Sunday, August 3, 2025
E-PAPER
Homeప్రత్యేకం'పోరాట గడ్డ'పై విష సంస్కృతేమిటి?

‘పోరాట గడ్డ’పై విష సంస్కృతేమిటి?

- Advertisement -

మనల్ని మనంగా ఉండనీయని కాలం… నువ్వు.. ఎటు వైపో..? తేల్చుకోకపోతే.. చరిత్రహీనులమవుతాం. ప్రజల మెదళ్ల మీద ప్రగతిశీల భావజాలం కన్నా ఈనాడు ప్రమాదకరమైన సామాజిక మానసిక వాతావరణంలోనే పెరుగుతున్నారు. పాలకులు, కార్పొరేట్లు కవల పిల్లలై కలిసే కొనసాగిస్తున్నారు. సకల రూపాలలో సర్వత్రా వ్యాపించి, విషసంస్కతి విరజిమ్ముతున్నారు. పిల్లలు, యువతీయువకులు, స్త్రీలు మొత్తంగా ప్రజలందరి మీద పతన విలువలను రుద్దుతున్నారు.
ప్రజలకు ప్రశాంతమైన గౌరవప్రదమైన ఉన్నత విలువలతో కూడిన జీవితం అన్నది నేడు ఊహకందని విషయంగా మారింది. అడుగడుగునా ఆవహించి ఉన్న నేరమయ సంస్కతి నాగరిక సమాజాన్ని వెక్కిరిస్తుంది.

పసిపిల్లలపై అత్యాచారాలు, హంతక దాడులు పిల్లల్ని, యువతరాన్ని వ్యసనాల ఊబిలోకి దించుతున్న ప్రసారమాధ్యమాలు, బాధితులనే బాధ్యులుగా చిత్రిస్తున్న ప్రభుత్వ పోలీసు పాలన యంత్రాంగం, చేవ చచ్చిన చర్చలతో కాలం గడుపుతున్న మధ్యతరగతి మేధావి వర్గం, హీనమైన అల్పమైన అభిరుచులను ప్రోత్సహిస్తున్న సినిమా టీవీ మీడియా రంగాలు, ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెట్టి, వ్యాపార వర్గాలకు దోచిపెట్టే విధానాలు నేడు పతనమవుతున్న సంస్కతికి పరాకాష్టగా నిలుస్తున్నాయి.

ఇలా హింస, నేర ప్రవత్తులు పెరగడానికి కారణమేమిటి? కారకులెవరు? యువత మద్యం, గంజాయి, మత్తు మందులకు, క్రికెట్‌ తదితర బెట్టింగులకు బానిసలై పోర్న్‌ వెబ్‌సైట్‌ ఊబిలో కూరుకుపోయి నేరగాళ్ళుగా ఎందుకు తయారవుతున్నారు?
డబ్బుల కోసం హత్యలు, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు, కొన్నిచోట్ల విద్యాసంస్థలే కేంద్రంగా మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. క్రికెట్లో పాకిస్తాన్‌ మీద ఇండియా గెలుపుకు వీరంగాలు వేస్తూ సంబరాలు చేసుకోవటమేమిటి? చౌకబారు ఉత్పత్తులు, యాప్‌లు అన్నీ చైనావేనని వాళ్లను చులకన చేసి సోషల్‌ మీడియాలో మాట్లాడడేమిటి? ఇవన్నీ అర్థం కాని అంశాలు. వీటిని అర్థం చేసుకోవాలి.

బెట్టింగ్‌ యాప్‌లు, అన్‌లైన్‌ గేమ్స్‌:
ఇటీవల సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో పనిచేసేటప్పుడు ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడ్డాడు. దానికోసం రూ. 15 లక్షల దాకా అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిడి పెరగడంతో కొద్దిరోజుల కిందటే ఉరిపోసుకున్నాడు. సత్యసాయి జిల్లాలోని ఒక యువకుడు ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకొని రైలు కిందపడి చనిపోయాడు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో మైనర్‌ బాలుడు బెట్టింగుకు తల్లి బ్యాంకు అకౌంటు లింక్‌ చేసి 36 లక్షల రూపాయలు పోగొట్టాడు. పాలకుర్తిలో ఇంటర్‌ స్టూడెంట్‌ భూమి అమ్మగా వచ్చిన డబ్బులు తండ్రి బ్యాంకులో వేస్తే… ఆ బ్యాంక్‌ అకౌంట్‌కు తన బెట్టింగ్‌ యాప్‌ లింక్‌ చేసి 18 లక్షలు పోగొట్టుకొని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టపడకుండానే దండిగా డబ్బు సంపాదించాలన్న పేరాశ ఆన్‌లైన్‌ బెట్టింగులు వైపు నడిపిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారి పిల్లలే ఎక్కువగా బెట్టింగ్‌ భూతం కోరల్లో చిక్కుతున్నారు. ఓ తాజా సర్వే ప్రకారం తెలంగాణలో ఆన్‌లైన్‌ పందాలు కాస్తున్న వారిలో 45 శాతం మంది 18 నుంచి 25 లోపు వారే. 30 శాతం మంది నెలవారి ఆదాయం రూ.15 వేల కన్నా తక్కువ వున్నావారు. సంపాదించాలన్న కోరికతో బెట్టింగులకు బానిసలై కుటుంబాలను చిద్రం చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది.
దేశీయంగా చాలా రాష్ట్రాలు ఆన్‌లైన్‌ జూద క్రీడలను నిషేధించాయి. అయినా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టెలిగ్రామ్‌ లింకులు సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా చాలామంది బెట్టింగ్‌ వేదికల వలలో పడుతున్నారు. ఆన్‌లైన్‌ జూదంలో సర్వం కోల్పోయి తెలంగాణలో గడిచిన నెల రోజుల్లోనే ఆరుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరొకరు రుణదాత చేతిలో హత్యకు గురయ్యారు. వీళ్లు దాదాపు కోట్ల రూపాయల్లో నష్టపోయారంటే ఆన్లైన్‌ బెట్టింగ్‌ దందాలు సామాన్యులను ఎంతగా దోచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పలు అధ్యయనాల ప్రకారం ఇండియాలో అనైతిక జూదం విలువ 50 లక్షల కోట్లు. అది ఏటా 30% చొప్పున విస్తరిస్తుంది. దేశీయంగా నిత్యం 14 కోట్ల మంది ఆన్‌లైన్‌లో బెట్టింగులు కాస్తున్నారు. ఐపీఎల్‌ ఇతర ప్రధాన క్రికెట్‌ మ్యాచ్‌ సమయంలో పందెం రాయుళ్ల సంఖ్య 37 కోట్లకు చేరుకున్నది. దక్షిణ భారతంలోనే 19.5% మంది కాలేజీ విద్యార్థులు ఆన్‌లైన్‌ జూదం ఆడుతున్నట్లు అంచనా. సమాజం ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుందో కళ్ళకు కడుతున్నాయి. కన్నవారిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవలసిన పండుటాకుల్ని బలి తీసుకుంటున్న బెట్టింగ్‌ రక్కసి హేయ నేరాలకు పురిగొల్పుతున్నది. పైగా ఈ పందెం డబ్బుల కోసం కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు. మరి కొందరు అయినవారి పై దాడులకు తెగబడుతున్నారు. మరికొంతమంది కిరాయి హంతకులుగా మారారు.

ఈ డబ్బంతా సంఘ వ్యతిరేక శక్తులకు చేరుతుంది. ఎప్పటికప్పుడు వారిని గుర్తించి కొరడా ఝూలిపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కాసులకు కక్కుర్తి పడి బెట్టింగ్‌ యాపులకు ప్రచారం కల్పిస్తున్న సినిమా యాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ బెట్టింగ్‌ యాప్‌లు డబ్బంతా కాజేసి యువతను పాతాళానికి నెట్టేస్తున్నాయి. ఈ విషయాన్ని యువతకు గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? చెమటోడ్చకుండా, శ్రమ పడకుండా, ఏదీ రాదని శ్రమైక జీవన తత్వం గురించి ఎవరు చెప్పాలి? మంచిని పెంచే ఆలోచనలు ఎక్కడ నుంచి రావాలి. ఎవరు నేర్పాలి? మన సినిమా నటులకు, ప్రభుత్వానికి ఎవ్వరూ ఎలా చెప్పాలి? వందలాది కుటుంబాలు వీటి వలలో చిక్కి విల విల లాడుతున్నా.. అనేక మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు.

ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాలు ప్రభావాలు :
సినిమాలు పసి పిల్లలకు ఉగ్గుపాలతో హింస ప్రవత్తి నేర్పుతున్నారు. డార్క్‌ కామెడీ, బ్లాక్‌ కామెడీ, ఫన్‌ మంత్‌, ఫన్‌ బకెట్‌, జబర్దస్త్‌ వంటి చౌకబారు కార్యక్రమాలతో చెలరేగిపోతున్నారు. పక్క వాడిని విపరీతంగా హింసించడం చివరికి తోటి వారిని కాల్చి చంపేయడం ఆటగా నేర్చుకుంటున్న పిల్లల్లో నేర మనస్తత్వం అనుకోకుండా పెరిగిపోతుంది. గంటల తరబడి పిల్లలకి ఫోన్లకు అతుక్కుపోయే వాతావరణం సష్టించి, సామాజిక మాధ్యమాల్లో అశ్లీల హింసాత్మక దశ్యాలను ఇబ్బడిముబ్బడిగా ప్రసారం చేస్తుండడంతో పిల్లలు వీటికి తీవ్రంగా ప్రభావితులవుతున్నారు. బాలల్లో మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. వారి మనస్తత్వమే మారిపోతుంది.

ఒక్కొక్క యూ ట్యూబ్‌ ఛానల్‌లో వేలాది అశ్లీల వీడియోలు, వాటికి లక్షలాదిమంది సబ్‌ స్క్రైబర్లు తయారవుతున్నారంటే చౌకబారు ద్వంద్వార్ధాలు, సంస్కార రహితమైన హీన, పతన విలువలను ఎలా పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి నియంత్రణా ఉండదా? ఇలా యదేచ్ఛగా వదిలి వేస్తుంటే ఆన్‌ లైన్‌ కంటెంట్‌ నియంత్రించే హక్కు రాష్ట్రాలకు లేదా? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కంబైన్డ్‌ లివింగ్‌ రూమ్స్‌ కల్చర్‌ ఇటీవల పెరుగుతుంది. పైగా మన రాష్ట్రంలో సగటున ఒక వ్యక్తి రోజుకు ఆహారానికి 80 రూపాయలు ఖర్చు చేస్తే.. తాగుడికి 158 రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వమే లెక్కలు చెబుతుంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజు అధికారికంగా 85 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. సుమారు 50 లక్షల మంది ప్రజలు ప్రతిరోజు మద్యంలో మునిగి తేలుతున్నారు. వీళ్లంతా 30 సంవత్సరాలలోపు వారిలో 60% మద్యం తాగే అలవాటు విపరీతంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.

సంపద అధికారం కేంద్రీకతమయ్యేకొద్దీ మానవ సంబంధాల్లో హింస ప్రజ్వరిల్లుతున్నది. అమానవీయత పెచ్చరిల్లి జీవితం దుర్భరంగా మారుతున్నది.
మనుషుల్లో పరస్పర విశ్వాసాలు కరువవుతున్నాయి. సమాజం మీద భరోసా అడుగంటి పోతున్నది. మనుషులు తమకు తాము దూరమవుతున్నారు. మధ్య యుగాలనాటి సామాజిక హింస కొత్త రూపాల్లో కళ్ళ ముందుకు వస్తున్నది. ఊహించడానికి సాధ్యం గాని పద్ధతుల్లో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కోట్లాదిమంది రోజుకు 100 రూపాయల ఆదాయం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వీటి వెనక ఉన్న హింస దోపిడీ, చర్చనీయాంశమే కావడం లేదు. ఇలా సాంస్కతికంగా జాతి హననం చేస్తున్న పాపం ఈ పాలకవర్గ విధానాల ఫలితమే. దైర్యం, ఆత్మ స్థైర్యం పెంచే పని విద్యావ్యవస్థ మౌలిక లక్ష్యంగా ఉండాలి.
భావి భారత పౌరులు జూదరులుగా వ్యసనపరులుగా, స్వార్థపరులుగా దిగజారిపోతే ఎవరికి నష్టం? పాలకులంతా ఉద్దండ పండితులే కానీ ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా అన్నట్లుగా ఉంది. యువత ప్రశ్నల కొడవళ్ళు విసరకుండా నిస్తేజితులవ్వటమే కదా వారికి కావాల్సింది. అందుకోసమే పథకం ప్రకారమే విద్యార్థి, యువత చుట్టూ విషసంస్కతి విలయతాండవం చేస్తుంది. ఈ విషసంస్కతిని బద్దలు కొట్టి సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించే కళా సజనలు, రచనలు, కళాయాత్రలు రూపకల్పన జరగాలి. అందుకోసం బలమైన సాంస్కతిక ఉద్యమ నిర్మాణం చేయవలసిన కర్తవ్యం ప్రజా రచయితలు, కవులు, కళాకారుల భుజస్కందాలపై ఉంది. ప్రపంచమెప్పడూ బలప్రయోగంతో కాదు, భావాలతో మాత్రమే జయింపబడుతుంది.
– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -