Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా ఏదయా..?

యూరియా ఏదయా..?

- Advertisement -

15 రోజులుగా ఊళ్లకు అందని సరఫరా
కేంద్రం ప్రకటనతో నానో ద్రావణంతో సరిపెట్టుకోవాలంటున్న అధికారులు
పత్తికి సరే.. వరికి పనిచేయటం లేదని రైతుల గగ్గోలు
ఓటీపీ రాకుండా, పాస్‌బుక్‌ లేకుండా కొన్నిచోట్ల పంపిణీ
యూరియా కోసం పెండ్లిండ్లు, ఫంక్షన్లు, పరామర్శలు సైతం వాయిదా..


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతులను యూరియా గోస ఇప్పట్లో వీడేలా లేదు. పక్షం రోజులుగా అనేక గ్రామాలకు సరఫరా లేకపోవడంతో ఊళ్లకు ఊళ్లూ ఇబ్బంది పడుతున్నాయి. కొన్నిచోట్ల పాస్‌బుక్‌ లేకుండా.. ఓటీడీ రాకుండా.. సరఫరా చేస్తుండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మొక్కలు వేళ్లూనుకోవడంతో నానో యూరియా ద్రావణం బాగా పనిచేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం సంప్రదాయ ఘనరూప యూరియానే కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. నానో యూరియా పత్తికి పనిచేస్తున్నా వరికి సత్ఫలితం ఇవ్వటం లేదని గగ్గోలు పెడుతున్నారు. రోజుల తరబడి యూరియా సరఫరా లేకపోవడంతో ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. అత్యవసర పనులున్నా రద్దు చేసుకుంటున్నారు. పెండ్లిండ్లు, ఫంక్షన్లు, బంధుమిత్రులు ఆస్పత్రుల పాలైనా.. మరణాలు సంభవించినా కుటుంబ సభ్యుల పరామర్శలకు కూడా వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్నారు. అదే విధంగా, రాష్ట్రంలో కొన్నిచోట్ల భూమిలేకున్నా యూరియా పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాస్‌బుక్‌, ఆధార్‌ జిరాక్స్‌ లేకుండా సెల్‌ఫోన్‌లకు ఓటీపీ రాకుండా అమ్మకాలు జరుపుతుండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పక్షం రోజులుగా లేని సరఫరా
మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అనేక ఊళ్లకు పక్షం రోజులుగా యూరియా సరఫరా రావటం లేదు. రోజుల తరబడి ఎదురుచూసినా రాకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో కొంతమేర సరఫరా మెరుగ్గా ఉండటంతో బంధుమిత్రులకు ఫోన్లు చేసి తీసుకోమంటున్నారు. కానీ ఆయా గ్రామాల నుంచి వేరేచోటకు తీసుకెళ్తే స్థానికంగా ఉన్న రైతులు ఆటోలపై దాడులు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తే ఏఈవోలు, ఏవోలపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉండటంతో పక్కదారి పట్టకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం అనేకచోట్ల ఓటీపీలు రాకుండానే విక్రయిస్తున్నట్టు సంబంధిత రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఈ పరిస్థితి ఉందంటున్నారు. కొరత బాగా ఉన్న గ్రామాల్లో యారియా కోసం పెండ్లిండ్లు, ఫంక్షన్లు, పరామర్శలను సైతం వాయిదా వేసుకుంటున్నారు.

నానోపై వరి రైతుల సందేహాలు
నానో యూరియా ద్రావణం పత్తి పంటకు బాగానే పనిచేస్తున్నా.. వరి రైతులు మాత్రం సత్ఫలితాలు ఇవ్వటం లేదని అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇలా జరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు పిచికారి పద్ధతులు, సరైన సమయానికి వాడకపోవడం, సరైన మోతాదులో వాడకపోవడం, ఆకులపై సరిగా పడేలా స్ప్రే చేయనప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మొక్కలు నేల నుంచి నత్రజనిని గ్రహించే కంటే నానో యూరియాను పిచికారీ చేసినప్పుడు గ్రహించలేకపోవచ్చనే అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. పత్తి ఆకులు వెడల్పుగా ఉండటంతో ఎక్కువగా గ్రహించవచ్చని, వరి పోచలు వెడల్పు తక్కువ ఉండటంతో పిచికారీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మూడు, నాలుగు సార్లు స్ప్రే చేస్తే సత్ఫలితం రావ చ్చని చెబుతున్నారు. నానో యూరియాపై రెండేండ్ల క్రితం పంజాబ్‌, లూథియానా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి వరి, గోధుమల్లో సాధారణ యూరియాతో పోల్చితే ఇది సత్ఫలితం ఇవ్వటం తక్కువేనని తేల్చింది.

పెరిగిన వరి విస్తీర్ణం
గత ఖరీఫ్‌ సీజన్‌ కన్నా ఈ వానకాలం పంటలు పెరగటంతో యూరియా వినియోగం పెరిగింది. ఈసారి వర్షాలు విస్తారంగా కురవటంతో పది లక్షల ఎకరాలు అదనంగా సాగయ్యాయి. దీనిలో యూరియా ఎక్కువగా వినియోగించే వరి 7 లక్షలు, పత్తి మూడు లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. గత ఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబర్‌ మొదటి వారం నాటికి 7.98 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగిస్తే ఈ ఖరీఫ్‌లో 8.33 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. దీనిలో వరి 62.27 లక్షలు, పత్తి 45.47 లక్షలు, మొక్కజొన్న 6.27 లక్షలు, సోయాబీన్‌ 3.62 లక్షలు, కందులు 4.78 లక్షలు, మిరప 1.90 లక్షలు, పెసలు 65వేలు, మినుములు 28వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కేటాయింపులకు అనుగుణంగా యూరియా కేంద్రం నుంచి సరఫరా కాకపోవడంతో ఈ సీజన్‌ ఆరంభం నుంచి ఒక్కో పాస్‌బుక్‌పై ఒకటి, రెండు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు.

పరామర్శకు సైతం పోలేకపోతున్నాం
మా తోడల్లుడు గుండె ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ 20 రోజులకు పైగా అయింది. పోయి పరామర్శించి వద్దామంటే మా ఊరుకు 15 రోజులుగా యూరియా సరఫరా లేదు. తీరా మేము అటు వెళ్లినప్పుడు వస్తుందేమోనని ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నాం.
వనవాసం రాంరెడ్డి, గుండెపూడి, మహబూబాబాద్‌ జిల్లా

ఓటీపీ రాకుండా పంపిణీ కుదరదు
ఆధార్‌, పాస్‌బుక్‌ జిరాక్స్‌ల ద్వారా నెంబర్లు ఎంట్రీ చేశాక మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేశాకే యూరియా బస్తాలు ఇవ్వాలి. అలా కాకుండా ఇస్తే చర్యలు తప్పవు. భూమి లేకున్నా యూరియా ఇస్తున్నారంటే సంబంధిత ఏఈవో, ఏవోలపై తప్పక చర్యలు తీసుకుంటాం. ఖమ్మం జిల్లా వరకు కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్నాం. నానో యూరియా వరిపై పనిచేయకపోవటం ఉండదు. పత్రాలు ఎక్కువ వెడల్పు ఉండవు కాబట్టి, ఒకటి, రెండు సార్లు పిచికారీ చేస్తే ఫలితం రాకపోవచ్చు.
డి.పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -