Monday, January 26, 2026
E-PAPER
Homeఖమ్మంఅణచివేయాలని చూస్తే మరింత ఎరుపెక్కి పోరాడుతాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

అణచివేయాలని చూస్తే మరింత ఎరుపెక్కి పోరాడుతాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్: మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సీపీఐ(ఎం) నాయకుడు సామినేని రామారావు హత్య నిందితుల‌ను పట్టుకోకుండా, అలాగే ఇటీవ‌ల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను నిరసిస్తూ శనివారం మధిరలో పెద్ద ఎత్తున నిర‌స‌న ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసిస్తోందన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి పార్టీని బలహీనపరచాలని చూస్తున్నాయని, కానీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) పార్టీ గతంలో కంటే మరింత బలోపేతమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నందుకే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే నిరసనలను గౌరవించాలని, లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి హాజరవుతున్న బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ, సీపీఐ(ఎం) శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ నాయకులు పోతునేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, మధిర నియోజకవర్గ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు, మధిర మండల కార్యదర్శి మందా సైదలు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -