Saturday, December 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుదొడ్డు బియ్యాన్ని ఏం చేద్దాం!

దొడ్డు బియ్యాన్ని ఏం చేద్దాం!

- Advertisement -

పౌరసరఫరాల శాఖ అధికారుల్లో తర్జనభర్జన
రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా
నిలిచిపోయిన 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
గోదాముల్లో ముక్కిపోయి, పురుగులు పడుతున్న వైనం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ప్రతి పేదకుటుంబానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నది. ఏడు నెలల నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు నిలిచిపోయాయి. వాటిని ఏం చేయాలో తెలియక పౌరస రఫరాల శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగిపోయి, ముక్కిపోయి, పురుగు లు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. ఎక్కువ రోజులు ఇదే విధంగా నిల్వలు ఉంచితే పౌరసరఫరాల శాఖకు సుమారు రూ.450 కోట్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల గోదాముల్లో 90 వేల మెట్రిక్‌ టన్నులు, రేషన్‌ దుకాణాల్లో 25 వేల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరికొంత కాలం వీటిపై దృష్టి పెట్టకపోతే బియ్యం ముక్కిపోయి సముద్రంలో పొరబోసే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఈ నిల్వలకు తోడు సన్న బియ్యాన్ని నిల్వ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. మరోవైపు డీలర్లు తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వల్ని వాపసు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభ సమయంలో దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే దానికి కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నట్టు తెలిసింది.

ఇవీ ప్రత్యామ్నాయాలు
దొడ్డు బియ్యం అమ్మకానికి పలు అవకాశాలున్నాయి. మద్యం తయారీ కోసం స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్ల్రాల్లోని బెవరెేజేస్‌ కంపెనీలకు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పౌల్ట్రీలో మొక్కజొన్నలను దాణాగా ఉపయోగి స్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతు న్నాయన్న కారణం చూపి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కొని, వాటిని పౌల్ట్రీ పరిశ్రమకు సబ్సిడీ పేరుతో సరఫరా చేసేది. కానీ అందులో కమీషన్ల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో అప్పటి ప్రభుత్వం మక్కలను కొనడం ఆపేసింది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కొనడం ప్రారంభించింది. మొక్కజొ న్నలతోపాటు దొడ్డు బియ్యం కూడా పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం పేదలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆ ప్రభుత్వంతో మాట్లాడి. అక్కడి సర్కారుతో ఒప్పందం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో నిల్వలను తగ్గించుకోవచ్చని సలహలు ఇస్తున్నారు. దీనికోసం టెండర్లు పిలిచి, ఎవరు ఎక్కువ ధరకు కోడ్‌ చేస్తే వారికే దొడ్డు బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని అధికారులు, డీలర్లు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -