గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అభిలాష అభినవ్
నవతెలంగాణ – ముధోల్
జిల్లాలో పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు కురిసి, వరదల వల్ల నష్టపోయిన పంటలను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించిన పంట వివరాలను పకడ్బందీగా నమోదు చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం బాసర గోదావరి నది ప్రవాహాన్ని బ్రిడ్జ్ సమీపంలో పరిశీలించారు.ఆనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచి నీటిని వదిలి నందున గోదావరి నది మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందని, చెప్పారు .లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు .ప్రజలు ఎవరు నీటి ప్రవాహం వైపుకు వెళ్లకుండా ఉండాలని సూచించారు .ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానికంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రవాహం వైపునకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసు వారు పటిష్ట పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఆయా ప్రాంతాలలో పికెటింగ్ కేంద్రాలు నిరంతరం నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఆస్తి, పంట నష్టానికి సంబంధించిన వివరాలు ఆయా శాఖల అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు .త్వరలోనే ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపి, నష్టపరిహారం, దెబ్బతిన్న వసతులకు సంబంధించి మరమ్మత్తులు చేపడతామని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఆలయం సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. వరద నీటిని ఖాళీ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరదల వల్ల ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.