‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నదీ, స్నేహమేరా పెన్నిధీ!’ అనే పాట మరపురానిది. ఎందుకంటే అది స్నేహబంధాన్ని గురించిన సృజన కాబట్టి. అన్ని సంబంధాల కన్నా స్నేహసంబంధం చాలా గొప్పదని ఎందుకు చెబుతున్నామంటే, అందులో స్వేచ్ఛ వుంటుంది. ప్రజాస్వామికతత్వం ఉంటుంది. పరస్పర గౌరవ భావన వ్యక్తం అవుతుంది. తన సహచరుడు బాగుండాలనే, ఎదగాలనే అభిలాష స్నేహంలో వుంటుంది. అందుకే స్నేహమంటే అందరికీ ఇష్టంగా వుంటుంది. ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా తెరచి ఒక్క స్నేహితుడి దగ్గరే పెట్టగలడు. అది బలమైనా, బలహీనతైనా, మంచియైనా చెడైనా నిర్భయంగా స్నేహితుడితోనే పంచుకోగలము కదా! అందుకే స్నేహం అనే భావనకు ఎంతో విలువ ఏర్పడింది. స్నేహంలో ప్రేముంటది, బాధ్యతుంటది, ఇచ్చిపుచ్చుకోవడమూ, సహనము, ఓదార్పు, సమభావన, సమైక్యత అన్నీ కలిసి వుంటాయి. అందుకే ‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల…స్నేహమేరా! బతుకుబాటలో నీడనిచ్చే తోడురా!’ అని పాడుకోగలుగుతున్నాము.
ప్రకృతి గమనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి జీవీ సహచరత్వ జీవనాన్నే కొనసాగించింది. ఏ జీవీ ఒంటరిగా లేదు. సహచరత్వమనేది జీవలక్షణంగా కాక, బుద్ధి లక్షణంగా ఎదిగింది. మానవ సమూహమే. కానీ ఆస్తి, ఆధిపత్య భావాలతో కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాక, అన్ని సంబంధాలూ ఆ ఒరవడిలోనే కొనసాగుతున్నాయి. అందుకే మనిషి స్నేహమయ జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఆధునిక సమాజంలో అన్ని సంబంధాలూ ఆర్థిక సంబంధాలుగా ఏర్పడ్డాక స్వేచ్ఛకు, మానవీయాంశానికి తావు లేకుండా పోయింది. కానీ మానవ హృదయం, కోల్పోయిన దాని గురించి వెతుకులాట నిరంతరం చేస్తూనే వుంది. అందుకే స్నేహమయ జీవనకాంక్ష ఎల్లప్పుడూ మనందరిలోనూ వుంటుంది. చరిత్రలోనూ గొప్ప స్నేహాలుగా ప్రసిద్ధికెక్కిన ఉదాహరణలూ మనకున్నాయి. కావ్యాలలోనూ, ఇతిహాసాలలోనూ మధురమైన స్నేహ పుటలను తిరిగేయ గలుగుతాము. మిత్రలాభం గురించిన కథలలో స్నేహ ప్రయోజనాలు, మిత్రభేదం వలన కలిగే కష్టాలను గురించీ మన సాహిత్యంలో చెప్పారు. కుటుంబాలలోని అనుబంధాలూ స్నేహంగా ఉన్నప్పుడే వర్థిల్లుతాయి.
అయితే నేటి సమాజంలో అంత ఉన్నతంగా స్నేహం సాగుతున్నదా! చాలా వరకు లేదనే చెప్పవచ్చు. స్నేహమనే మాటను మనం తేలిక చేసేశాము. కుల, మత ప్రాతిపదికన, ఆర్థిక స్థాయిలను బట్టి, హోదాలను బట్టి ఏర్పడిన స్నేహాలు, నిజమైన స్నేహాలుగా చెప్పుకోలేము. అవి మంచి స్నేహాలుగా నిలువజాలవు కూడా. పరిచయాలు, అవసరాల మేరకు ఏర్పడ్డ మిత్రత్వాన్ని నిజమైన స్నేహంతో పోల్చలేము. రెండు భిన్నమైన, వైరుధ్య పూరితమైన భావాలు గలవారి మధ్య స్నేహం చిగురించడం కష్టమైన పని. భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ విరుద్ధ దృక్పథాలు స్నేహం చేయలేవు. చేసిన దాఖలాలూ లేవు. చరిత్రలో చూసుకుంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల స్నేహం, స్వాతంత్య్రం కోసం చేసిన సమరంలో సాగిన స్నేహం. ఇక మానవాళి విముక్తి కోసం జీవితాలను అర్పించిన మార్క్స్, ఏంగెల్స్‌ల స్నేహం ఇప్పటికీ ఆదర్శవంతమైనది. ‘మానవళి చరిత్రలో స్నేహానికి దర్పణం పట్టే అన్ని ఉదాహరణలను అధిగమించే స్నేహితుల ద్వయం, మేథోజోడి, కార్మికవర్గపు శాస్త్రజ్ఞానాన్ని సృష్టించిందని యురోపియన్ కార్మికవర్గం చెప్పుకుంటుంది’ అని మార్క్స్, ఏంగెల్స్ స్నేహం గురించి లెనిన్ వ్యాఖ్యానిస్తాడు. వారి స్నేహం ఎంత బలమైనదో, వారు దర్శించిన విప్లవ క్రమం అంత నిర్మాణాత్మకమైనదని వీరి స్నేహం రుజువు చేస్తుంది. ప్రపంచమానవాళిని మానవీయంగా తయారు చేయడానికి చేసిన కృషిలో వీరి మైత్రి వెలుగొందింది. అదే విధంగా ఒక దేశంలో విప్లవ సాధనలో ఏర్పడిన మైత్రి ఫిడెల్‌కాస్ట్రో, చేగువేరాలది. ఇలా ఆశయాలదారుల్లో పరిమళించిన స్నేహాలు మనకెంతో స్ఫూర్తినీ, చైతన్యాన్ని కలిగిస్తాయి. చిరస్మరణీయంగా నిలుస్తాయి.
వ్యక్తుల మధ్యనే కాదు, దేశాల మధ్య కూడా శత్రుత్వాలు, వైషమ్యాలు తీసివేసి స్నేహభావంతో కలసిమెలసి ఉండాలన్న లక్ష్యమూ ఈ స్నేహ దినోత్సవాన్ని జరుపుకోవటంలో వుంది. ప్రపంచ ప్రజల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడాలనే భావనా ఈ దినోత్సవాల ఆశయంగా కొనసాగుతున్న సందర్భంలో, మనదేశంలో కులాల మధ్య, తెగల పేరుతోని, మతం పేరుతోని మనుషుల మధ్య విద్వేషాలను సృష్టిస్తూ అమానవీయ కృత్యాలకు ప్పాలడటం నిజంగా ఎంతో బాధాకర విషయం. ఎప్పుడూ ఎదుటివానిలో వైషమ్యాన్ని రగిల్చే ఉన్మాద సమూహాల నుండి స్నేహాన్ని, మానవీయతను ఆశించలేము. మిత్రుడైన వాడు ఎదుటివాని తప్పులను సరిదిద్ది మంచి మార్గాన నడిపించాలి. చెడుమార్గాలు, సమాజానికి ఎంత ముప్పును తెచ్చిపెడతాయో స్నేహ హృదయంతో బోధించాలి. స్నేహం చేయాలి. స్నేహానందాన్ని పొందాలి!