Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅండగా నిలుస్తాం

అండగా నిలుస్తాం

- Advertisement -

శాశ్వత ప్రాతిపాదికన పనులు చేపడతాం
పంట నష్టపరిహారం అందజేస్తాం
ఇండ్లు నష్టపోయిన వారికి ప్రత్యేక కోటా
సర్వస్వం కోల్పోయిన వారికీ పరిహారం
కొడంగల్‌తో సమానంగా కామారెడ్డి అభివృద్ధి
విపత్తుల వేళ అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
అధికారులకు ఆదేశాలు.. రైతులకు భరోసా

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల పేదలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వందేండ్లలో రాని వరద వచ్చింది. వరద పరిస్థితులు తలెత్తినప్పుడు సాధారణంగా అంతా సమసిపోయిన తర్వాత నాయకులు వస్తుంటారు.. కానీ వరదలు సంభవించిన వెంటనే మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేశ్‌షెట్కార్‌ను పంపి పరిస్థితిని అంచనా వేయించా. ఏరియల్‌ సర్వే చేసి ప్రాథమిక అంచనాకు వచ్చి తక్షణ సాయం అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశా. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా చూడగలిగాం. వరదలతో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటాం. ఎవరూ అధైర్య పడొద్దు అండగా నిలుస్తాం” అంటూ సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. గత నెల 28, 29 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. మొదట లింగంపేట్‌లో కొట్టుకుపోయిన బ్రిడ్జిని, వరదలతో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న నష్టాన్ని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సీఎంకు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్‌ కాలనీని సందర్శించి వరద ముంపునకు గురైన కుటుంబాలను కలిసి వారితో మాట్లాడారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు జరిగిన నష్టం మరోసారి రాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌కు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం 100శాతం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. వరదలతో స్కూళ్లలో చదువుకునే పిల్లలు వారి పుస్తకాలు కోల్పోయారని.. కలెక్టర్‌ తన ఫండ్స్‌ కింద తక్షణసాయంగా నిధులు కేటాయించాలన్నారు. స్థానికంగా దాతల సాయం కూడా తీసుకోవాలని సూచించారు. కామారెడ్డిలో బీడీ పరిశ్రమ, ఫార్మా కంపెనీలకు ప్రసిద్ధని, అలాంటి వారిని గుర్తించి కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేతో కలిసి ఒక రోజు సమావేశం నిర్వహించి వారి నుంచి సాయం పొందాలని సూచించారు.

కొడంగల్‌ స్థాయిలో కామారెడ్డి అభివృద్ధి..
కామారెడ్డి నియోజకవర్గాన్ని సైతం కొడంగల్‌ స్థాయిలో అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని సీఎం స్పష్టంచేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండేందుకు తాను ముందుంటానని తెలిపారు. 103 సంవత్సరాల క్రితం రూ.23 లక్షలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని ధృడంగా నిలబడిందని అన్నారు. అధికారులతో సమీక్షించిన తర్వాత వరదసాయం ప్రకటిస్తామని భరోసా కల్పించారు. ఇండ్లు కోల్పోయిన వారికి విపత్తు కింద ప్రత్యేక కోటా ఉంటుందని, ఆ మేరకు ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.

అధికారుల సమీక్షలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు
పర్యటన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి నష్ట నివారణా చర్యలు వేగవంతంగా చేపట్టారని అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. విపత్తు సమయంలో పాలనా యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోచారం డ్యామ్‌ మరమ్మతు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌, జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన జరిగిన నష్టాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కాగా, వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల సాయాన్ని సీఎం అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ రాజేష్‌ చంద్ర, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మదన్‌ మోహన్‌ రావు, లక్ష్మికాంతారావు, భూపతిరెడ్డి, కాటిపల్లి రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad