ఏడాదికి ఎకరానికి రూపాయేనట
అదానీ పవర్‌కు 1,020 ఎకరాలు లీజుకిచ్చిన బీహార్ ప్రభుత్వం
పాట్నా : అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ అదానీ పవర్ భలే ఛాన్స్ కొట్టేసింది. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లా పిర్‌పైంటీలో 1,020 ఎకరాలను కారు చౌకగా లీజుకు తీసుకుంది. లీజు ఎంతో తెలుసా? ఏడాదికి ఎకరానికి రూపాయి మాత్రమే. సొంతగా విద్యుత్ ప్లాంటును నిర్మించి నిర్వహించడా నికి ఈ కంపెనీకి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 25 ఏండ్లకు లీజును కట్టబెట్టింది. ప్లాంటు కోసం తీసు కున్న తమ వ్యవసాయ భూములకు… ముఖ్యంగా మామిడి, లిచీ పండ్ల తోటలకు రాష్ట్ర ప్రభుత్వం సరిగా నష్ట పరిహారం చెల్లించడం లేదంటూ పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తమ భూములకు ఎంతో కొంత పరిహారం వచ్చినా అది కుటుంబాలను పోషించు కోవడానికి ఏ మాత్రం చాలదని ప్రజలు వాపోయారు.
ఇప్పటికే రాష్ట్రంలో వాయు కాలుష్యం జడలు విప్పుతోంది. స్థానిక ప్రజల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా నితీశ్ ప్రభుత్వం ప్రజా రోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్రంలో రెండో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల పదిహేనో తేదీన బీహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పూర్నియాలో నలభై వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భాగల్పూర్ జిల్లా పక్కనే ఉన్న పిర్‌పైంటీలో అదానీ పవర్‌కు చెందిన 2,400 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటు కూడా వీటిలో ఉంది. దీని విలువ పాతిక వేల కోట్ల రూపాయలు. విద్యుత్ రంగంలో బీహార్ స్వావలంబన సాధించడానికి ఇది ఉపయోగ పడుతుం దని మోడీ చెప్పుకొచ్చారు. బీహార్‌లో అతి పెద్ద ప్రయివేటు రంగ పెట్టుబడి యూనిట్ కూడా ఇదే కాబోతోంది. అయితే మోడీ తన ప్రసంగంలో ఎక్కడా అదానీ పవర్ గురించి ప్రస్తావించలేదు.
అయితే మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు…అంటే 13వ తేదీన అదానీ పవర్ కంపెనీ బీహార్ రాష్ట్ర విద్యుదుత్పత్తి కంపెనీ లిమిటెడ్‌తో పాతిక సంవత్సరాల విద్యుత్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంటును దక్కించుకోవడానికి అదానీ గ్రూపుతో పాటు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరంట్ పవర్, బజాజ్ గ్రూపునకు చెందిన లలిత్ పవర్ కూడా పోటీ పడ్డాయి. కానీ అదానీ పవర్‌కే విద్యుత్ ప్లాంట్ దక్కింది. ఒప్పందం ప్రకారం ప్లాంటులో ఉత్పత్తి అయ్యే ప్రతి కేడబ్ల్యూహెచ్ (కిలోవాట్ అవర్)ను రూ.6,075కి విక్రయిస్తారు. కాగా విద్యుత్ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన గ్రామస్తులకు ఒకేలా నష్టపరిహారం లభించలేదు. విద్యుత్ ప్లాంటు కోసం 12 ఏండ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం వీరి నుంచి భూములు తీసుకుంది. అప్పుడు నష్టపరిహారంగా ఎంత మొత్తం చెల్లించారో ఇప్పుడు తీసుకున్న భూములకు కూడా అంతే ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వచ్చినప్పుడు తమ గోడు వెళ్లబోసుకునేందుకు రైతులు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేశారు. పైగా అవన్నీ పండ్ల తోటలే. అవి రైతులకు నిత్యం ఆదాయాన్ని అందిస్తుంటాయి. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు యోచనను ప్రజలు 2014లోనే వ్యతిరేకించినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు.