రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందనుకుంటున్నారా?
ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కితే ఊరుకోం..
బీజేపీ మతోన్మాదంపై అలుపెరుగని పోరు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆవిష్కరణలో తాను బీజేపీ స్కూల్లో చదువుకున్నానని, టీడీపీలో కళాశాల పూర్తి చేసుకుని కాంగ్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నానని మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎటు నడిపించాలనుకుంటున్నారో, సమస్యలను ఏం చేయాలనుకుంటున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఇండియా కూటమి కట్టి పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మాటలను ఆదర్శంగా చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇది బాధ్యత అనిపించుకోదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని నమ్ముతున్నారా ? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కలిసి బొగ్గు గనులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నూతనంగా కంపెనీలు పెడితే తాము సహకరిస్తామని, కానీ ప్రభుత్వం పర్యావరణాన్ని దెబ్బతీసే కంపెనీలకు అనుమతులు ఇస్తోందని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను మొత్తం కాళేశ్వరం చుట్టూ తిప్పుతున్నారని, ఆరోపణలు ప్రత్యారోపణలు మానుకొని విచారణ చేసి దోషులను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిందేనని.. ప్రక్షాళన పేరుతో మూసీ భూములతో రియల్ ఎస్టేట్ వారు వ్యాపారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఏడాదిన్నర పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గద్వాల్ వెళుతున్న సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరు మల్లేశం, మాటూరు బాలరాజు, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
సీఎం వైఖరేంటీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES