– ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని
నవతెలంగాణ – కామారెడ్డి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించి ఆర్థికంగా చేయూతనందిస్తూ ముందుకెళ్తామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ) చైర్మన్, అధ్యక్షులు ప్రశాంత్ పిన్నమనేని, శ్రీహరి మందాడి అన్నారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు మల్లేష్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కామారెడ్డి లోని సీనియర్ సిటిజన్ ఫోరం భవనంలో మంగళవారం జరిగిన బాలల సంబరాలు ముగింపు సభలో అయనా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ సేవే పరమార్థంగా ఈ సంస్థ సాగుతున్నదని బీద విద్యార్థులకు చేయూతనందిస్తున్నామని సంఘ కార్యక్రమాలను విస్తృత పరుస్తామని అన్నారు.
సంస్థ అధ్యక్షులు శ్రీహరి మందాడి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ మందాడి లు మాట్లాడుతూ నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడానికి కష్టపడి విజయాలను సాధించాలని అన్నారు. ఎన్నారై శ్యాంసుందర్ రెడ్డి సహకారంతో కామారెడ్డి లోని బాలల సంబరాలు కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అనంతరం వివిధ రకాల ఆటలు కోకో, వాలీబాల్, వ్యాసరచన, ఉపన్యాసం, కబడ్డీ తదితర పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బహుమతులను అందించారు. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు క్రీడా పరికరాలను అందించారు.
సభాధ్యక్షులు మల్లేష్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కామారెడ్డి లో నిర్వహించడం హర్షదయకమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పున్న రాజేశ్వర్, రాజన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిట్టు విట్టల్ రావు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటి అంజిరెడ్డి యోగా రామ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలనీ వీరి సేవలు అభినందనీయం అన్నారు.
అమెరికాలో ఉన్న శ్యాంసుందర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వాహన జరిగిందని పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. సభావేదికపై ఉన్న రాజేశ్వర్ నిట్టు విట్టల్ రావు, సిహెచ్ వెంకటి, ఎం రాజన్న అంజిరెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు ఎంబారి లింగం, మంద పీతాంబర్, నాగభూషణం, పుట్ట మల్లికార్జున్, శ్యాం కుమార్, గఫూర్ శిక్షక్ లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి పోలబోయిన సత్యం వ్యాఖ్యానం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.


