జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండలను ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బృందంతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి కొండ చివరి ప్రాంతాల వరకు వెళ్లి పరిశీలించారు. ప్రతాపగిరి కొండలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అలాగే పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొండ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రతాపగిరి కొండలను జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రముగా మార్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.