వ్యవసాయానికి బాలారిష్టాలు తప్పడం లేదు. నైరుతి రుతుపవనాలు గడువుకుముందే మురిపించి అనం తరం ఉసూరుమనిపించాయి. జూన్ మాసమంతా రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. సుమారు 297 మండ లాలపై దీని ప్రభావం పడింది. ఇరవై జిల్లాల్లో సాధారణ వర్షాలు పడినప్పటికీ సాగుమాత్రం నిష్ప్రయోజనమయ్యేలా ఉంది. దానికి ప్రధాన కారణం కేంద్రంలోని మోడీ సర్కారు రైతులపై కరుణ చూపించకపోవడమే. రాష్ట్ర అవస రాలకు తగినంతగా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచలేదు. వానాకాలం సీజన్ ప్రారంభమై నలభై రోజుల పైనే అవుతున్నా సరిపడా సరఫరా చేయలేదు. దీంతో సాగు పరిస్థితి ‘ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా’ తయా రైంది. రాష్ట్ర సర్కారు రైతు భరోసా సాయాన్ని సకాలంలో రైతుల ఖాతాల్లో జమచేసి ఒకింత ఊరటనిచ్చినా, కేంద్రం మాత్రం ఎరువుల విషయంలో కొర్రీలు పెడుతూ రైతుల ఉసురు పోసుకుం టున్నది.
వర్షాలు పడుతున్న సంతోషంలో రైతులుంటే, కేంద్రం రసాయన ఎరువులను తగినంతమేర సరఫరా చేయ కుండా అలక్ష్యం చేస్తున్నది. కాగా అడిగినమేర ఎరువులిస్తామంటూ లేఖ రాసింది. దాన్ని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముందస్తు సన్నాహాల్లో నిర్లక్ష్యం చూపిన ఫలితమే ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎరువు లివ్వాలంటూ ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఏప్రిల్ నుంచి జూన్ నాటికి తెలంగాణకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 3.7లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చిందని స్వయాన ముఖ్య మంత్రే కేంద్రమంత్రి జేపీ నడ్డాకు చెప్పడం గమనార్హం. వాస్తవానికి జులైకిగాను 63 మెట్రిక్ టన్నుల దేశీ, 97 మెట్రిక్ టన్నుల విదేశీ ఎరువులు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 29 టన్నులే రావడం ఆశ్చర్యంతో పాటు ఆందోళనా కలిగిస్తున్నది.
రైతులు పాసుబుక్కు జిరాక్స్ కాపీ ఇచ్చి సంతకం పెడితేనే వ్యవసాయశాఖ నాలుగు బస్తాలిస్తున్నది. కొన్ని చోట్ల ఎకరానికి రెండు బస్తాలు, మరికొన్ని చోట్ల ఒక్కొక్కటే సరఫరా చేస్తున్నది. యూరియాపై ఉన్న రూ.1350 సబ్సిడీని ఎత్తివేసే ప్రయత్నమే తప్ప వేరేకాదు. నిబంధనల ప్రకారం మాత్రమే ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం ఆదేశాలివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సబ్సిడీ నేపథ్యంలో వీటి వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం చేస్తున్నది. తద్వారా వ్యవసాయ రంగాన్ని నిరుత్సాహ పరుస్తున్నది. పైగా బ్లాక్‌మార్కెట్ పేర ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్‌లు, అగ్రోస్ గోదాములను తనిఖీలు చేయిస్తూ వేధిస్తున్నది.
ఒకవైపు పంటల దిగుబడి పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం లోటు వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్ర రైతాంగం ఆశ లన్నీ జులై, ఆగస్టుపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే పంటలబీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవనేలేదు. అంటే ఈసారికి పథకం లేనట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గత బడ్జెట్‌లో ఈ పథకానికి సర్కారు రూ.1300 కోట్లు కేటాయించింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇంత భారీమొత్తాన్ని పంటల బీమాకు సర్కారు వెచ్చించే పరిస్థితి ఇప్పుడు లేదనే సమాచారం వ్యవసాయశాఖ నుంచే వస్తున్నది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమి ఉండగా, ప్రకృతివైపరీత్యాలతో పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు.ఈ ఏడాది అకాల వర్షాలకు 51 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే.
ఒకవైపు భౌతిక పరిస్థితులతో రైతులు ఎదురీదుతుండగా, మరోవైపు కేంద్రం విధానాలతో అష్టకష్టాలు పడుతున్నారు. కేటాయించిన మేరకైనా ఎరువులను కేంద్రం విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టింపు లేదు. సకాలంలో ఎరువులు చల్లకపోతే దిగుబడి తగ్గే ప్రమాదముంది. వ్యవసాయ ఉత్పత్తులు సైతం దెబ్బతినే అవకాశముంది.
కేంద్ర సర్కారులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడంలో వారికి చిత్తశుద్ధి కరువైంది. ఒత్తిడిచేసైనా రైతుల సమస్యల్ని పరిష్కరించాల్సిన వారు, ముఖం చాటేస్తున్న పరి స్థితి ఉన్నది. అందుకే రాష్ట్ర సర్కార్ లేఖలు రాయడం, ప్రత్యేకంగా కలిసి రావడం బాగానే ఉన్నా అది మాత్రమే సరిపోదు. నిజంగా రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వపరంగా కార్యచరణ ప్రకటించాలి, రైతులతో కలిసి ఉద్యమించాలి.
ఎరువులేవీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES