Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయంఓబీసీల ఫెలోషిప్‌కు నిధులేవి?

ఓబీసీల ఫెలోషిప్‌కు నిధులేవి?

- Advertisement -

అనిశ్చితిలో వేలాది మంది స్కాలర్లు
న్యూఢిల్లీ : జాతీయ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వేలాది మంది ఓబీసీ స్కాలర్లు గత పదిహేను నెలలుగా అనిశ్చిత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యూజీసీ-నెట్‌ లేదా సీఎస్‌ఐఆర్‌-నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) పొందడానికి అవసరమైన కట్‌-ఆఫ్‌ను తృటిలో చేజార్చుకుంటున్నారు. ఓబీసీల కోసం జాతీయ ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని 2014-15లో ప్రారంభించారు. ఫెలోషిప్‌ పొందిన వారు జేఆర్‌ఎఫ్‌ అవార్డీలతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు నెలకు రూ.37,000, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.42,000 లభిస్తాయి. దీనితో పాటు ఇంటి అద్దె అలవెన్స్‌, ద్వైవార్షిక కంటింజెన్సీ గ్రాంట్లు కూడా అందుతాయి. అయితే సెలక్షన్‌ జాబితాను విడుదల చేయాల్సిన నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గత మూడు సంవత్సరాలుగా ఆ పని చేయడం లేదు. కేంద్ర న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాలేదని చెబుతోంది.

గతంలో ఫెలోషిప్‌కు అర్హులైన వారికి ప్రస్తుతం స్టయిఫండ్‌ అందుతోంది. అయితే సగటున రెండు నెలల ఆలస్యం జరుగుతోంది. కాగా ఎస్సీ విద్యార్థులు, వికలాంగులకు మాత్రం ఫెలోషిప్‌ను నిరంతరాయంగా విడుదల చేస్తున్నారు. ఓబీసీలకు ఏటా వెయ్యి జాతీయ ఫెలోషిప్‌లు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. వీటిలో 750 ఫెలోషిప్పులను యూజీసీ-నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి, 250 ఫెలోషిప్పులను సీఎస్‌ఐఆర్‌-నెట్‌లో ఉత్తీర్ణులైన వారికి అందజేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగ విదార్థులకు సకాలంలో ఫెలోషిప్పులు విడుదల చేస్తూ తమను చిన్నచూపు చూడడమేమిటని ఓబీసీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో చాలా మంది అప్పులు చేసి చదువులు కొనసాగించాల్సి వస్తోంది. స్టయిఫండ్‌ లేకుంటే సెమిస్టర్‌ ఫీజులు చెల్లించలేమని, ఫీల్ట్‌ వర్క్‌ చేయలేమని వారు అంటున్నారు. ఫెలోషిప్‌ ఇస్తున్నారన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వమేమో నిధులు విడుదల చేయడం లేదని, ఇలాంటి పరిస్థితులలో మనుగడ ఎలా సాధ్యమని వారు నిలదీస్తున్నారు. మరోవైపు పరిశోధనలకు స్వస్తి చెప్పి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. వీరిలో కొందరికి వివాహాలు సైతం జరిగి కుటుంబాలు ఏర్పడ్దాయి. స్టయిఫండ్‌ లభించకపోవడంతో చదువులు కొనసాగించడం కష్టంగా మారింది. కొందరు విద్యార్థులైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -