రోహిణి… బాల నటిగా సినీ పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా, టీవీ వ్యాఖ్యాతగా దక్షిణ భారత ప్రజలకు దగ్గరయ్యారు. కేవలం తన కెరీర్‌కే పరిమితం కాకుండా ఓ సామాజిక కార్యకర్తగా, రచయితగా కూడా సామాన్యుల సమస్యలపై తన గొంతు విప్పుతున్నారు. తనకు తెలిసిన కళను సమాజ మార్పుకై ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మానవితో సంభాషించారు…
సినీ పరిశ్రమలో ఉన్న మీరు ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు.. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
నా అనుభవమే నాకు నేర్పింది. నా మాతృభాష తెలుగు. అయితే నన్ను ఓ అభ్యుదయ కళాకారిణిగా, తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా నన్ను చేర్చుకుంది తమిళ పరిశ్రమ. అయితే మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ భాష మాట్లాడుతున్నాం అనేది కాదు. భాషా, ప్రాంతం, రంగు, మతం, జాతి ఏదైనా.. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏం జరుగుతుందో మాట్లాడాలి. అన్యాయానికి గురవుతున్న ప్రతి మనిషి గురించి మాట్లాడాలి. నా చుట్టూ ఉన్న పరిస్థితులే నేనేం చేయాలో నాకు చెప్పాయి.
నేటి అమ్మాయిల జీవితాల్లో మెరుగుదల ఏమైనా కనిపిస్తుందా?
నా చిన్నతనంలో అమ్మాయిల చదువుకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రతి తల్లీ తన కూతురు చదువు గురించి ఆలోచిస్తుంది. కానీ అది సరిపోదని నా అభిప్రాయం. పెండ్లిలో ఆడపిల్లకు వరకట్నం ఇస్తూనే ఉన్నారు. కట్నం ఇవ్వకుండా ఎప్పుడైతే ఆడపిల్లకు పెండ్లి చేయగలుగుతామో అప్పుడే నిజమైన మెరుగుదల అని నా అభిప్రాయం.
సోషల్ మీడియాలో మహిళలపై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. దీని గురించి మీరేమంటారు?
ఇప్పుడు సోషల్ మీడియా ఓ పిట్టగోడలా తయారయింది. స్వేచ్ఛ పేరుతో ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎలాంటి కామెంట్లయినా పెట్టొచ్చు అనుకుంటున్నారు. అయితే నా దృష్టిలో ఇలాంటివి పట్టించుకోకుండా ఉండటం మంచిది. వాటిని మనం మర్చిపోవాలి. పట్టించుకుంటూ కుంగిపోతే మాట్లాడాల్సినవి మాట్లాడలేము.
సాధారణ మహిళలు వాళ్ల గొంతు విప్పగలిగే అవకాశం ఉందంటారా?
అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మన మెదడే మన ఆయుధం. మనం ఉద్యోగం చేస్తూన్నా, ఇంట్లో ఉన్నా మన ఆలోచనా ధోరణి ఎలా ఉంది అనేది ఇక్కడ ముఖ్యం. మన మెదడు మనం ఏం చెబుతున్నాం, అందులోకి ఏం జొప్పిస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. ఈ సమాజానికి అవసరమైన సమాచారం అందిస్తే అదే మనకు మాట్లాడే శక్తిని ఇస్తుంది. దీనికి ఓ ఉదాహరణ చెబుతాను. ఇటీవల మేము క్యూబా సంఘీభావ నిధి అడుగుతూ ఇడ్లీలు అమ్ముకునే ఒక పెద్దామె దగ్గరకు వెళ్లాము. అక్కడి ప్రజలకు తింటానికి సరైన తిండి లేదు కనీసం టమాటాలు కొనుక్కునే శక్తి కూడా లేదు అని వివరంగా చెప్పాము. అది విని ఆమె బాధ పడుతూ ‘అయ్యయ్యో వాళ్లు ఇంత ఇబ్బంది పడుతున్నారా’ అంటూ ఇరవై రూపాయలు ఇచ్చింది. ఇక్కడ ఎంత ఇచ్చింది అనేది కాదు, మనం ఇవ్వాలి, కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చిందే అది గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలి. విస్తృతంగా ఆలోచించే శక్తి పెంచుకోవాలి. అప్పుడు తమ సమస్యలపై కచ్చితంగా గొంతు విప్పగలుగుతారు.
ఒక సెలబ్రెటీగా ఉండి ప్రతి సమస్యపై స్పందిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
స్పందించడం అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం చెప్పాల్సింది చెప్పాలి. అంతే.. ఎందుకంటే మనం ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు వెనక్కి చూసుకుంటూ నడిస్తే వేగం తగ్గిపోతుంది. మనం చేరుకోవల్సిన గమ్యం ఆలస్యమవుతుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మనం చేస్తున్నది సరైనది అనుకుంటే ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం ఒక్కటే మార్గం.
నేటి యువతకు మీరేం చెబుతారు?
మీ గురించి మీరు అర్థం చేసుకోండి. మీకు ఏం కావాలో తెలుసుకోండి. వాళ్లు అదంటున్నారు వీళ్లు ఇదంటున్నారు అంటూ ఎటువైపు గాలి వీస్తే అటువైపు వెళ్లొద్దు. ముందు మీరు ఒకటి నిర్ధిష్టంగా అనుకోవాలి. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అడుగులు ముందుకు వేయాలి. అనుకున్నది సాధించడం కోసం కృషి చేయాలి. అలాగే సమాజం గురించి కూడా పట్టించుకోవాలి. అయితే నేటి పిల్లలకు ఇలాంటివి ఆలోచించే సమయం లేదు. లేదంటే సమాజం గురించి మాకు అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్లు ఈ సమాజ ప్రభావానికి గురవుతూనే ఉంటారు. అది ఏదో ఒక రూపంలో పిల్లలకు, యువతకు అర్థం చేయించాలి. మరీ ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ఇంకొకరి గురించి ఆలోచించేలా వారి మనసును తయారు చేయాలి.
మహిళల సమానత్వం కోసం ఐద్వా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు?
ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాలు ఐద్వా వాళ్లు నిర్వహిస్తున్నారు. మహిళా సమానత్వం కోసం అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. అయితే మనం ఏమనుకుంటున్నామో, ఏం సాధించాలనుకుంటున్నామో రాతల్లో కూడా చూపెట్టాలి. అంటే రాయడం మొదలుపెట్టాలి. ముందు అద్భుతంగా రాయలేకపోవచ్చు. ఒక్కసారి మొదలుపెడితే నేర్చుకుంటూ ఉండొచ్చు. రాయాలంటే ఎక్కువ చదవాలి. చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను చెప్పేది ఒక్కటే చదవడం, రాయడం ఎంత విస్తృతం చేస్తే అంత మంచిది.
గర్ల్‌ఫ్రెండ్‌లో మీ పాత్ర చాలా మందిని ఆలోచించజేసింది.. మీరు ఎలా ఫీలవుతున్నారు?
నిజంగా మహిళలు ఇలాగే ఉన్నారు. అయితే మేము ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం అని మహిళలు తెలుసుకోలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే మేము ఇలాగే ఉండాలి అనుకుంటున్నారు. ఈ ఆలోచనల్లో మార్పు రావాలి. మాట్లాడుతూనే ఉండాలి. ఎవరు ఏమన్నా మాట్లాడుతూనే ఉండాలి. ఒక్కసారి వినకపోవచ్చు అయినా మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా సమాజం మనల్ని గుర్తిస్తుంది.
ఎన్నేండ్లు గడిచినా మహిళా విముక్తి కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం?
నిజంగానే ఎన్నో ఏండ్ల నుంచి ఇవే మాట్లాడుకుంటున్నాం. ఓల్గాగారు 80లలోనే స్వేచ్ఛ, సహజ లాంటి నవలలు రాశారు. అందులోనూ స్త్రీ స్వేచ్ఛ గురించే చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాని గురించి చర్చించుకుంటూనే ఉన్నాం. నిజంగా మహిళ జీవితంలో మార్పు రావాలంటే మారాల్సిన వాళ్లు మారాలి. వాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. మన తర్వాతి తరానికి ఏం చెప్పి పెంచుతున్నాం అనేది చాలా ముఖ్యం. అందులోనూ అబ్బాయిలకు మనం ఏం నేర్పిస్తున్నాం అనే దానిపై స్త్రీ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంటుంది.
ఫొటోలు : పిప్పళ్ల వెంకటేశ్
– సలీమ



