మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-నేలకొండపల్లి
ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని ముజ్జుగూడెం నుంచి గువ్వల గూడెం వరకు రూ.2.60 కోట్ల అంచనాతో నిర్మించనున్న రోడ్డు, పైనంపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణాలకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతును రాజు చేయడం, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రమ క్రమంగా ఒక్కొక్కటి గాడిన పెడుతోందన్నారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. పదేండ్లు రేషన్ కార్డు లేక ప్రభుత్వ ఫలాలు అందక అవస్థలు పడిన పేదలందరికీ రేషన్ కార్డులు అందించామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇటీవల గ్రూప్-2 ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన దగ్గుల నాగ అమృతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ వెన్నపూసల సీతా రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ శాఖమూరి రమేష్ తదితరులు ఉన్నారు.