ని విధాలా విచారణ చేశామని, ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నిజానికి రవి దొరుకుతాడని తమకు గ్యారెంటీ లేదని, డేటాను అనాలసిస్ చేసుకుంటూ పోతే ఒక వ్యక్తి దొరికాడని తెలిపారు. దాని ద్వారా ముందుకెళ్తే రవి దొరికాడని అడిషనల్ సీపీ తెలిపారు. ఇదిలావుండగా, సైబర్ నేరస్థులకు సహకరిస్తూ, బ్యాంక్ ఖాతాలు అందిస్తున్న 8మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని, రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య, రమేష్, పూనం అనే ముగ్గురు సైబర్ క్రైమ్ నిందితులు పరారీలో ఉన్నారని అడిషనల్ సీపీ తెలిపారు.
ఆ ఒక్క మెయిల్‌తో ‘ఐబొమ్మ’ రవిని పట్టేశాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



