Saturday, February 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమా భూభాగం ఇవ్వం

మా భూభాగం ఇవ్వం

- Advertisement -

ట్రంప్‌నకు అనుమతి నిరాకరించిన యూకే ప్రభుత్వం
ఇరాన్‌పై దాడులకు సైనిక స్థావరాల వినియోగానికి యూఎస్‌ ఒత్తిడి
అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామం

లండన్‌ : ఇరాన్‌పై సాధ్యమైనన్ని వైమానిక దాడులకు దిగేలా బ్రిటన్‌ సైనిక స్థావరాలను వినియోగించుకోవడానికి అమెరికా తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వటం లేవు. యూఎస్‌ ఒత్తిడి చేసినా..యూకే నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా లేకపోవటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌…ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్న తరుణంలో రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించు కున్నదని నిపుణులు చెప్తున్నారు. బీబీసీ కథనం ప్రకారం.. గతంలో అమెరికా మధ్యప్రాచ్యంలో దాడులు నిర్వహించడానికి గ్లోస్టర్‌షైర్‌లోని ఆర్‌ఏఎఫ్‌ ఫెయిర్‌ఫోర్డ్‌, భారత మహాసముద్రంలోని బ్రిటన్‌ విదేశీ ప్రాంతం డీగో గార్సియా స్థావరాలను ఉపయోగించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌పై దాడులకు ఈ స్థావరాలను వినియోగానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇరాన్‌ తన అణుకార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలనీ, లేకపోతే దాడులు చేస్తామని అమెరికా బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు సహా ఇతర సైనిక సామాగ్రిని ఆ ప్రాంతానికి తరలించింది. అయితే స్విట్జర్‌లాం డ్‌లో అమెరికా-ఇరాన్‌ ప్రతినిధుల మధ్య చర్చల్లో కొంత పురోగతి నమోదైనట్టు సమాచారం. కాగా బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌.. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం..యూకే సైనిక స్థావరాలను వినియోగించాలంటే ముందుగా అమెరికా..అధికారిక అనుమతి కోరాల్సి ఉంటుంది. ఏదైనా దాడికి మద్దతు ఇచ్చిన దేశానికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యత వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు ట్రంప్‌ విధానాలు కూడా యూకే ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడానికి కారణాలు అయ్యుండొచ్చని వివరిస్తున్నారు. కాగా.. ట్రంప్‌ యూకేపై ఒత్తిడి తెస్తున్నారని డెమోక్రాటిక్‌ నేత ఎడ్‌ డేవే ఆరోపించారు. యూకే స్థావరాల వినియోగంపై పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -