Thursday, September 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువర్షం వచ్చిందంటే.. యథేచ్ఛగా కాలుష్య జలాలు

వర్షం వచ్చిందంటే.. యథేచ్ఛగా కాలుష్య జలాలు

- Advertisement -

– దోమడుగు నల్లకుంట, రాజనాల చెరువుల్లోకి వ్యర్థ జలాలు
– ప్రజల ప్రాణాలతో హెటిరో చెలగాటం
– చెరువులు, పంటపొలాల్లోకి పింక్‌ కలర్‌ నీళ్లు
– పంటపొలాలకు తీవ్ర నష్టం, ప్రజలకు చర్మ వ్యాధులు
– పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు
– శాంపిళ్లు సేకరించి చేతులు దులిపేసుకుంటున్న వైనం


వర్షం పడుతుంటే రసాయన పరిశ్రమలకు అడ్డూ అదుపు ఉండదు. యధేచ్ఛగా వ్యర్థ కాలుష్య జలాలను చెరువులు, కాలువల ద్వారా పంటపొలాల్లోకి వదులుతుంటారు. సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కంపెనీలకు పండుగ వచ్చినట్లైంది. నిబంధనల ప్రకారం కాలుష్య కారక కంపెనీలు తమ కంపెనీల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కంపెనీల్లో అవేమి ఏర్పాటు చేసుకోకుండా ఇష్టారీతిన వ్యర్థ జలాలను చెరువులు, వాగులు, పంట పొలాల్లో వదులుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తనిఖీలను మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో పంట పొలాల్లో పారుతున్న పింక్‌ కలర్‌ నీళ్లే ఇందుకు నిదర్శనం.

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
దోమడుగు గ్రామ సమీపంలో ఉన్న హెటిరో పరిశ్రమ నుంచి వర్షం పడినప్పు డల్లా కాలుష్య జలాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల్లో నిల్వ చేసిన వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకుండా బయటకు పంపుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే రసాయన వ్యర్థ జలాలను శుద్ధిచేసి, పర్యావరణానికి హాని కలగకుండా సురక్షిత ప్రాంతంలో వదలాల్సి ఉంటుంది.

చెరువులు కలుషితం.. పంటలకు నష్టం
దోమడుగు గ్రామం పరిధిలో నల్లకుంట, రాజనాల చెరువులు ఉన్నాయి. ఒక్కో చెరువు కింద సుమారు 100 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఈ చెరువుల పై భాగంలో హెటిరో సంస్థ ఉందని గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచే తరచూ కాలుష్య జలాలు బయటకు వస్తుంటాయని తెలిపారు. కాలుష్య జలాల వల్ల నల్లకుంట, రాజనాల కుంట చెరువుల కింద వేసిన పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాలుష్యంతో కంపు కొడుతున్న చెరువు పరిసరాలు, వర్షం వచ్చిందంటే.. ఘాటు వాసనతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. హెటిరో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

శాంపిళ్లు సేకరించిన పీసీబీ అధికారులు..
కాలుష్య జలాలతో నల్లకుంట, రాజనాల చెరువులు, పంట పొలాలు కాలుష్యమయం అయ్యాయని రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే, గ్రామానికి చెందిన ఓ రైతు తమ పంట పొలాల్లోకి వచ్చి పింక్‌ కలర్‌ నీళ్లు వచ్చాయని వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. పొలాల్లోకి దిగితే మొత్తం దురుద వస్తున్నదని, నీళ్లతో దుర్వాసన వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తప్పని పరిస్థితుల్లో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు చెరువుల్లోకి వచ్చిన కాలుష్య పింక్‌ జలాల శాంపిళ్లు సేకరించారు. అయితే ల్యాబ్‌కు పంపలేదని తెలిసింది.

పరిశ్రమల కాలుష్యాన్ని వెంటనే అరికట్టాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
దోమడుగు గ్రామ శివారులో ఉన్న నల్లకుంట, రాజనాల చెరువులు, పంట పొలాలు కాలుష్యమయం అయ్యాయి. కాలుష్యం కావటానికి కారణమైన హెటిరో కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. బొంతపల్లి, ఖాజీపల్లి, పాశ మైలారం, ఇస్నాపూర్‌, బోర్పట్లతో పాటు అనేక చోట్ల వర్షం పడటంతోనే పరిశ్రమల్లోని కాలుష్యం వ్యర్థ పదార్థాలను మోటార్లతో బయటకు వదులుతున్నారు. నీళ్లు రంగు మారి దుర్వాసన వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు కాలుష్య కారక కంపెనీకే మద్దతుగా నిలుస్తున్నారు. చెరువులు, కుంటలు, వాగులు కాలుష్యం అయినా పట్టించుకోవటం లేదు. జిల్లాకు గుండె కాయలాంటి మంజీర నది కూడా కలుషితం అవుతున్నది, తక్షణమే జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకొని గ్రామానికి, రైతులకు న్యాయం చేయాలి.

చేనులో దిగితే విపరీతమైన దురద వస్తుంది : మంగయ్య, రైతు, దోమడుగు కాలుష్య జలాల వల్ల చేనులో దిగితే కాళ్లు, చేతులు విపరీతమైన దురద వస్తుంది. మా గ్రామంలో కాలుష్య సమస్య కారణంగా అందరం ఇబ్బంది పడుతున్నాం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కురిసిన వర్షాలకు పింక్‌ రంగులో ఉన్న నీళ్లు నల్లకుంటలోకి వస్తున్నాయి. పొలాల్లో ఎక్కడ చూసినా రంగునీళ్లు పారుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయం అయ్యాయి. తాగునీరు కంపు వాసన వస్తున్నది. ఆ నీళ్లతో స్నానం చేస్తే.. జుట్టు ఊడి పోవడం. చర్మవ్యాధులు రావడం లాంటి సమస్యలతో దవాఖానల చుట్టూ తిరుగుతున్నాం. నల్లకుంట చెరువు ఆయకట్టు కింద పండించిన ధాన్యాన్ని ఎవరూ కొంటలేరు. ఇప్పటికైనా కాలుష్యం వెదజల్లుతున్న హెటీరో కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -