రావాల్సింది రూ.22,782 కోట్లు.. ఇప్పటి వరకు ఇచ్చింది రూ.4,213 కోట్లే
ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
ఏమాత్రం పట్టింపులేని రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు
రాష్ట్ర బీజేపీ ఎంపీలూ డమ్మీలే!
గతేడాదీ ఇదే తరహా ఆర్థిక వివక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగింపు దశకు వచ్చింది. ఈనెల ఒకటిన వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్ల కింద తెలంగాణకు రావాల్సిన నిధులు రూ.22,782.50 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి కేవలం రూ.4,213.29 (18.49 శాతం) కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఈ వివరాలను కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలో పేర్కొంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఇంకా రూ.18,569.21 (81.51 శాతం) కోట్లు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 40 రోజులే గడువు ఉంది. ఈలోపు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.18,569.21 కోట్లను విడుదల చేస్తుందా?అంటే అలాంటి అవకాశమే లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి గత ఆర్థిక సంవత్సర నిధుల విడుదలను ఉదాహరణగా చూపుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.21.636.15 కోట్లు రావల్సి ఉండగా, రూ. 5,451.85 కోట్లు (23.93 శాతం) మాత్రమే విడుదల చేశారు. మరోవైపు కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటాగా రూ.21,19 5.18 కోట్లు రావాలి. ఆ సొమ్ములో కూడా ఇప్పటి వరకు రూ.16,496.76 కోట్లు (77.83 శాతం) మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.4,698.42 కోట్లు రావల్సి ఉంది.
ప్రేక్షకపాత్రలో కేంద్రమంత్రులు బండి, కిషన్‌రెడ్డి డమ్మీలుగా బీజేపీ ఎంపీలు
రాష్ట్రానికి కేంద్రం నుంచి చట్ట ప్రకారం రావల్సిన నిధులను రాబట్టడంలో కేంద్రమంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజరుకుమార్ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఏదశలోనూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయట్లేదు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వేలకోట్ల నిధులు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామంటూ ప్రచారం చేసుకున్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగానే స్పందించారు. 15వ ఆర్థికసంఘం నుంచి గ్రామపంచాయతీలకు దాదాపు రూ.3వేల కోట్లు రావల్సి ఉండగా, ఇటీవల రూ.259.36 కోట్ల నిధుల్ని మాత్రమే విడుదల చేశారు.
దీనికే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రకటనలు విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో మిగిలిన రూ.2,740 కోట్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించే ధైర్యం మాత్రం ఇద్దరు మంత్రులు చేయలేదు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రులు కాగా, మిగిలిన ఆరుగురు ఎంపీలు రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడిగిన దాఖలాలే లేవు. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి రావల్సిన రూ.18,569.21 కోట్ల గురించి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కేంద్రం చూపుతున్న ఈ ఆర్థిక వివక్ష రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్రంగా పడుతోంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కటకట ఏర్పడుతున్నది.
ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లోనూ ఇదే వివక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షపాలిత రాష్ట్రాలన్నింటిపై ఇదే తరహా ఆర్ధిక వివక్షను ప్రదర్శిస్తున్నది. ‘కాగ్’ ఈ విషయాన్ని తన నివేదికలో స్పష్టంగా ఎత్తిచూపింది. పశ్చిమబెంగాల్‌కు గ్రాంట్ల కింద రూ.37,157.57 కోట్లు రావల్సి ఉండగా, రూ.8,313.56 (22.37 శాతం) కోట్లు, కేరళకు రూ.13,074.90 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3,675.73 (28.11 శాతం) కోట్లు విడుదల చేసింది. తమిళనాడుకు గ్రాంట్ల కింద రూ.23,834.11 కోట్లు రావాల్సి ఉండగా, రూ.12,785.62 (53.64 శాతం) కోట్లు మాత్రమే ఇచ్చారని ‘కాగ్’ తెలిపింది.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి చర్యల వల్లే దక్షిణాది రాష్ట్రాల్లో ‘పెడరలిజం’, నిధులు, సమానకేటాయింపులు వంటి అంశాలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలి. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కేంద్ర ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



