Monday, January 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రపంచానికి మేడారం జాతరను పరిచయం చేస్తాం

ప్రపంచానికి మేడారం జాతరను పరిచయం చేస్తాం

- Advertisement -

జాతర కోసం రూ.251 కోట్లు వెచ్చిస్తున్నాం
15 కల్లా జాతర పనులు పూర్తి
మేడారాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
18న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం

నవతెలంగాణ – ములుగు
సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు, ఆత్మగౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్‌ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారులను దర్శించుకున్నారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.251 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఇందులో జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు, శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను రూ.101కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు.

ఇప్పటికే జాతర పనులు 85శాతం పూర్తి అయ్యాయని అన్నారు. మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి అవుతాయని తెలిపారు. పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అక్కడే క్యాబినెట్‌ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్టు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

మేడారం మాస్టర్‌ ప్లాన్‌తో దర్శన సామర్థ్యం పెంపు
మేడారం జాతర పనుల పురోగతిపై ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ శాఖ పనులను నిర్దిష్ట గడువులోగా అన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. ప్రాకారం మరియు క్యూలైన్‌ మధ్య సుమారు 12 అడుగుల లోతు వ్యత్యాసం ఉన్న ప్రాంతాలను మట్టితో నింపి ఈ నెల 15లోపు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ ఈఈ మంత్రికి వివరించారు. క్యూ లైన్‌ల కోసం మొత్తం 1,086 రైలింగ్‌ ఫ్యాబ్రికేషన్‌ సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. దేవాలయ పరిసరాల్లో ల్యాండ్‌స్కేపింగ్‌ పనులపై జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ మాట్లాడారు. రెండు సబ్‌ స్టేషన్ల నుంచి మేడారానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, షార్ట్‌ సర్క్యూట్‌లు, విద్యుత్‌ చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. పరిశుభ్రత విషయంలో కుంభమేళాను ఉదాహరణగా తీసుకుని అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలను మేడారంలోనూ అనుసరించాలని మంత్రి ఆదేశించారు.

రవాణా ఏర్పాట్లపై ఆర్‌టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, అలాగే 30 పిరిఫెరల్‌ హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ములుగు జిల్లా డీఎంహెచ్‌వో తెలిపారు. స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.జాతర పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ శాఖ పనులు భక్తుల రద్దీ దృష్ట్యా కొంత ఆలస్యం అయినా నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్‌ హరీశ్‌, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్లు సి హెచ్‌ మహేందర్‌ జి, సంపత్‌ రావు, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్‌, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -