Tuesday, April 29, 2025
Homeమానవిఇష్టం లేని పెండ్లి చేస్తే..?

ఇష్టం లేని పెండ్లి చేస్తే..?


తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో చేస్తారు. వారికి కావల్సినవన్నీ అడగకుండానే ఇస్తారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వాళ్లకు నచ్చకపోతే వెంటనే మార్చి ఇంకొకటి తెస్తారు. వస్తువుల విషయంలో కొంతమంది పూర్తిగా పిల్లల ఇష్టానికే వదిలేస్తారు. ‘మాకు నచ్చకపోయినా పర్లేదు పిల్లలకు నచ్చితే చాలు’ అనుకుంటారు. అదే తల్లిదండ్రులు పిల్లల ప్రేమ, పెండ్లి విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నా సరే భాగస్వామిని ఎంపిక చేసుకునే వయసు రాలేదనే భావిస్తారు. కొంతమందైతే ‘మేము చూసిన వాళ్లనే పెండ్లి చేసుకోవాలి’ అని మొండిగా పెండ్లి చేసేస్తారు. దీని వల్ల పిల్లలు ఎంత బాధపడతారో అర్థం చేసుకోరు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌…
పల్లవికి 27 ఏండ్లు ఉంటాయి. ఆమె ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేస్తుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. చాలా గారాబంగా పెరిగింది. ఇంట్లో ఏ పని చేయనిచ్చేవారు కాదు. ఇంట్లో ఆమె ఏం చెప్తే అదే జరిగేది. వాళ్ల నాన్న ప్రసాద్‌. ఇంట్లో ఆమెకు ఇష్టం లేని వస్తువు ఏదైనా ఉంటే వెంటనే మార్చేసేవారు. తల్లి లక్ష్మి కూడా అంతే. కూతురంటే అమితమైన ప్రేమ. అయితే పిల్లలకు బాధ్యత, ఇంట్లో పనులు, సర్దుకుపోవడం, డబ్బు పొదుపుగా ఖర్చు చేయడం వంటివి నేర్పించాలి అనేది. కానీ ప్రసాద్‌ అలా కాదు. కూతురు ఏమంటే ఆయనా అదే అంటాడు.
దీని వల్ల భవిష్యత్‌లో కూతురు జీవితం ఎలా ఉంటుందో అనే భయం ఆ తల్లికి వుండేది. అందుకే కొన్ని విషయాలైనా చెప్పాలని ఆమె విన్నా వినకపోయినా చెబుతుండేది. ఇలాంటి పరిస్థితుల్లో పల్లవికి రాఘవతో పెండ్లి జరిగి ఆరు నెలలు అవుతుంది. కానీ ఆమె భర్తతో సంతోషంగా లేదు. రాఘవ కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. వాళ్లది కూడా చిన్న కుటుంబం. ఇంట్లో పనులు చేయడానికి అమ్మాయి ఉంది. అన్నీ అత్తయ్య చూసుకుంటుంది. పల్లవి ఆమెకు సహాయం చేస్తుంది. కానీ రాఘవతో మాత్రం సరిగ్గా ఉండలేకపోతుంది. అతని నుండి విడిపోవాలనే నిర్ణయం తీసుకొని ఐద్వా అదాలత్‌కు వచ్చింది. కారణం అడిగితే ఆమె దగ్గర సమాధానం లేదు.
మేము రాఘవను పిలిచి మాట్లాడితే ‘ఇప్పటి వరకు నేను ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. పెండ్లి జరిగి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆమెను ముట్టుకోలేదు. ‘ఇప్పుడే నాకు ఇష్టం లేదు, కొంత టైం కావాలి’ అంటే సరే అని వదిలేశాను. అసలు ఆమె సమస్య ఏంటో నాకు తెలియదు. నేను నచ్చకపోతే పెండ్లి చేసుకోను అంటే సరిపోయేది. అలా కాకుండా పెండ్లి చేసుకొని ఆరు నెలలకే విడాకులు అంటే నలుగురు నా గురించి, నా కుటుంబం గురించి ఏమనుకుంటారు’ అన్నాడు.
దానికి పల్లవి ‘రాఘవ చాలా మంచి వ్యక్తి. కానీ నేనే పెండ్లికి ముందు వేరే అబ్బాయిని ప్రేమించాను. అతనిది మా కులం కాదు. అందుకే మా నాన్నకు ఇష్టం లేదు. ఈ పెండ్లి నాకు ఇష్టం లేకుండా నేను ఎంత చెప్పినా వినకుండా, చచ్చిపోతామని బెదిరించి చేశారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, రాఘవతో ఉండలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాఘవ మంచితనం చూసిన తర్వాత నా బాధ మరింత ఎక్కువయ్యింది. నన్ను చిన్నపిల్లలా చూసుకుంటున్నారు. మా అత్తయ్య, మామయ్య కూడా నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. కానీ నేనే వాళ్లతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్న రాఘవతో ప్రేమగా ఉండలేకపోతున్నాను. నేను ఆయనకు న్యాయం చేయలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాను. రాఘవను మోసం చేయలేను. అందుకే విడాకులు తీసుకుందామనుకుంటున్నాను.
నేను ఏం అడిగినా కాదనకుండా ఇచ్చే మా నాన్న పెండ్లి విషయంలో ఇలా మొండిగా ప్రవర్తించారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే అప్పటి నుండి మా నాన్నతో కూడా మాట్లాడడం లేదు. ప్రతి క్షణం మానసిక వేదన అనుభవిస్తున్నాను. కానీ ఇందులో రాఘవ తప్పేం లేదు’ అంది.
అప్పుడు రాఘవ ‘ఈ విషయం పెండ్లికి ముందే చెబితే బాగుండేది. ఇప్పుడు నా తప్పేమీ లేకుండా నాకు శిక్ష వేస్తే ఎలా? ఆమెను మొదటి సారి చూసినప్పుడే చాలా ఇష్టపడ్డాను. అందుకే ఆమె ఏం చెప్పినా కాదనకుండా సరే అన్నాను. ఇప్పటికైనా ఆమె సంతోషమే నాకు కావాలి. నాకు విడాకులిచ్చి ఆమె సంతోషంగా ఉంటానంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’ అన్నాడు.
పల్లవితో ‘నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడు’ అని అడిగితే ‘తెలియదు మేడమ్‌. అతనితో మాట్లాడి చాలా నెలలు అయ్యింది. మానాన్న మన పెండ్లికి ఒప్పుకోవడం లేదు అన్నప్పుడే అతను నన్ను వదిలి వెళ్లిపోయాడు’ అంది.
దానికి మేము ‘అతను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. పైగా నీకు వేరే వ్యక్తితో పెండ్లి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అలాంటి వ్యక్తి కోసం నిన్ను ఎంతో ప్రేమిస్తున్న రాఘవ నుండి విడిపోవడం ఎంత వరకు కరెక్ట్‌? నీ భర్త చాలా మంచి వాడు అంటున్నావు. అత్తమామలు కూడా బాగా చూసుకుంటున్నారు అంటున్నావు. అలాంటప్పుడు పాత విషయాలు మర్చిపోయి రాఘవతో సంతోషంగా ఉండటమే నీకు మంచిది. ప్రేమించే వ్యక్తి, అర్థం చేసుకునే మనిషి భర్తగా దొరకడం చాలా గొప్ప విషయం. అనవసరంగా ఏవేవో ఆలోచించి నీ సంతోషాన్ని నువ్వే దూరం చేసుకోకు. మంచి కుటుంబాన్ని వదులుకుంటున్నావు. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకొని మళ్లీ వారం రోజుల తర్వాత వచ్చి నీ అభిప్రాయం చెప్పు’ అని చెప్పి ఆమెను బయటకు పంపించి రాఘవతో…
‘మీకు పల్లవి అంటే చాలా ఇష్టం అంటున్నారు. ఆమెకు కూడా మీరంటే చాలా గౌరవం. కేవలం మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక విడాకులు తీసుకుంటుంది. ఈ విషయం మీకూ అర్థమయ్యింది. పైగా ఆమె ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడో కూడా ఆమెకు తెలియదు. మీరు కాస్త ఓపిక పడితే పల్లవి కచ్చితంగా అతన్ని మర్చిపోతుంది. మీతో ప్రేమగా ఉంటుంది. నిజంగా మీకు ఆమంటే ఇష్టముంటే ఈ విషయంలో మీరు కూడా ఆమెకు కాస్త సహకరించండి’ అన్నాము. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు.

  • వై వరలక్ష్మి, 9948794051
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img