గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ట్రాన్స్‌ఫార్మార్ల ఏర్పాటు, మరమ్మతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం చెప్పిన విషయాలు వాస్తవమేనని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మార్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు. దీనికి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తూ, విద్యుత్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, అంబులెన్స్‌తో సకాలంలో క్షేత్రస్థాయిలో సేవలందుతున్నాయని తెలిపారు.
దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని నల్లగొండలో క్షేత్రస్థాయిలో మంత్రి చెబుతున్న దానికి భిన్నమైన పరిస్థితులున్నాయని చెప్పారు. దీనికి భట్టి బదులిస్తూ, ఎక్కడైనా సమస్య ఉంటే 1912కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారని హామీ ఇచ్చారు. మరో ప్రశ్నకు మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తూ, రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు గ్రూపులుగా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిం చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను స్వయంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిశామనీ, లిఖితపూర్వకంగా కోరామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ఏర్పాటు చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
బీసీలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రూ.11,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే అందులో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలోనూ బీసీలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలో బలహీనవర్గాల ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి బీసీల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు బీసీల గురించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
ఈ నెల 18న మేడారం ఆధునీకరణ పనుల ప్రారంభం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రూ. 200 కోట్లతో మేడారం ఆధునీక పనులను ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలి సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, 200 సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలతో నిర్మాణాలుంటాయని చెప్పారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామనీ, ఆధునీకరణ పనుల కోసం 29 ఎకరాల భూమిని సేకరించామనీ, మరో 63 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. మూడు దశల్లో 94 సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రయివేటు బిల్డర్లు వీటిని నిర్మిస్తున్నారని తెలిపారు.
సత్యం చెప్పేది వాస్తవమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



