బేరాలు లేక వ్యాపారులు బెంబేలు…
రెండేళ్ల గా సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : వానొస్తే బురద, ఎండేస్తే దుమ్ము.. ఏంటీ ఇవి సాదారణమే అనుకుంటున్నారా .! అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గత రెండేళ్ళుగా పుర ప్రజలు అనుభవిస్తున్న ఇక్కట్లు. బురద, దుమ్ముతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణీకులకు భయం భయంగా కాలం వెళ్ళదీస్తుంటే.. సెంట్రల్ లైటింగ్, ఇరు వైపులా రహదారి విస్తరణ పనులు కోసం తీసిన గోతులు ఎక్కడపడితే ఉండటంతో బేరాలు లేక వ్యాపారులు, వీధి వ్యాపారులు బెంబేలు పడుతున్నారు.
సెంట్రల్ లైటింగ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి 2 జూన్ 2013 నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులకు లాంచనంగా శంకుస్థాపన చేసారు. ఖమ్మం – దేవరపల్లి 325 బి.బి జాతీయ రహదారిలో అశ్వారావుపేట 119/0 (పేరాయిగూడెం) నుండి 121/0 జంగారెడ్డిగూడెం రోడ్లో కాకతీయ గేట్ వరకు 2 కి.మీ మేర రూ.11.79 కోట్లు, అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్లో 0/0 (పోలీస్ స్టేషన్) నుండి హెచ్.పీ బంక్ వరకు 1/5 అరకిలోమీటరు వరకు రూ.1 కోటి 35 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం,సెంట్రల్ – లైటింగ్ ఏర్పాటుకు పేరాయిగూడెం, పోలీస్ స్టేషన్ సమీపంలో శంకుస్థాపనలు చేసారు.
నాడే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు: డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కొంత కాలం పనులు నిలిచిపోయాయి. కొంత కాలం తర్వాత నుండి విస్తరణ, సెంట్రల్ రైటింగ్, మురుగునీటి కాలువల నిర్మాణ పనులు చేస్తునే ఉన్నారు. ఈ పనులు నత్తనడకను సైతం మరిపించేలా సాగడంతో పాటు అధికారులు ముందుచూపు లేకుండా ఇష్టారీతిన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రణాళిక ప్రకారం మురుగునీటి కాలువలు నిర్మించక పోవడం, అవి నిర్మించే సమయంలో మురుగును వేరే దిశగా మల్లించడంతో భద్రాచలం వెళ్లే మార్గంతో పాటు వివేకానంద కూడలి నుంచి భగత్ సింగ్ సెంటర్ వరకు మురుగు నీరు రోడ్ల పైకి చేరుతుంది.
సత్తుపల్లి దారిలో వాహనాల రాకపోకలతో లేచిన దుమ్ము భద్రాచలం వెళ్లే దారిలో మురుగు నీరు చేరి భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. సకాలంలో పనులు పూర్తి కాకపోపడంతో సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం మార్గాలు, పట్టణంలోని ప్రధాన రోడ్డు వాహనాల రాకపోకలతో బారీగా దుమ్ము లేవడంతో పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుమ్ము లేవకుండా నీటి తడి ఇవ్వాలని పుర వాసులు వేడుకుంటున్నారు. ఈ అంశంపై రోడ్లు, భవనాలు శాఖ డీఈఈ ప్రకాశ్ ను వివరణ కోరగా పనులు యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తున్నాం అన్నారు. త్వరలో మేజర్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.