Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఓట్ల చోరీపై హైడ్రోజన్‌ బాంబు పేలుస్తాం

ఓట్ల చోరీపై హైడ్రోజన్‌ బాంబు పేలుస్తాం

- Advertisement -

– ప్రధాని దేశానికి ముఖం చూపించలేరు
– రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ యత్నం
– అందుకు మేం అనుమతించం
– ప్రతిపక్షాల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
– రోడ్డుపైనే నేతల ప్రసంగాలు
– ఓట్ల చోరీతో బీహార్‌లో బీజేపీ గెలవాలనుకుంటుంది
– ఓటు అధికార్‌ యాత్ర ముగింపు సభలో వక్తలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

చారిత్రాత్మ పోరాటాల గడ్డ బీహార్‌లో ‘ఓటరు అధికార్‌ యాత్ర’ ప్రతిపక్ష ఐక్యతకు శక్తివంతమైన ప్రదర్శనగా ముగిసింది. ఈ యాత్ర మోడీ ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఎన్నికలను దెబ్బతీస్తున్న ఎన్నికల సంఘానికి పాట్నాలో లక్షలాది మంది ప్రజలు గట్టి హెచ్చరిక చేశారు. బీహార్‌లో బీజేపీ- జేడీయూ ప్రభుత్వ పునాది కదిలిపోయిందనే రాజకీయ సందేశాన్ని కూడా ఓటరు అధికార్‌ యాత్ర ప్రకటించింది. చంపారన్‌ సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఆందోళన, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికైన పాట్నాలోని గాంధీ మైదాన్‌లో యాత్ర ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం అన్ని జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చి గాంధీ మైదాన్‌లో బస చేశారు. సోమవారం ఉదయం కూడా వివిధ కేంద్రాల నుంచి వేలాది మంది ఊరేగింపుగా గాంధీ మైదాన్‌కు తరలివచ్చారు.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి నేతృత్వంలో జమాల్‌ రోడ్డులోని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యాలయం నుంచి జరిగిన ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌, ఆర్‌జేడీ, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌, వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ వంటి పార్టీల కార్యకర్తలు కూడా ప్రదర్శనకు రావడంతో గాంధీ మైదాన్‌ జనసంద్రంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాయకులు రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్‌, తదితరులు గాంధీ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు అర్పించడానికి రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ‘ఓటు చోర్‌ హడ్డీ చోడ్‌!’ (ఓటు దొంగలు.. సింహాసనాన్ని ఖాళీ చేయండి..!) అనే నినాదాలు హౌరెత్తాయి. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం నాయకులు (గాంధీ సే అంబేద్కర్‌) అంబేద్కర్‌ పార్క్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో పాట్నా పురవీధులు దద్దరిల్లాయి. నగరంలోకి ఎక్కువ మంది ప్రవేశించకుండా నిరోధించడానికి పోలీసులు రోడ్లను మూసివేశారు. అంబేద్కర్‌ పార్క్‌కు ‘ఓటు అధికార్‌ యాత్ర’కు పోలీసులు ప్రవేశం నిరాకరించిన తరువాత, దక్బంగ్లా జంక్షన్‌ వద్ద తాత్కాలిక వేదికను నిర్మించి, అక్కడ ముగింపు సభను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఓటు హక్కును ఉల్లంఘించడానికి తాము అనుమతించబోమని ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అయితే అందుకు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఆగస్టు 17న ససారాం నుంచి ప్రారంభమైన ”ఓటు అధికార్‌ యాత్ర” 25 జిల్లాల్లో 110 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 16 రోజుల పాటు 1,300 కిలో మీటర్లు సాగింది. సోమవారం బీహార్‌ రాజధాని పాట్నాలో ”ఓటు అధికార్‌ యాత్ర” ముగింపు సభ జరిగింది. ఈ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్‌, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, టీఎంసీ ఎంపీ, క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, శివసేన నేత సంజరు రౌత్‌, ఎన్‌సీపీ నేత సుప్రియా సులే, తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఓట్ల చోరీకి సంబంధించి తాము ఇప్పటికే అణుబాంబు పేల్చామని, త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబు పేలుస్తామని అన్నారు. దీంతో ప్రధాని మోడీ దేశానికి ముఖం చూపించలేరని, ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అలాగే ఆ బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు మేం అనుమతించం. బీజేపీని అడ్డుకునేందుకే ఈ యాత్ర నిర్వహించాం. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా చూపించాం. ఓట్ల చోరీ అంటే.. హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అన్నట్లే. ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్‌ బాంబు పేలుస్తాం’ అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. ప్రవర్తించిందని, ఎవరు ఏ తప్పు చేసిన ఎప్పుడో ఒక సమయంలో దొరికిపోతారని, ఇప్పుడు ఆ సమయం బీజేపీకి వచ్చిందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీలో వాస్తవాలను ప్రజలు తెలుసుకోబోతున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఓట్ల చోరీతో గెలవడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీకి దొంగతనం చేసే అలవాటు ఉందని, కొన్నిసార్లు ఆయన మీ డబ్బును దొంగిలిస్తారని, కొన్నిసార్లు ఆయన మీ ఓట్లను దొంగిలిస్తారని దుయ్యబట్టారు. ‘ఓటరు హక్కు యాత్ర’ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ యాత్రను ఆపడానికి బీజేపీ తన శాయశక్తులా ప్రయత్నించిందని అన్నారు. కానీ బీహార్‌ ప్రజలు, మహా కూటమి నాయకులు ఆగలేదని అన్నారు. చివరకు ‘ఓటరు హక్కు యాత్ర’ విజయవంతమైందని అన్నారు.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఓట్లను దొంగిలిస్తోందని, ఈ వాస్తవం తెరపైకి వచ్చిందని అన్నారు. ఈ వ్యక్తులు ప్రజాస్వామ్యానికి శత్రువులని తెలిపారు. బీజేపీ ఓట్లను దొంగిలించడంతో రాజ్యాంగంపై దాడి చేస్తోందని విమర్శించారు. మన ఓటు హక్కు కోసం, దానిని కాపాడుకోవడానికి మనమందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా మాట్లాడుతూ ఓటు మన హక్కు, దానిని రాజ్యాంగం నుంచి పొందామని, ఈ రాజ్యాంగ హక్కును మనం కాపాడుకోవాలని అన్నారు. ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుందని, దేశ ప్రజలతో కలిసి, ఓటు దొంగలను అధికారం నుంచి తొలగిస్తామని అన్నారు. మనం పోరాడి గెలుస్తామని పేర్కొన్నారు. సీపీఐఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడుతూ నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను ఎలా విచ్ఛిన్నం చేసిందో ఇప్పుడు దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అదేవిధంగా ‘ఓట్ల దొంగతనం’ తో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అందుకే బీహార్‌లో ‘ఓటరు హక్కుల యాత్ర’ను ప్రారంభించామని, దీనిలో ‘ఓటరు చోర్‌ – గడ్డి చోడ్‌’ అనే నినాదాన్ని ఇచ్చామని అన్నారు.

జేఎంఎం అధ్యక్షుడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను బెదిరిస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ సహాయంతో ఓట్లను దొంగిలిస్తోందని విమర్శించారు. ఈ దొంగతనం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోందని, కానీ ఇప్పుడు వారి దొంగతనం పట్టుబడిందని అన్నారు. ఓటు హక్కును లాక్కోకుండా ఉండటానికి దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ‘ఓటు దొంగలకు’ వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

ఆర్‌జేడీ నేత, బీహార్‌ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ బీహార్‌ దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ గుజరాత్‌లో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి బీహార్‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలా చేయడంతో వారు బీహార్‌ను మోసం చేయాలనుకుంటున్నారని, కానీ ఇది సాధ్యం కాదని పేర్కొన్నారు. బీహార్‌ ప్రజలు ఇలాంటి మోసగాళ్లకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad