ఉబర్, ర్యాపిడో, ఓలా తరహాలో యాప్
‘ఆటో డ్రైవర్ సేవలో’ సీఎం చంద్రబాబు
436 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ
అమరావతి : ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ”ఆటో డ్రైవర్ సేవలో” కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒకొక్కరికి రూ.15వేల వంతున 2,90,669మంది ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి 436 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జమచేశారు. అంతకుముందు ఉండవల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, ఐటి మినిస్టర్ నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్‌లు వేర్వేరుగా ఆటోల్లో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
అంతే కాకుండా వేదికపైఉన్న నేతలందరూ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ షర్టును ధరించారు. నిధులను ఖాతాల్లో జమ చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆటో, మాక్సిక్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఉబర్, ర్యాపిడో, ఓలా యాప్‌ల వల్ల ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తెస్తుందని చెప్పారు. యాప్ ద్వారా డ్రైవర్లకు బుకింగ్‌లు రావడంతో పాటు ప్రజలకు కూడా పడిగాపులు పడే అవసరం టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామన్నారు. దీనికోసం అవసరమైతే కంట్రోల్‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.