– ఆ తర్వాతే నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పిస్తాం : ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో అధికారుల కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల డిమాండ్లను విన్నామనీ, వాటిని అర్థం చేసుకున్నామని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, అధికారుల కమిటీ చైర్మెన్ నవీన్ మిట్టల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామని ప్రకటించారు. అవసరమైతే నాలుగైదు రోజుల్లో మరోసారి ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాతే ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలూ, వాటి పరిష్కారాలపై నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పిస్తామని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారుల కమిటీతో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉద్యోగ జేఏసీ మొదటి సమావేశంలో ఇచ్చిన 57 డిమాండ్లపై సమగ్రంగా చర్చ జరిగింది. అధికారుల కమిటీ శాఖల వారీగానూ చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్ కోరారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు సుమారు రూ.పది వేల కోట్లు ఉన్నాయనీ, వాటిని విడుదల చేయాలని సూచించారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థికేతర సమస్యలు 47 ఉన్నాయనీ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు ఓపీఎస్‌ను అమలు చేయాలని వివరించారు. ఈహెచ్‌ఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించి ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారుల కమిటీ సభ్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌తోపాటు ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, కోచైర్మెన్ చావ రవి, అడిషనల్ సెక్రెటరీ జనరల్ పి దామోదర్‌రెడ్డి, కోచైర్మెన్లు వి రవీందర్‌రెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, ఎం పర్వత్‌రెడ్డి, నరహరి, మోహన్ నారాయణ, దాస్యా నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్ ఎస్‌ఎం ముజీబ్ హుస్సేనీ, ఎ సత్య నారాయణ, వైస్ చైర్మెన్ బి శ్యామ్, ప్రచార కార్యదర్శి గౌతమ్, కార్యదర్శి సత్యనారాయణగౌడ్, నాయకులు పి కృష్ణమూర్తి, జ్ఞానేశ్వర్, గోల్కొండ సతీశ్, జహంగీర్, కె రామారావు, లక్ష్మణ్‌గౌడ్, శ్రీరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES