కాంగ్రెస్ అభయ హస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు తమ పార్టీ ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమంతో రేవంత్ సర్కార్ భరతం పట్టబోతున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్‌ఎస్సేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి… సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల గురించి ప్రజలు మరిచిపోయారనే భావనలో కాంగ్రెస్ నాయకులున్నారని విమర్శించారు. కానీ ప్రజలకు అన్ని విషయాలూ గుర్తున్నాయని చెప్పారు. ‘కాంగ్రెస్ అభయహస్తం’ అంటూ అధికార పార్టీ నేతలు ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తున్నారనీ, వాస్తవానికి అదే ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం కాబోతోందని ఎద్దేవా చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా, హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగమవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కూడా కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని గుర్తు చేశారు. వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్‌లోని అన్ని సీట్లనూ బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి వంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికతో బీఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.