Saturday, June 13, 2026
E-PAPER
Homeఖమ్మంక్రమశిక్షణ, పట్టుదల కలిగిన ఆదర్శ నాయకుడు కొమ్ము పెద్ద నరసయ్య 

క్రమశిక్షణ, పట్టుదల కలిగిన ఆదర్శ నాయకుడు కొమ్ము పెద్ద నరసయ్య 

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి రైతులకు నష్టం చేకూరుస్తున్నాయి 
డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి అగమ్య గోచరం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు 
నవతెలంగాణ – బోనకల్ 

కొమ్ము పెద్ద నరసయ్య క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత కలిగిన ఆదర్శవంత నాయకుడని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి రైతులకు నష్టం చేకూరుస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్  మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో సీపీఐ(ఎం) గోవిందపురం ఎల్ మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ భర్త సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొమ్ము పెద్ద నరసయ్య సంస్మరణ సభ ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. తొలుత కొమ్ము పెద్ద నరసయ్య చిత్రపటానికి పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారి సురేష్, ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత, సర్పంచ్ మంద కరుణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సంస్మరణ సభలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కొమ్ము పెద్ద నరసయ్య తన జీవితాంతం సీపీఐ(ఎం) అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం జరిగిన పోరాటాలలో పాల్గొని తన క్రమశిక్షణ పట్టుదలను ప్రదర్శించే వారన్నారు. గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ గా భార్య కొమ్ము కమలమ్మ పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో భార్యకు తోడుగా ఉంటూ గ్రామాభివృద్ధిలో, పేద ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారన్నారు. పార్టీపై అసంచలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కొమ్ము పెద్ద నరసయ్య అన్నారు. కొమ్ము పెద్ద నరసయ్య లాంటి వ్యక్తి ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ప్రజా పోరాటాలలో పాల్గొనాలని కోరారు. గోవిందాపురం ఎల్ గ్రామానికి వీర తెలంగాణ రైతాంగ్ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్ర ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శల వర్షం కురిపించారు. 

అన్నదాతలు ఆరుగాలం ఎన్నో కష్టాలు పడి పండించిన మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నలు తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లారీలను సరఫరా చేయలేని దీనస్థితికి పడిపోయిందన్నారు. బోనకల్ మండలంలో ఆరు సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలు ప్రభుత్వం తరలించకపోతే రైతులే లారీలను తెచ్చుకొని కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తరలించే పరిస్థితి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి రాష్ట్ర ఉపమఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జరిగితే మిగతా నియోజకవర్గాలలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధానాలను అమలు చేస్తుందని ఆ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) నిరంతరం దేశవ్యాప్తంగా పోరాటాల నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో రైతులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, కిలారు సురేష్ మాట్లాడారు. ఈ సభలో లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు, కొమ్ము శ్రీనివాసరావు, వల్లంకొండ సురేష్, కోట కాటయ్య, ఏడునూతల లక్ష్మణరావు, నల్లమోతు వాణి, పసుపులేటి నరేష్,  నల్లమోతు నాగేశ్వరరావు, గుగులోతు నరేష్, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, పెద్ద నరసయ్య కుటుంబ సభ్యులు, సీపీఐ(ఎం) శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -