Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమ పథకాల అమల్లో ముందుండాలి

సంక్షేమ పథకాల అమల్లో ముందుండాలి

- Advertisement -

ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందాలి : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష

నవతెలంగాణ-సిటీబ్యూరో
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరిచందన దాసరితో కలిసి గురువారం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. విద్య, వైద్యం, 2బీహెచ్‌కే గృహాలు, మహాలక్ష్మి పథకం, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం, ప్రజా ప్రదేశాలలో ఈవీ చార్జింగ్‌, మౌలిక వసతుల ఏర్పాటు విషయాలపై అమలు తీరును సమీక్షించారు.

పర్యావరణం, కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత, భూగర్భ జలమట్టాలు, ఉద్యానవనం, పశుపోషణ, పశుసంవర్ధక సేవలు, మత్స్య, పాడి అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ 200 యూనిట్ల సరఫరా, ప్రభుత్వ భూముల సంరక్షణ, మీ-సేవా కేంద్రాల ద్వారా సులభమైన పాలన, సేవల అందుబాటు, అగ్నిమాపక శాఖల సర్వీస్‌, బాల కార్మికులు, భిక్షాటన, న్యాయ కేసుల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అర్హులైన వారికి పథకాలను అందించాలని చెప్పారు. అనంతరం అధికారులతో రోడ్‌ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు.

క్రీడాకారులకు సన్మానం
భోపాల్‌లో జరిగిన 14వ జాతీయ డ్రాగన్‌ బోట్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన బోయిన్‌పల్లి ట్రైబల్‌ వెల్ఫేర్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ విద్యార్థులను మంత్రి అభినందించి, సన్మానించారు. విద్యతోపాటు క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

గురుకుల అడ్మిషన్ల పోస్టర్‌ ఆవిష్కరణ
తెలంగాణ మైనారిటీ గురుకులాల(టీజీఎంఆర్‌ఈఐఎస్‌) 2026-27 విద్యాసంవత్సర ప్రవేశాల (5 నుంచి 8వ తరగతి) వాల్‌పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టీజీఎంఆర్‌ఈఐఎస్‌ తెలంగాణ. సీజీజీ.గౌ.ఇన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జితేందర్‌రెడ్డి, డీఆర్వో ఈ. వెంకటాచారి, సీపీవో డాక్టర్‌ సురేందర్‌, జిల్లా సంక్షేమ అధికారులు జి.ఆశన్న, అక్కేశ్వరరావు, ఇలియాస్‌ అహ్మద్‌, ప్రవీణ్‌ కుమార్‌, కోటాజి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.రోహిణి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -