తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఐక్యరాజ్యసమితి
దశాబ్దాల కాలంలో ఇదే అత్యంత తీవ్రమైనదిగా అంచనా
జెనీవా : రానున్న కొన్ని వారాల్లో ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చేయగల ‘ఎల్ నినో’ ముంచుకొస్తోందని ఐక్యరాజ్యసమితి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై, ఈ ఎల్ నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనున్నదని హెచ్చరికలు చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ మార్పులు
ఈ ఏడాది మిగిలిన కాలంలో ఎల్ నినో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తాయని పేర్కొంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రం అడుగుభాగంలో నీటి ఉష్ణోగ్రతలు ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు తూర్పు వైపుగా వేగంగా కదులుతున్నాయి. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని కచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్ నినో కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే మండిపోతున్న ప్రపంచంపై, ఈ ఎల్ నినో ఆజ్యం పోస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. దీని ప్రభావాలు సరిహద్దులు దాటి మరీ వేగంగా వ్యాపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఎల్ నినో ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది?
సాధారణంగా తీవ్రమైన ఎల్ నినో ఏర్పడినప్పుడు, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కార్చిచ్చులు వస్తాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి. ముఖ్యంగా భారత్ విషయానికొస్తే, ఎల్ నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షపాతం తగ్గిపోతుంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కుదేలై పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సప్లై చైన్ దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ ఎల్ నినో దెబ్బకి వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



